నవలి రిజర్వాయర్‌కు నో!

29 Dec, 2019 04:23 IST|Sakshi

తుంగభద్ర బోర్డు ప్రతిపాదనను తోసిపుచ్చిన ఏపీ సర్కార్‌

ఇప్పటికే ఎడమ కాలువ కింద కర్ణాటక సర్కార్‌ భారీగా నీటిని మళ్లిస్తోందని ఫిర్యాదు

ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతివ్వదని స్పష్టీకరణ

52 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణానికి కర్ణాటక ఎత్తుగడ

తద్వారా 57.81 టీఎంసీలు మళ్లించడానికి ప్రణాళిక

పూడికతో టీబీ డ్యామ్‌లో నీటి లభ్యత తగ్గిందని సాకు

అనుమతివ్వాలని తుంగభద్ర బోర్డుకు కర్ణాటక సర్కార్‌ వినతి

దీనివల్ల 3 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుందని వాదన

రిజర్వాయర్‌కు అయ్యే వ్యయాన్ని మూడు రాష్ట్రాలు భరించాలని ప్రతిపాదన

దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బోర్డు లేఖ

సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాశయం (టీబీ డ్యామ్‌) ఎడమ కాలువ ఆయకట్టు స్థిరీకరణకు 52 టీఎంసీల సామర్థ్యంతో నవలి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ కర్ణాటక సర్కార్‌ చేసిన ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తోసిపుచ్చింది. తమను సంప్రదించకుండా నవలి బ్యారేజీ నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదని టీబీ బోర్డుకు స్పష్టంచేసింది. సింగటలూరు ఎత్తిపోతల, అప్పర్‌ భద్ర, టీబీ డ్యామ్‌ల నుంచి ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం నీటిని మళ్లిస్తోందని.. నవలి బ్యారేజీకి అనుమతిస్తే తమ హక్కులకు విఘాతం కలుగుతుందని ఏపీ సర్కార్‌ ఆందోళన వ్యక్తంచేస్తూ టీబీ బోర్డుకు ఇటీవల లేఖ రాసింది. నిజానికి టీబీ డ్యామ్‌ నీటి నిల్వ సామర్థ్యం 1953లో 132.47 టీఎంసీలు. జలాశయంలో పూడిక పేరుకుపోవడంవల్ల నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలకు తగ్గింది. అంటే.. 31.615 టీఎంసీలు తగ్గింది. ఇది టీబీ డ్యామ్‌లో నీటి లభ్యతపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో.. టీబీ బోర్డు దామాషా పద్ధతిలో నీటిని కేటాయిస్తోంది. పూడికవల్ల కేటాయించిన మేరకు జలాలను నియోగించుకోలేకపోతున్నామని.. ఫలితంగా ఎడమ కాలువ కింద రెండు లక్షల ఎకరాలకు నీళ్లందించలేకపోతన్నామనే వాదన కర్ణాటక సర్కార్‌ తెరపైకి తీసుకొచ్చింది.

నదిపైనే రిజర్వాయర్‌ నిర్మించాలి
రిజర్వాయర్‌ నిర్మిస్తే అది నదిపై నిర్మించాలని.. దానిని బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ సర్కార్‌ చెబుతోంది. కానీ, అలా కాకుండా 57.81 టీఎంసీల నీటిని మళ్లించడానికే కర్ణాటక సర్కార్‌ ఈ ప్రతిపాదన చేసిందని ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తంచేసింది. అంతేకాక.. ఎడమ కాలువ ద్వారా కర్ణాటక సర్కార్‌ అడ్డగోలుగా నీటిని ఇప్పటికే వినియోగించుకుంటున్నా బోర్డు పట్టించుకోవడం లేదని ఆరోపించింది. హెచ్చెల్సీ, ఎల్లెల్సీలకు గండ్లు కొట్టి.. కర్ణాటక రైతులు జలచౌర్యానికి పాల్పడుతున్నా బోర్డు చర్యలు తీసుకోవడంలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో.. బోర్డు పరిధిలో లేని ప్రాంతంలో 57.81 టీఎంసీల నీటిని మళ్లించడానికి కర్ణాటక సర్కార్‌ చేసిన ప్రతిపాదన తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఏపీ సర్కార్‌ స్పష్టంచేసింది. అలాగే, రిజర్వాయర్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని టీబీ బోర్డుకు స్పష్టంచేసింది. సింగటలూరు ఎత్తిపోతల, అప్పర్‌ భద్ర ప్రాజెక్టుల్లో కర్ణాటక సర్కార్‌ భారీఎత్తున జలాలను మళ్లిస్తోందని.. దీనివల్ల తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత తగ్గుతోందని.. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని బోర్డును కోరింది.

పూడిక పేరుతో కర్ణాటక జిత్తులు
టీబీ డ్యామ్‌లో పూడికను తొలగించి.. ఒక టీఎంసీ నీటినిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి రూ.380 కోట్లు ఖర్చవుతుందని.. ఈ లెక్కన 31.615 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా పూడిక తీయడానికి రూ.12వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని కర్ణాటక సర్కార్‌ లెక్కకట్టింది. అలాగే, పూడిక తీసిన మట్టిని నిల్వ చేయడానికి 65 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని.. ఈ భూమి సేకరణకు అధికంగా ఖర్చుచేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. తుంగభద్ర జలాశయానికి ఎగువన, హీరేబెనగల్‌ వద్ద నుంచి రోజుకు 22,787 క్యూసెక్కుల (1.96 టీఎంసీలు) ప్రవాహ సామర్థ్యంతో 47 కిమీల పొడవున తవ్వే వరద కాలువ ద్వారా నీటిని తరలించాలని ప్రతిపాదిస్తోంది.

నవలి వద్ద 52 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో నీటిని నిల్వచేయడంతోపాటు.. శివపుర చెరువు సామర్థ్యాన్ని 4.25, విఠల్‌పుర చెరువు సామర్థ్యాన్ని 1.56 టీఎంసీలకు పెంచి.. వరద జలాలను ఒడిసిపట్టడం ద్వారా ఎడమ కాలువ ఆయకట్టును స్థిరీకరిస్తామని, దీనివల్ల తుంగభద్ర జలాశయంపై ఒత్తిడి తగ్గుతుందని.. తద్వారా మూడు రాష్ట్రాలు కేటాయించిన మేరకు నీటిని వినియోగించుకోవచ్చని కర్ణాటక చెబుతోంది. అలాగే, నవలి బ్యారేజీకి రూ.9,500 కోట్లు ఖర్చవుతుందని.. ఈ వ్యయాన్ని మూడు రాష్ట్రాలు దామాషా పద్ధతిలో భరించాలని ప్రతిపాదిస్తూ.. అందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఇటీవల టీబీ బోర్డుకు పంపింది. దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు తుంగభద్ర బోర్డు ఇటీవల లేఖ రాసింది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వైరస్‌ సోకినవారిపై వివక్ష చూపొద్దు : సీఎం జగన్‌

రైతు నోట ఆ మాట రావ‌ద్దు: సీఎం జ‌గ‌న్‌

విపత్తులో కూడా పెన్షన్‌.. సీఎం జగన్‌పై ప్రశంసలు

లేకపోతే అమెరికాను మించిపోతాము

‘క్రిమి చిన్నదైనా పెద్ద సైన్యంతో పోరాడాలి’

సినిమా

మరో సింగర్‌కు కరోనా పాజిటివ్‌!

జోర్డాన్ ఎడారిలో చిక్కుకున్న‌ టాప్‌ హీరో

కరోనాపై కీరవాణి కదిలించే పాట..

ఆసక్తికర విషయం చెప్పిన నమ్రత

‘ఉప్పెన’ నుంచి న్యూలుక్‌ విడుదల

నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి