ఏపీలో కంపెనీల స్థాపనకు చంద్రబాబు ఆహ్వానం

19 Jan, 2016 16:12 IST|Sakshi

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంగా ఆయన పర్యటన కొనసాగుతోంది. రెండోరోజు పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు మంగళవారం జ్యురిక్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్  వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఆంధ్రప్రదేశ్ వినూత్న ఆవిష్కరణలకు వేదికగా ఉంది.  ప్రవాస తెలుగువారు రాష్ట్రానికి సేవలందించడానికి, కొత్త పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి' అని ఎన్నారైలకు పిలుపునిచ్చారు.

అనంతరం జ్యురిక్లో జరిగిన ఇన్వెస్టర్ మీట్లో చంద్రబాబు నాయుడు బృందం మియర్ బర్గర్ కంపెనీ ప్రతినిధులతో భేటీ కాగా, ఎగుమతి ఆధారిత పరిశ్రమల వైపు మియర్ బర్గర్ సంస్థ ఆసక్తి చూపింది. విశాఖ, రాజమండ్రి నగరాల్లో వేటి ప్రత్యేకతలు వాటికి ఉన్నాయని, కంపెనీ స్థాపించటానికి  అన్నివిధాల సహకరిస్తామని మియర్ బర్గర్ కంపెనీ ప్రతినిధులకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. కాగా ఉత్పత్తుల్లో 50 శాతం ఎగుమతికి అవకాశమివ్వాలని, మిగిలిన 50 శాతం దేశీయ అవసరాలకు విక్రయించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ప్రతిపాదించారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) 46వ సదస్సుకు చంద్రబాబుతో పాటు 9 మంది సభ్యుల బృందం పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 24వరకూ వీరి పర్యటన కొనసాగనుంది.

మరిన్ని వార్తలు