వాయుగండం

17 Nov, 2015 01:27 IST|Sakshi

మరో 24 గంటలపాటు వర్షాలు
బెంబేలెత్తుతున్న వరి రైతులు
పత్తి, మిరపకు కాస్తంత మేలు

 
మచిలీపట్నం/ముదినేపల్లి రూరల్ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం డెల్టా రైతులపాలిట గండంగా మారింది. వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో మరో 24 గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీచేయడంతో రైతుల్లో గుబులు మొదలైంది. జిల్లాలో 4.63 లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. 60 శాతం కంకులు పాలుపోసుకునే దశలో ఉన్నాయి. ఈదురుగాలుల ప్రభావంతో చాలాచోట్ల కోతకు సిద్ధంగా ఉన్న వరిచేలు నేలకొరిగాయి.

 ‘స్వర్ణ’కు సంకటం
 డెల్టా ప్రాంతంలో మూడు దశాబ్దాలుగా స్వర్ణ (ఎంటీయూ7029) వరి రకాన్ని రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఇది తక్కువ కాలంలో పంటకు వచ్చి అధిక దిగుబడులిస్తుంది. సాగునీటి కొరత భయంతో ఈ ఏడాది ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేశారు. ఇలాంటి చేలన్నీ పలు ప్రాంతాల్లో కోతలకు సిద్ధంగా ఉండగా, మరికొన్నిచోట్ల గింజ పాలు పోసుకునే దశల్లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఏర్పడ్డ వాయుగుండం స్వర్ణ రకానికి తీవ్ర నష్టం చేకూరుస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన ఊపిరితో ఉన్న వరిచేలకు ఈ వాయుగుండం ప్రయోజనం చేకూర్చవచ్చని అంటున్నారు.

 అపరాలకు అనుకూలం
 ప్రస్తుత పరిస్థితుల్లో దాళ్వా వరిసాగుకు ఏమాత్రం అవకాశం లేదు. రెండో పంటగా అపరాలు సాగుచేయాల్సిఉంది. రెండో పంటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితుల్లో వాయుగుండం రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. కొద్దిపాటి వర్షం పడినా భూమిలో తేమ ఏర్పడి విత్తనాలు చల్లేందుకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు.  
 
పత్తికి మేలు  

 పశ్చిమ కృష్ణాలో 1.38 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది పత్తి సాగు చేశారు. ఇప్పటివరకు ఎకరానికి రూ. 20 వేల నుంచి రూ. 22 వేలు ఖర్చు చేశారు. సోమవారం కురిసిన జల్లులు పత్తి పైరుకు మేలుచేస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పత్తి మొక్కలకు నీరు అవసరమని, ఈ దశలో వర్షం కురిస్తే మొక్క మరింతగా ప్రాణం పోసుకుని ఎదుగుతుందని రైతులు అంటున్నారు.  
 
 జిల్లా సగటు వర్షపాతం 4.5 మిల్లీమీటర్లు  
 వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుంచే వర్షం ప్రారంభమైంది. పశ్చిమ కృష్ణాలోని పలు మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. సముద్రతీరం వెంబడి ఉన్న మండలాల్లో రోజంతా చినుకులు పడుతూనే ఉన్నాయి. జిల్లా సగటు వర్షపాతం 4.5 మిల్లీమీటర్లుగా నమోదైంది.  అత్యధికంగా అవనిగడ్డలో 23.5 మిల్లీమీటర్లు, కైకలూరులో అత్యల్పంగా 2.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
 
 

మరిన్ని వార్తలు