బాబు పోలవరం పర్యటన వివాదాస్పదం

6 May, 2019 16:23 IST|Sakshi

అమరావతి: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పర్యటన చేయడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా సీఎం చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. ముందుగా ప్రత్యేక హెలికాఫ్టర్లో పోలవరం చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు. గ్యాలరీలోకి వెళ్లి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. అనంతరం ఎగువ కాపర్‌ డ్యాం పనులను పరిశీలించారు.

అక్కడి నుంచి బయల్దేరి దిగువ కాపర్‌ డ్యాంకు చేరుకున్న చంద్రబాబు, అధికారులు ఏర్పాటు చేసిన ప్రాజెక్టుకు సంబంధించిన పలు మ్యాప్‌లను పరిశీలించారు. ఆయనకు ఈఎంసీ వెంకటేశ్వరరావు, సీఈ శ్రీధర్‌లు ప్రాజెక్టు పనులను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మొన్నటి వరకు 2019 జూన్‌కి నీరు ఇస్తానన్న చంద్రబాబు తాజాగా మాట మార్చి 2020 నాటికి గ్రేవిటీతో నీళ్లిస్తామన్నారు. ఇప్పటికీ కేంద్రం నుంచి రూ.4 వేల 367 కోట్లు రావాలని చంద్రబాబు అన్నారు. 2019 జూన్‌ నాటికి కాపర్‌ డ్యాం ఒక స్థాయి పనులు పూర్తి అవుతాయని తెలియజేశారు. కాపర్‌ డ్యాం పూర్తయితే 23 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందన్నారు. కేంద్రం సరైన సమయంలో నిధులు ఇవ్వకపోయినా ప్రాజెక్టు పనులు చాలా వరకు పూర్తి చేశామన్నారు.

సీడబ్ల్యూసీ ఏజెన్సీలు, కేంద్రం సహకారంతో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామన్నారు. మన దేశంలో అత్యంత వేగంగా నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టేనని, దేశంలోనే ఒక చరిత్రగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం నవయుగ కంపెనీ సమావేశ మందిరంలో ప్రాజెక్టుపై ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టు సంస్థలతో సమావేశమై సమీక్షించారు. చంద్రబాబు సమీక్షా సమావేశంలో ఇరిగేషన్‌ అధికారులు పాల్గొనటం వివాదాస్పదమవుతోంది. ఎన్నికల సంఘం నుంచి ఎటువంటి అనుమతులు లేకపోయినా ఈఎన్‌సీ వెంకటేశ్వర రావు, సీఈ శ్రీధర్‌లతో పాటు పలువురు ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు