స్ఫూర్తి ప్రదాత.. కీర్తి పతాక

28 Jul, 2015 01:24 IST|Sakshi
స్ఫూర్తి ప్రదాత.. కీర్తి పతాక

జిల్లాతో అబ్దుల్‌కలాంకు విడదీయరాని అనుబంధం
 

శాస్త్రవేత్తగా మహాద్భుతాలను ఆవిష్కరించారు. భారత అంతరిక్ష ప్రయోగ రంగ చరిత్రలో  మహా అధ్యాయాలను సృష్టించారు. అపురూప ఘట్టాలకు ఆద్యుడిగా నిలిచారు. సాహసోపేత నిర్ణయాలతో గురితప్పక లక్ష్యాలను ఛేదించారు. కలలు కనండి.. ఆ కలలను సాకారం చేసుకోండి అంటూ యువతకు దిశానిర్దేశం చేశారు.. ఆకాశమే హద్దుగా  సృజన శక్తులుగా ఎదగాలని విద్యార్థులకు ఉద్బోధించారు. నేటి తరానికి, రేపటి భవితకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు... అందరికీ సెలవంటూ గగనతలానికి చేరారు.
 
గుంటూరు ఎడ్యుకేషన్ : భారతదేశం గర్వించదగిన మహనీయుడు ప్రఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం హఠాన్మరణం జిల్లాను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన కన్నుమూశారని ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ప్రజానీకం ఆయన స్ఫూర్తిని, కీర్తిని కొనియాడకుండా ఉండలేకపోయింది. శాస్త్రవేత్తగా ఆయన సాధించిన ఘన విజయాలు, రాష్ట్రపతిగా ఆయన అందించిన సేవలను కీర్తిస్తూ, ఆయన లేని లోటు పూడ్చలేనిదంటూ కీర్తించారు. డాక్టర్ అబ్దుల్ కలాంకు జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది. తొలిసారిగా ఆయన 2008 ఏప్రిల్ 3న జిల్లాకు వచ్చారు. తాడేపల్లి సమీపంలోని సీతానగరంలో రామ కృష్ణ మిషన్ పాఠశాలను సందర్శించి చేసిన ప్రసంగం విద్యార్థులను ఉత్తేజితులను చేసింది. అదే రోజు గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు స్ఫూర్తి దాయకమైన ప్రసంగం చేశారు. తిరిగి 2010 జనవరి 25న మంగళగిరిలోని ఎన్నారై మెడికల్ కళాశాల స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై వైద్య విద్యార్థులకు పట్టాలు అందజేశారు.

మళ్లీ ఐదేళ్ల తరువాత ఈ ఏడాది మార్చి 15న జిల్లాకు వచ్చిన అబ్దుల్ కలాం రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుంటూరు నగరంలోని రమేష్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు, అదే రోజు గుంటూరు రూరల్ మండలం చోడవరంలోని చేతన ప్రాంగణంలో నిర్వహించిన శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్ విద్యాసంస్థ స్వర్ణోత్సవ వేడు కలకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చేతివేళ్ల ఆకారంలో రూపొందించిన పైలాన్‌ను ఆవిష్కరించిన కలాం విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. చిన్నారులతో ముచ్చటించేందుకు ఆయన అధిక సమయాన్ని కేటాయించారు. అబ్దుల్‌కలాంను చూసేందుకు దేశ, విదేశాల్లో స్థిరపడిన వేంకటేశ్వర బాలకుటీర్ పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విద్యార్థుల భవిత కోసం చివరి నిమిషం వరకు పరితపించిన కలాం చివరకు సోమ వారం సాయంత్రం షిల్లాంగ్‌లోని ఐఐఎంలో విద్యార్థుల నుద్దేశించి ప్రసంగిస్తుండగానే కుప్పకూలారు. ఆయన మరణం జిల్లా వాసులను తీవ్రంగా కలచి వేసింది.

దేశం గొప్ప వ్యక్తిని కోల్పోయింది ...
దేశం గొప్ప మహనీయుడిని కోల్పోయింది. అబ్దుల్ కలాం చేసిన పరిశోధనలతో  అణ్వస్త్ర దేశంగా ఖ్యాతి దక్కింది. అణ్వస్త్ర పితామహుడిగా శాశ్వత గుర్తింపు పొందిన కలాం అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించి ఆ పదవికే వన్నెతెచ్చారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు. విద్యార్థులు, యువతరం ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని శాస్త్రవేత్తలుగా రాణించాలి.
 - మర్రి రాజశేఖర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
 

మరిన్ని వార్తలు