బంగార్రాజుకు భారీ స్వాగతం

21 Apr, 2016 00:33 IST|Sakshi
బంగార్రాజుకు భారీ స్వాగతం

కాకినాడ రూరల్ : సోగ్గాడే చిన్నినాయన బంగార్రాజు(అక్కినేని నాగార్జున)కు తిమ్మాపురం అచ్చంపేటజంక్షన్, పండూరు గ్రామాల్లో అభిమానులు ప్రజలు భారీ స్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకే కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున అచ్చంపేట జంక్షన్‌కు చేరుకున్నారు. మండుటెండలో నాగార్జున రాక కోసం దాదాపుగా రెండున్నర గంటల పాటు ఎదురు చూశారు. ఒంటిగంట సమయంలో నాగార్జున రాజమండ్రి నుంచి సామర్లకోట మీదుగా అచ్చంపేట జంక్షన్‌కు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున ఆయనను చుట్టుముట్టారు.
 
 అచ్చంపేట జంక్షన్‌లో కన్నబాబు నాగార్జునకు పూలమాలలు వేసి ఘనస్వాగతం పలికారు. అక్కడ కొంతసేపు అభిమానులు, ప్రజలను నాగార్జున పలుకరించారు. ఈ ప్రాంతం చాలా అందంగా ఉందని, ఇక్కడి ప్రజల ఆదరణ మరువలేనిదన్నారు. అక్కడి నుంచి వేలాది మంది అభిమానులతో ఊరేగింపుగా ప్రత్యేక కారులో నాగార్జున, కన్నబాబు పండూరు చేరుకున్నారు. ఎక్కడికక్కడ నాగార్జునతో కరచాలం చేసేందుకు యువకులు, పెద్దలు, మహిళలు ఎగబడడంతో నాగార్జున కారు దిగేందుకు చోటులేకుండా పోయింది.
 
 ఒకానొక దశలో తొక్కిసలాట జరిగింది. నాగార్జునకు ప్రజలు ఘన స్వాగతం పలకడం, పండూరులో ఆయన ‘నిర్మలా కాన్వెంట్’ చిత్ర షూటింగ్‌లో భాగంగా ఉచిత వైద్యశిబిరాన్ని ప్రారంభించడం వంటి సన్నివేశాలను  చిత్రీకరించారు.  ఈ వైద్య శిబిరాన్ని సూర్య గోబెల్, ట్రస్ట్, నయినా ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అనంతరం పండూరు ఊరి చివరన సోగ్గాడే చిన్నినాయన దర్శకులుకురసాల కళ్యాణ్‌కృష్ణ కొద్దిసేపు షూటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. నాగార్జున కారు దిగేందుకు ప్రజలు అవకాశం ఇవ్వలేదు. దీంతో కొన్నిసన్నివేశాలను చిత్రీకరించలేదు. నాగార్జున రాకతో పండూరు గ్రామం తిరునాళ్లను తలపించింది. సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.

>
మరిన్ని వార్తలు