తుది దశ ‘పంచాయతీ’ ప్రశాంతం

1 Aug, 2013 03:08 IST|Sakshi

సాక్షి, అనంతపురం : తుది దశ పంచాయతీ ఎన్నికలు బుధవారం అనంతపురం రెవెన్యూ డివిజన్‌లో ప్రశాంతంగా ముగిశాయి. డివిజన్ పరిధిలోని 21 మండలాల్లో 388 పంచాయతీలుండగా.. ఇప్పటికే 43 ఏకగ్రీవమయ్యాయి. దీంతో  345 పంచాయతీ సర్పంచ్, 3,854 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. ఓటర్లు ఉదయం ఏడు నుంచే  పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
 
 ఎటువంటి ఉద్రిక్తతలకు తావివ్వకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. 345 పంచాయతీల్లో 6,72,482 మంది ఓటర్లు ఉండగా..5,93,230 (88.53 శాతం) మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. ముఖ్య నాయకులకు ప్రతిష్టాత్మకంగా మారిన ఉరవకొండ, బుక్కరాయసముద్రం, శింగనమల, యాడికి, నార్పల మేజర్ పంచాయతీలలో పోలింగ్ ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగింది.
 
 అత్యంత సమస్యాత్మకమైన 238 పోలింగ్ కేంద్రాలతో పాటు సమస్యాత్మకమైన 150 కేంద్రాలను ఎస్పీ శ్యాంసుందర్ పరిశీలించారు.  ఉరవకొండ మండలం రాకెట్లలో 300 మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో వారు పోలింగ్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయినా ఓటు వేసే అవకాశం లేకుండా పోయింది. వజ్రకరూరు మండలం జరుట్ల రాంపురంలో ఏజెంట్ల విషయంపై టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
 
 
  కాగా...  జిల్లాలో మొత్తం 1003 పంచాయతీలుండగా 67 ఏకగ్రీవం కావడంతో మిగిలిన వాటికి మూడు దశల్లో ఎన్నికలు పూర్తి చేశారు. హులికల్లు పంచాయతీ ఏకగ్రీవం కోసం నిర్వహించిన వేలం పాట వివాదాస్పదం కావడంతో ఫలితాన్ని పెండింగ్‌లో పెట్టారు. ఎస్టీ ఓటర్లు లేని కారణంగా రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని బీఎన్ హళ్లి పంచాయతీ ఎన్నిక వాయిదా పడింది. జిల్లాలో ఇంతకుముందు పంచాయతీ ఎన్నిక లు ఘర్షణ వాతావరణంలో జరిగాయి. ఈసారి మాత్రం ప్రశాంతంగా నిర్వహించేందుకు  కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎస్పీ శ్యాంసుందర్ కృషి చేశారు. వారు  ప్రణాళికబద్ధంగా వ్యవహరించి విజయవంతమయ్యారు.
 

మరిన్ని వార్తలు