వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకార వేదిక ఖరారు

25 May, 2019 15:31 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదిక ఖరారు అయింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆయన ఈ నెల 30వ తేదీన ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏయే శాఖలు ఏర్పాట్లు చేయాలన్న దానిపై సీఎస్‌ దిశానిర్దేశం చేశారు. పోలీస్‌, మున్సిపల్‌, ప్రొటోకాల్‌, సమాచార తదితర 15 శాఖల ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు.


ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఇంతియాజ్, మున్సిపల్‌ కమిషనర్‌ రామారావు 

మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లుపై సీఎస్‌ ఇవాళ మధ్యాహ‍్నం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, జీఏడీ అధికారులు హాజరు అయ్యారు. లా అండ్‌ ఆర్డర్‌ డీజీ రవిశంకర్‌ అయ్యనార్‌, విజయవాడ సిటీ కమిషనర్‌ ద్వారక తిరుమలరావు, ఇంటెలిజెన్స్‌ ఏడీజీ కుమార విశ్వజిత్‌, అగ్నిమాపక శాఖ డీజీ సత్యనారాయణ, ఏలూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ, గుంటూరు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌, గుంటూరు జిల్లా రూరల్‌ ఎస్పీ రాజశేఖర బాబు, కృష్ణాజిల్లా కలెకర్ట్‌ ఇంతియాజ్‌, కృష్ణాజిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఐఎస్‌డ్ల్యూ డీఐజీ రామకృష్ణ, ప్రకాశం జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌, స్పెషల్‌ సీఎస్‌ రమేష్‌, ఆర్అండ్‌బీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ నిరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, మైనార్టీ సెక్రటరీ రాంగోపాల్‌, కార్మికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జేవీఎస్‌ ప్రసాద్‌, మున్సిసిపల్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కరికాల వల్లవన్‌, ఐటీశాఖ  ప్రిన్సిపల్‌ సెక్రటరీ విజయానంద్‌, పొలిటికల్‌ సెక్రటరీ నాగులప్లి శ్రీకాంత్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, అసెంబ్లీ సెక్రటరీ విజయరాజ్‌తో పాటు సంబంధిత అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు