29న జిల్లా బంద్‌

27 Jun, 2018 12:47 IST|Sakshi
బంద్‌ పోస్టర్‌ను విడుదల చేస్తున్న అఖిల పక్షనేతలు

జయప్రదం చేయాలని అఖిలపక్ష నేతల పిలుపు

బంద్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ :రాష్ట్ర విభజన చట్టంలో తెలిపిన విధంగా జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలని కోరుతూ ఈ నెల 29న  అఖిల పక్షం తలపెట్టిన జిల్లా బంద్‌ను జయప్రదం చేయాలని కడప ఎమ్మెల్యే అంజద్‌ బాషా, మేయర్‌ సురేష్‌బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలు కడప ఉక్కు పరిశ్రమను  ఏర్పాటు చేయకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని తెలిపారు. గత ఎన్నికల సమయంలో దోస్తీగా ఉన్న బీజేపీ, టీడీపీలు రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చుతామని సృష్టంగా చెప్పి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం తగదన్నారు.

నాలు గేళ్లు బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు జిల్లాలో ఉక్కు పరిశ్రమ గురించి పట్టించుకోకుండా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజలను మభ్య పెట్టేందుకు దొంగపోరాటాలు చేయడం సరికాదన్నారు. టీడీపీ నాయకులు ప్రజాధనాన్ని దుర్వి నియోగం చేస్తూ అధికారులను సైతం తమ పార్టీ కార్యకలాపాలకు వాడుకోవడం దారుణమన్నారు. టీడీపీ చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. పాలక ప్రభుత్వాలు కమిటీల పేరుతో కాలయాపన చేసి నేడు పరిశ్రమ ఏర్పాటుకు ïఫీజు బిలీటీ లేదని చెప్పడం సరికాదన్నారు.

జిల్లాలో ఉక్కు పరిశ్రమకు కావాల్సిన ముడిసరుకు, విద్యుత్, రవాణా, నీటి సౌకర్యం వంటివి మెండుగా ఉన్నా.. టీడీపీకి జిల్లాలో ఓట్లు, సీట్లు రాలేదనే అక్కసుతోనే జిల్లా అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవని దుయ్యబట్టారు. విభజన హామీల కోసం కేంద్రంతో పోరాడకుండా నాలుగు సంవత్సరాలు అసమర్దపు పాలన చేసి రాష్ట్ర ప్రజలను నయవంచనకు గురి చేశారని ధ్వజమెత్తారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధనే లక్ష్యంగా ఈ నెల 28న తలపెట్టిన రహదారుల దిగ్బంధనం,  29న తలపెట్టిన ఉక్కు బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు, విద్యా, వ్యాపార సంస్దలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఐ, సీపీఎం, జనసేన నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు