నిండా ముంచారు!

12 May, 2019 11:51 IST|Sakshi

అద్దంకిరూరల్‌: పోలవరంలో అది చేశాం. ఇది చేశాం చూడండి. ప్రతిపక్షం మా మీద కక్ష కట్టి మాట్లాడుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వం నానా యాగీ చేసింది. వాస్తవాలు మీరే చూడండని, పోలవరం ప్రాజెక్టును ప్రజలకు చూపించి తద్వారా సార్వత్రిక ఎన్నికల్లో లబ్ది పొందాలని భావించింది. తమ పార్టీ నేతలను పురామాయించి గ్రామాల వారీగా ప్రజలను ఉచితంగా పోలవరం సందర్శన చేసే కార్యక్రమం  చేపట్టింది. దానికి ప్రైవేటు వాహనాలను వినియోగించకుండా, రెండు నెలలపాటు ఆర్టీసీ బస్సులను తిప్పింది. తీరా బిల్లులు చెల్లించకుండా ఆ సంస్థను ఇబ్బందుల్లోకి నెట్టేసింది.

ప్రయాణికులను తిప్పలు పెట్టిన ఆర్టీసీ...
ప్రభుత్వం అధికారుల ఆదేశాలను తూ.చ. తప్పని ఆర్టీసీ యాజమాన్యం ప్రజల కష్టాలను లెక్క చేయకుండా అత్యుత్సాహంతో వందల కొద్దీ బస్సులను పోలవరం పంపింది. జిల్లాలోని 8 డిపోల నుంచి రోజుకు 30 నుంచి 50 బస్సులను రద్దు చేసి పోలవరం సందర్శనకు పెట్టింది. ఆర్టీసీని పెంచి పెద్ద చేసిన ప్రయాణికుల ఇబ్బందులను ఖాతరు చేయకుండా ఆయా డిపోల పరిధిలో రెండునెలల పాటు బస్సులు నడిపింది. చేసేది లేక ప్రయాణికులు అధిక చార్జీలు చెల్లించి ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించారు. అయినా ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదు.
 
అద్దంకి నుంచే 335 బస్సులు...
పోలవరం సందర్శనకు ఒక్క అద్దంకి డిపో నుంచి జనవరి నెలలో 95 బస్సులు, ఫిబ్రవరిలో 240 బస్సులను నడిపారు. దీంతో ఆ రెండు నెలల్లో డిపో నుంచి వివిధ గ్రామాలతోపాటు ముఖ్య పట్టణాలకు ప్రయాణిచాల్సిన ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరడానికి నానా అవస్థలు పడ్డారు.

నిలిచిపోయిన 16 కోట్లు బిల్లులు..
జిల్లా వ్యాప్తంగా 8 డిపోల్లో పొలవరం సందర్శన కోసం ఏర్పాటు చేసిన బస్సులకు  రూ. 14 కోట్లు, రాజధాని అమరావతి సందర్శన కోసం పెట్టిన బస్సులుకు రూ. 2 కోట్లు మొత్తం రూ.16 కోట్లు బిల్లులు నిలిపోయాయి. అందులో ఒక్క అద్దంకిలోనే రెండు నెలలో 335 బస్సులను వినియోగించుకున్నారు. దానికి సంబందించి  జనవరిలో రూ.1,09,34,601, ఫిబ్రవరిలో43,98,848. మొత్తం కోటిన్నర వరకు ప్రభుత్వం చెల్లించాల్సి వుంది.

ప్రశ్నార్ధకంగా మారిన ఆర్టీసీ భవిష్యత్‌... 
ప్రభుత్వం నుంచి రావాల్సి ఇంత పెద్దమొత్తం ఎప్పటికి వస్తుందో ఆర్టీసీకి అంతు చిక్కడం లేదు. చెల్లించాల్సిన సమయంలో బిల్లులు చెల్లించకపోవడం, తరువాత సార్వత్రిక ఎన్నికల ప్రకటన, కోడ్‌ అమలుతో నిలిచిపోయిన బిల్లులు ప్రస్తుతం చెల్లించే పరిస్తితి లేదనేది తెలిసిన విషయమే. ఈ పరిస్థితుల్లో జిల్లాల్లో ఒక్క కనిగిరి తప్ప మిగిలిన ఎనిమిది డిపోల్లో ఏ డిపో పరిస్థితి సరిగా లేదు. నష్టాల్లో ఉన్నాయి. అటువంటి సమయంలో ఆర్టీసీని ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కంచే చేను మేసిన చందంగా ఆర్టీసీ బస్సులను సందర్శనకు వాడుకుని బిల్లులు చెల్లించకపోవడం సరికాదని ప్రజలు విమర్శిస్తున్నారు.

మరిన్ని వార్తలు