ఫణిగిరిని అభివృద్ధి చేస్తా | Sakshi
Sakshi News home page

ఫణిగిరిని అభివృద్ధి చేస్తా

Published Mon, Jan 5 2015 2:47 AM

ఫణిగిరిని అభివృద్ధి చేస్తా

 ఫణిగిరి..బౌద్ధం పరిఢవిల్లిన నేల..వంద ఏళ్లనాటి చర్రితకు ఎన్నో ఆనవాళ్లు....తవ్వకాల్లో వెలుగుచూసిన నిర్మాణాలు, చిహ్నాలు, శాసనాలు ఎన్నెన్నో... కానీ  గత పాలకుల నిర్లక్ష్యం, పురావస్తు శాఖ అధికారుల అలసత్వంతో ఈ ప్రాచీన సంపదకు రక్షణ కరువైంది. పర్యాటక కేంద్రంగా మార్చుతామనే పాలకుల హామీలు నీటిమీద రాతలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఫణిగిరి గ్రామాన్ని పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్ సందర్శించారు. సాక్షి తరఫున రిపోర్టర్‌గా మారి..అక్కడి సమస్యలు తెలుసుకున్నారు.
 
 గాదరి కిషోర్: మీపేరేమిటి..ఇక్కడి బౌద్ధారామం  పరిస్థితి ఎలా ఉంది.
 పానుగంటి నర్సింహారెడ్డి: మా ఊరిలోని బౌద్ధారామానికి  ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అయితే దీనిని పర్యాటక కేంద్రంగా మార్చుతామని పాలకులు గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు. ఇంత వరకు ఎలాంటి అభివృద్ది జరగలేదు.
 గాదరి: అన్నా...ఏం సమస్యలు ఉన్నాయె..?
 ఉప్పలయ్య: ఫణిగిరిలో పురావస్తుశాఖ జరిపిన తవ్వకాల్లో ఎంతో విలువైన ప్రాచీనసంపద బయల్పడింది. కానీ దీనికి రక్షణ లేదు. ఈ సంపదనంతా ఓ పాతభవనంలో పడవేశారు.
 గాదరి : ఈ భవనంలో ఎప్పడి నుంచి  పనిచేస్తున్నావు.
 వీరయ్య (సెక్యూరిటీగార్డు) : నేను పది సంవత్సరాలుగా ప్రాచీన సంపదను ఉంచిన భవనానికి కాపలాగా ఉంటున్నాను. నాకు నెలకు మూడు వేల రూపాయల జీతం ఇస్తున్నారు. తెలంగాణ వచ్చింది కదా...ఈ ప్రభుత్వంలోనైనా నా ఉద్యోగాన్ని పర్మనెంట్ చేయాలి.
 గాదరి : అన్న సమస్య ఎందో చెప్పు..
 యాదయ్య: మా ఊర్లోన్ని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయానికి వందల ఎకరాల భూములు ఉన్నాయి. అయినా ఆలయం ధూపదీపనైవేద్యాలకు దూరమైంది. గుడిలో గుప్తనిధుల కోసం విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నారు.
 గాదరి : మండలంలో ఉన్న సమస్యలేమిటి ?
 కొమ్మినేని సతీష్: గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బోర్లలో ఫ్లోరిన్ అధికంగా ఉండడంతో ఆ నీటిని ప్రజలు తాగి రోగాల పాలవుతున్నారు.
 గాదరి : అవ్వా... పింఛన్ వస్తుందా ?
 యాదమ్మ:  సారూ...మూడు నెలల సంది పింఛన్లు  రావడం లేదు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు.
 గాదరి: ఏం తాత.. నీసమస్య ఏంటి ?
 గుగులోతు కాలు: నేను ముసలివాడిని అయ్యా. మాకుటుంబానికి భూమి లేదు. వ్యవసాయానికి ప్రభుత్వ భూమి ఇప్పించాలి.
 గాదరి: అమ్మా నీ సమస్య...
 యాదమ్మ: నాకు 65 ఏళ్ల వయస్సు ఉన్నా పింఛన్ రావడం లేదు. రేషన్‌కార్డులో తక్కువ వయస్సువేశారు. మీరైనా పింఛన్ ఇప్పించండి.
 గాదరి: అన్నా మీ ప్రాంత సమస్యలు  ఏంటో చెప్పండి.
 దాయం విక్రంరెడ్డి: తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయింది.  ఎలాంటి సాగునీటి వసతి లేదు. ఎస్సారెస్పీ కాలువలు తీసినా నీళ్లు  రావడం లేదు.
 గాదరి : అక్కా సమస్యలేంటి.
 పేరాల పూలమ్మ: తండాల్లో  నీటి సమస్య తీవ్రంగా ఉంది. సమస్య పరిష్కారానికి ముందస్తుగా నిధులు మంజూరు చేయించాలి.
 గాదరి: సార్ బాగున్నారా...అంతా
 కులాసేనా..
 ఓరుగంటి సత్యనారాయణ: ఈ ప్రాంతంలో కరెంటు సమస్య తీవ్రంగా ఉంది. లోఓల్టేజీతో పంటలు ఎండిపోతున్నాయి.
 గాదరి : జనార్దన్‌గారు చెప్పండి మీసమస్య
 సుంకరి జనార్దన్: తిరుమలగిరిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఈవిద్యా సంవత్సరం నుంచే ప్రారంభిచేలా చూడాలి.
 గాదరి : ఆ వీరప్రసాద్ ఇక్కడ పరిస్థితి ఏమిటో...
 దావుల వీరప్రసాద్: అర్వపల్లిలోని శ్రీయోగానంద లక్ష్మీనారసింహస్వామి దేవాలయ భూముల సమస్యలు పరిష్కరించాలి. 750 ఎకరాల భూములున్నా ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు కష్టమవుతుంది. రైతులకు ఆమోదయోగ్యమైన ధరకు భూమిని అమ్మి పట్టాలు ఇవ్వాలి. దర్గాను కూడా అభివృద్ధి చేయాలి.
 గాదరి : అశోకన్న నీ సమస్య చెప్పు
 మూల అశోక్‌రెడ్డి: తిరుమలగిరి మండల కేంద్రంలో బస్‌డిపో ఏర్పాటు చేయాలి.
 గాదరి : మీ ఊరు సమస్య లేమిటి
 ఎ. మధుసూదన్‌రెడ్డి: రైతులకు పంట రుణాలు పూర్తిగా మాఫీ చేసి ఒకేసారి ఎక్కువ మొత్తంలో రుణాలందజేయాలి.
 
 తుంగతుర్తిని జిల్లాలో ఆదర్శ నియోజకవర్గంగా మార్చుతా
  గత పాలకుల నిర్లక్ష్యంతో తుంగతుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుబడిపోయింది. ఫణిగిరి బౌద్ధక్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా, సీతారామచంద్రస్వామి దేవాలయాన్ని రెండో భద్రాద్రిగా మార్చడానికి పక్క గ్రామానికి చెందిన మంత్రి జగదీష్‌రెడ్డి  సహకారంతో ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తాం. ఎస్సారెస్పీ రెండో దశ కాలువ పనులు పూర్తి చేయించి ఈప్రాంతానికి సాగు, తాగు నీరందిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు, ఆహార భద్రతా కార్డులు వందశాతం ఇప్పిస్తాం. ఒంటరి, మహిళలు, అభయహస్తం పింఛన్‌దారుల సమస్యలపై ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుని నెలకు రూ. 1000 పింఛన్ ఇస్తుంది. ఫణిగిరిలో తవ్వకాల్లో బయల్పడిన ప్రాచీన సంపద కోసం మ్యూజియం ఏర్పాటు చేసి భద్రపరుస్తాం. తాగునీటి అవసరాలకు గ్రామాగ్రామానికి కృష్ణాజలాలు అందించడానికి కృషి చేస్తా. నియోజకవర్గంలోని రోడ్లను బీటీగా మార్చడానికి రూ. 229 కోట్లతో త్వరలో పనులు ప్రారంభిస్తాం.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement