నాణ్యత లేని విత్తన సంస్థలపై వేటు

23 May, 2020 05:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: ► అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మేపర్తి. డి.వెంకటరాయుడు మూడు మూటల విత్తన కాయల్ని తీసుకున్నాడు. మూట విప్పి చూస్తే అవి కె–6 రకంగా అనిపించలేదు. కాయల్ని వలవకుండానే రెండు మూడు కిలోల విత్తనాలు కిందపడ్డాయి. అవి నాణ్యత లేనివిగా గుర్తించి గ్రామ వ్యవసాయాధికారికి ఫిర్యాదు చేశాడు.
► అనంతపురం రూరల్‌ మండలం నారాయణపురానికి చెందిన జగన్‌ మూడు బస్తాల వేరుశనగ విత్తనాన్ని కొన్నాడు. కాయల్ని కొట్టి విత్తనాన్ని చూస్తే పప్పు పుచ్చిపోయి, ఏమాత్రం నాణ్యత లేకుండా ఉంది. దీంతో తనతోపాటు కాయల్ని కొన్న 130 మంది రైతులతో కలిసి శుక్రవారం అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఇలా.. అనంతపురం జిల్లాలో ఐదారు మండలాలు.. నార్పల, అనంతపురం రూరల్, కందుకూరు, కదిరి, పెనుగొండ, రాప్తాడుల్లో నాణ్యత లేని విత్తన వేరుశనగ కాయలు పంపిణీ అయ్యాయి. రైతుల నుంచి ఒక్కసారిగా ఫిర్యాదులు రావడంతో వ్యవసాయ శాఖ, ఏపీ సీడ్స్, ఏపీ మార్క్‌ఫెడ్, ఇతర శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. ఇలా ఎలా జరిగిందో తెలుసుకుని చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అనంతపురంలోనే ఉన్న ఏపీ సీడ్స్‌ ఎండీ శేఖర్‌ బాబును ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం నాణ్యత లేని కాయల్ని సరఫరా చేసిన ప్రైవేటు సంస్థలపై వేటు వేశారు. ఆ సంస్థలు సరఫరా చేసిన 835 క్వింటాళ్ల కాయల్ని వెనక్కి తీసుకుని రైతులకు మేలైన కాయల్ని సరఫరా చేస్తామని ప్రకటించారు.

రైతుల హర్షాతిరేకాలు
పుచ్చిపోయిన, పనికిమాలిన నాణ్యత లేని కాయల్ని వెనక్కు తీసుకుని తిరిగి నాణ్యమైన కాయల్ని ఇస్తామని వ్యవసాయ శాఖాధికారులు ప్రకటించడం పట్ల ఆయా మండలాల రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. గతంలో కాయలు బాగోకపోతే పారేయడం తప్ప వేరే మార్గం ఉండేది కాదని.. ఇప్పుడా బాధ తప్పిందని నారాయణపురానికి చెందిన వేణుగోపాల్, రాప్తాడుకు చెందిన జయప్రకాష్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి తదితరులు తెలిపారు. 

ఆ రెండు సంస్థలే..
► అనంతపురం,కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు కె–6 రకం 4,81,344 క్వింటాళ్లు, నారాయణి 25,263 క్వింటాళ్లు, ధరణి 992 క్వింటాళ్లు కలిపి మొత్తం 5,07,599 క్వింటాళ్ల వేరుశనగ విత్తనం కాయ కావాల్సి ఉంది. 
► ఇందులో వ్యవసాయ శాఖ ’రైతు విత్తనం రైతు చెంతకే’ అనే కార్యక్రమం కింద 2 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన కాయను కొనుగోలు చేసింది. 
► మిగతా 3 లక్షల క్వింటాళ్ల కాయను కొనుగోలు చేసే బాధ్యతను ఏపీ సీడ్స్‌కు అప్పగించింది. అయితే.. రైతుల వద్ద సరుకు లేకపోవడంతో ఏపీ సీడ్స్‌ అధికారులు ప్రైవేటు సంస్థలను ఆశ్రయించారు. వీటిలో కొన్ని నాణ్యత లేని విత్తన కాయలను సరఫరా చేశాయి.
► ఈ నెల 18 నుంచి గ్రామ సచివాలయాల వద్ద విత్తన పంపిణీ ప్రారంభమైంది. 
► అనంతపురం రూరల్, రాప్తాడు, నార్పల మండలాలకు శ్రీ సుబ్రమణ్యేశ్వర అగ్రిటెక్‌ (వనపర్తి, ప్రొద్దుటూరు), గంగాధర్‌ అగ్రిటెక్‌ (ప్రొద్దుటూరు) నుంచి విత్తన కాయలు వచ్చినట్టు వ్యవసాయ శాఖాధికారులు గుర్తించి వాటిపై వేటు వేశారు.
► మనీలా, కంబదూర్, ఎ.నారాయణపురం, బొమ్మేపర్తి, గంగిరెడ్డిపల్లి, మరూర్‌–1, రాప్తాడు, చెలమూరు గ్రామాల్లోని రైతులకు తిరిగి నాణ్యమైన కాయల్ని సరఫరా చేస్తామని ఏపీ సీడ్స్‌ ప్రకటించింది.
► మిగతా మండలాల్లో పరిస్థితిని పరిశీలించేందుకు ప్రభుత్వం నిఘా బృందాలను పంపింది. 
► రైతులు తమ సమస్యలను 1902, 1907కు ఫిర్యాదు చేయొచ్చు.

మరిన్ని వార్తలు