అల్పపీడనంతో రైతుల్లో ఆందోళన

3 Dec, 2019 05:37 IST|Sakshi

వరి పంట దెబ్బతినే ప్రమాదం!

కంగారు పడొద్దంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు

సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణం): అరేబియా సముద్రంలో నైరుతి దిక్కున ఏర్పడిన అల్పపీడనం దక్షిణ కోస్తా జిల్లాల రైతుల్లో దడ పుట్టిస్తోంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడనుందని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారతీయ వాతావరణ విభాగం ప్రకటించింది. దీంతో వరి సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం మొదలు పశ్చిమ గోదావరి వరకు పలు జిల్లాల్లోని కొన్నిచోట్ల ఇప్పటికే వరి కోతలు ప్రారంభం కాగా చాలా ప్రాంతాల్లో వరి పంట తుది దశలో ఉంది.

ఈ సమయంలో ఏమాత్రం వర్షాలు పడినా పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ కారణంగా రైతులు బిక్కుబిక్కు మంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 14.67 లక్షల హెక్టార్లలో వరి సాగయింది. ఉత్తర కోస్తా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణాలోని కొన్ని ప్రాంతాల్లో వరి కోతకు వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లో గింజ గట్టిపడే దశలో ఉంది. ఆలస్యంగా సాగు చేసిన ప్రాంతాల్లో ఈనిక దశలో ఉంది. ఆగస్టులో వచ్చిన వర్షాలు, వరదలతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు సహా ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వరి పంట దెబ్బతింది. ఆ తర్వాత వచ్చిన వర్షాలకు కృష్ణా, గుంటూరుతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. తుపాన్ల సీజన్‌ ముగిసిందనుకుంటున్న తరుణంలో అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందన్న వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు బెంబేలెత్తుతున్నారు.

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి 
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరాలకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఇది ఏర్పడిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంవల్ల కోస్తాంధ్ర, రాయలసీమలోని చిత్తూరు, కడప, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే, ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.   

కంగారు పడొద్దు
ప్రస్తుత అల్పపీడనం వల్ల ముంచుకొచ్చే ముప్పేమీ లేదు. ఇది ఏ దిశగా పయనిస్తుందో పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఇది సొమాలియా వైపు పయనించే అవకాశం కనిపిస్తోంది. కోస్తా జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడినా రైతులు కంగారు పడాల్సిన పని లేదు. కోతకు వచ్చిన వరి చేలల్లో నీరు పోయేందుకు వీలుగా పాయలు తీసి ఉంచాలి. కోతలు పూర్తయి పనలమీద ఉంటే కుప్పలు వేసుకోవాలి. ధాన్యం కల్లాల్లో ఉంటే టార్పాలిన్లు సిద్ధం చేసుకోవాలి. కోత కోయాలనుకునేవారు ఒకటి రెండురోజులు ఆగటం ఉత్తమం.
– టి.గోపీకృష్ణ, శాస్త్రవేత్త, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 

మరిన్ని వార్తలు