రైతన్నలకు మరో 3 వరాలు!

24 Dec, 2019 07:37 IST|Sakshi

మిర్చి, పసుపు, ఉల్లి, మైనర్‌ మిల్లెట్లకూ ‘మద్దతు’

ఇక శాశ్వతంగా పంట కొనుగోలు కేంద్రాలు

కేంద్రం కొనగా మిగిలిన పంటను కొనుగోలు చేయనున్న రాష్ట్రం

నూతన ఏడాదిలో ప్రకటన వెలువడే అవకాశం

సాక్షి, అమరావతి : అన్నదాతలకు మరో మూడు వరాలను ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో పండించే పలు పంటలకు గిట్టుబాటు ధరలు, శాశ్వత కొనుగోలు కేంద్రాలతోపాటు కేంద్రం కొనుగోలు చేయగా మిగిలిన  పంటను రైతుల నుంచి కొనేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు మార్కెటింగ్‌శాఖ ఈమేరకు చర్యలను తీసుకుంటోంది. వీటికి సంబంధించి నూతన ఏడాదిలో ప్రకటన చేసే అవకాశం ఉంది.  

మిర్చి, పసుపు, ఉల్లి, మైనర్‌ మిల్లెట్లకు ‘మద్దతు’ 
కేంద్రం మద్దతు ధర ప్రకటించని మిర్చి, పసుపు, ఉల్లి, మైనర్‌ మిల్లెట్ల (కొర్రలు, అండుకొర్రలు, సామలు)కు మద్దతు ధర ఇచ్చి రైతులకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పంటల సాగు ఖర్చులను పరిగణనలోకి తీసుకుని మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏటా వరి, గోధుమలు, అపరాలు, పత్తి, కంది పంటలకు మద్దతు ధర ప్రకటిస్తోంది. అయితే రాష్ట్రంలో పండించే పలు  పంటలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధిక దిగుబడి వచ్చిన సమయంలో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని మిర్చి, పసుపు, ఉల్లి, మైనర్‌ మిల్లెట్లకు మద్దతు ధర ప్రకటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రైతు సంఘాలు, వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌శాఖల అధికారులతో చర్చలు జరిపిన మార్కెటింగ్, సహకారశాఖల ప్రత్యేక కార్యదర్శి మధుసూధనరెడ్డి దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చారు.

శాశ్వత కొనుగోలు కేంద్రాలు 
ఇకపై సీజన్లవారీగా కాకుండా పంట ఉత్పత్తుల కొనుగోలుకు శాశ్వత కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పరిమిత కాలంలో ఏర్పాటవుతున్న కొనుగోలు కేంద్రాల వల్ల రైతులు పూర్తిగా పంటను అమ్ముకోలేకపోతుండటంతో శాశ్వత కేంద్రాలను నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మార్కెట్‌ సబ్‌ యార్డుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. బహిరంగ మార్కెట్‌లో పంటల ధరలు తగ్గినప్పుడు రైతులు తమ పంటలను ఎప్పుడైనా శాశ్వత కేంద్రాలకు తీసుకువెళ్లి విక్రయించే అవకాశం లభిస్తుంది. మార్కెటింగ్‌ శాఖ పర్యవేక్షణలో పౌరసరఫరాలశాఖ, మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్‌ నోడల్‌ ఏజెన్సీలుగా పంటలను కొనుగోలు చేయనున్నాయి.

మిగతాది రాష్ట్రమే కొంటుంది 
ఏటా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన పంటల దిగుబడిలో 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం కొనగా మిగిలిన పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వీటిపై జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు