సాక్షి ఎఫెక్ట్‌ : ‘నారాయణ’ లో గంటా ఆకస్మిక తనిఖీలు

14 Oct, 2017 11:18 IST|Sakshi
విశాఖపట్నంలోని నారాయణ కాలేజీ, హాస్టల్‌లో వండిన ఆహారాన్ని తనిఖీ చేస్తున్న మంత్రి గంటా.

సాక్షి, విశాఖపట్నం : చదువుల కోసం నారాయణ-చైతన్య కాలేజీల్లో చేరినవారు ఒక్కొక్కరుగా శవాలై ఇంటికి తిరిగొస్తుంటే ఆ తల్లిదండ్రుల రోదన వర్ణనాతీతం. గడిచిన మూడేళ్లలో ఆయా క్యాంపస్‌లలో ఏకంగా 38 మంది ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనుమతులు లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తూ, ర్యాంకుల కోసం విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోన్న యాజమాన్యాలే ఇందుకు బాధ్యత వహించాలని పెద్ద ఎత్తున డిమాండ్‌ సైతం వ్యక్తమైంది. నారాయణ-చైతన్య కాలేజీల్లో నానాటికీ పెరుగుతోన్న విద్యార్థుల ఆత్మహత్యలపై ‘సాక్షి’  పలు సంచలనాత్మక కథనాలను ప్రచురించింది. ఆ కథనాలతో ఇప్పుడు ప్రభుత్వంలో కొద్దిపాటి కదలిక వచ్చింది.

గంటా ఆకస్మిక తనిఖీలు : వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం విశాఖ నగరంలోని నారాయణ-చైతన్య హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కాలేజీలకు అనుబంధంగా కొనసాగుతోన్న ప్రైవేట్‌ హాస్టల్స్‌ను తనిఖీ చేసిన ఆయన.. వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. దానితోపాటు బోధన జరుగుతున్న తీరుపై ఆరాతీశారు. నిబంధనలు పాటించకపోతే ఎవ్వరినైన ఉపేక్షించబోమని అన్నారు. ప్రైవేట్‌ కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై ఆయన స్పందిస్తూ.. పిల్లల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదని,  అవసరమైతే కళాశాల యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదుచేసేందుకు వెనుకాడబోమని చెప్పారు. ఈ నెల 16న రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో సమావేశం కాబోతున్నట్లు తెలిపారు. ఇంటర్‌ బోర్డ్‌ పేర్కొన్న నిబంధనలను అన్ని కళాశాలలు విధిగా అమలుచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

158 హాస్టళ్లకు అసలు అనుమతేలేదు : విద్యార్థుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని శుక్రవారం మొదటిసారి అంగీకరించిన మంత్రి గంటా.. 24 గంటలు తిరగకముందే నారాయణ కాలేజీల్లో తనిఖీలు చేయడం గమనార్హం. పి.నారాయణ ఏపీ మంత్రిగా కొనసాగుతున్న గడిచిన మూడేళ్లలో నారాయణ-చైతన్య కాలేజీలకు అనుబంధంగా.. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే దాదాపు 158 ప్రైవేట్‌ హాస్టళ్లు వెలిశాయి. దీనిపై ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క నోటీసు కూడా జారీ కాకపోవడం గమనార్హం. మంత్రులు గంటా, నారాయణలు వియ్యంకులన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు