ఉసురు తీసిన రాకాసి అల

4 Jan, 2014 02:50 IST|Sakshi

 పూండి, న్యూస్‌లైన్:
 చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన ఓ మత్స్యకారుడు రాకాసి అల తాకిడికి తెప్ప తిరగపడడంతో మృత్యువాతపడగా మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. వివరాలు ఇవీ... వజ్రపుకొత్తూరు మండలం కొత్తపేట పంచాయతీ పరిధి దిబ్బవానిపేటకు చెందిన గుంటు లింగరాజు(45) అడ్ల సోమేష్, డి.నారాయణతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లాడు. వేటకు వెళ్లిన అరగంటకే ఓ రాకాసి అల ఉవ్వెత్తున ఎగిసిపడడంతో తెప్ప బోల్తాపడింది. దీంతో లింగరాజు తెప్ప కింద చిక్కుకుపోయి ఊపిరాడక మృతి చెందాడు. ఆయనకు భార్య కాంతమ్మ, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చేపల వేటపై ఆధారపడి జీవించే ఇంటి పెద్దదిక్కు తిరిగి రాని లోకాలకు పోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వీఆర్వో కె.ఇందిరాప్రియదర్శిని ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు తీరంలోనే శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టానికి పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 
  కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ పి.జోగారావు చెప్పారు. ఇదిలా ఉండగా మత్స్యశాఖ ద్వారా మృతుని కుటుంబానికి *2 లక్షలు సహాయం అందించి ఆదుకుంటామని ఎఫ్‌డీవో కె.శ్రావణి చెప్పారు. దస్త్రాలన్నీ సకాలంలో అందిస్తే తొలి విడతలో *లక్ష, ఆ తర్వాత మరో *లక్ష అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. లింగరాజు కుటుంబానికి ఆపద్భందు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆదుకోవాలని సర్పంచి గోవింద పాపారావు, మాజీ సర్పంచి ఎ.రాజులు తదితరులు కోరారు.
 
 

మరిన్ని వార్తలు