ఆత్మక్షోభ !

5 Jan, 2015 02:48 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండలం కనమనపల్లెకు చెందిన ఎం.మునెప్ప (76) సెంటు భూమిలేని నిరుపేద. చిన్న పూరి గుడిసే నివాసం. కొడుకు మద్యానికి  బానిసై ఎటో వెళ్లిపోయాడు. మతిస్థిమితంలేని మనవరాలు రోజా (15)కు ఆయన ఆధారం. దివంగత సీఎం వైఎస్. రాజశేఖరరెడ్డి హయాం నుంచి ఇస్తున్న పింఛనే వారికి ఆధారం. నాలుగు నెలలుగా మునెప్పకు పింఛన్ నిలిపి వేశారు. ఒకపూట తిండికి నోచుకోని  మునెప్ప వేదనతో డిసెంబర్ 26 న ప్రాణాలు వదిలాడు. గ్రామస్తులు చందాలువేసి దహన సంస్కారాలు పూర్తిచేశారు.
 
అదే గ్రామానికి చెందిన  నాగమ్మ  (80) నిరుపేద. కొడుకు రెండు చేతులు లేని వికలాంగుడు. మనవరాలి వద్ద ఉంటోంది. మూడునెలలుగా పింఛన్ ఆగిపోయింది. బతుకు భారంగా మా రింది. అధికారులకు, స్థానిక నేతలకు మొరపెట్టుకున్నా ఎవరి మనసూ  కరగలేదు. మనవరాలికి భారం కాకూడదనుకున్న నాగమ్మ  వేదనతో  ఈ ఏడాది జనవరి 3న ప్రాణాలు వదిలింది.
 
విజయపురం మండలం కేవీ పురం గ్రామానికి చెందిన రామానాయుడు, రామచంద్రాపురం మండలం కు ప్పంబాదూరుకు చెందిన నరసింహా రెడ్డి, నెమల్లగుంటపల్లెకు చెందిన రామక్క, పీవీపురానికి చెందిన ముత్యాలమ్మ, కొత్తకుప్పం ఎస్టీ కాలనీకి చెం దిన వికలాంగుడు దేసయ్య సహా ఏడుగురికి పింఛన్ల కోసం వగర్చి ప్రాణాలు కోల్పోయారు. బయోమెట్రిక్ విధానం పుణ్యమాని క్యూల్లో రోజుల తరబడి నిల్చోలేక  అనారోగ్యానికి గురై మరో నలుగురు  మృత్యువాత పడ్డారు. మొత్తంగా ఒక్క నెలలోనే జిల్లాలో 11 మంది ప్రాణాలు వదిలారు. సీఎం చం ద్రబాబు సొంత జిల్లాలో అర్హులైన పేద ల  పింఛన్లు  వేల సంఖ్యలో తొలగించడంతో ఆసరా కోల్పోయిన వారు మనోవేదనతో ప్రాణాలు వదులుతున్నారు.
 
దివంగత సీఎం వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగులు 3,96,444 మందికి పింఛన్లు ఇచ్చేవారు.  ప్రతి నెలా  1వ తేదీ డబ్బు ఇంటి వద్దే అం దించే వారు.  చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పరిస్థితి తారుమారైంది. రాజకీయ కక్షతో ప్రభుత్వం  అర్హుల పింఛన్లు తొలగించింది. దీంతో జిల్లాలో 34,190 పింఛన్లు కోల్పోయారు.

అన్ని అర్హతలు ఉన్నప్పటికీ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఆధారం కోల్పోయారు. ఆకలితో కొందరు, ఆవేదనతో కొందరు, ఆసరా కోల్పోయి ఇంకొం దరు ప్రాణాలు వదులుతున్నారు.  సీఎం సొంత నియోజకవర్గంలోని మునెప్ప ఆకలిచావు, నాగమ్మ మరణం పాలకులకు  చెంపపెట్టులాంటిదే.

మరిన్ని వార్తలు