వాహ్..రెహమాన్

22 Dec, 2017 09:35 IST|Sakshi

అలరించిన రెహమాన్‌ కాన్సెప్ట్‌ మ్యూజిక్‌

వైభవంగా ముగిసిన సాగర సంబరాలు

ఓ వైపు సంద్రం హోరు... ఎగసిన కెరటాలు ... ఆ జోరుకు మేం తీసిపోమన్నట్టుగా ప్రేక్షకుల ఆనంద హేల. కాకినాడ సాగర సంబరాలు ముగింపు సందర్భంగా గురువారం అంబరాన్నంటాయి. ఈ ఉత్సవానికి ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్‌ రెహమాన్‌ కాన్సెప్ట్‌ మ్యూజిక్‌ సందర్శకులను ఉర్రూతలూగించింది. ఆలపించిన పలు చిత్రాల్లోని హిట్‌ పాటలకు యువత కేరింత మరింత పసందు చేసింది.

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఆస్కార్‌ పురస్కార గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ కాన్‌సెప్ట్‌ మ్యూజిక్‌ సందర్శకులను ఉర్రూతలూగించింది. రెహమాన్‌ బృందం గీతాలకు అనుగుణంగా బ్యాక్‌గ్రౌండ్‌లో రంగులు మారడం ప్రేక్షలను విశేషంగా ఆకట్టుకుంది. మూడు రోజులుగా జరుగుతున్న సాగర సంబరాలు గురువారం రాత్రితో వైభవంగా ముగిసాయి. చివరి రోజు, రెహమాన్‌ సంగీత విభావరిని తిలకించేందుకు అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో సాగర తీరం జన ఉప్పెనగా మారింది. అడుగడుగునా పోలీసులు, సందర్శకులను నియంత్రించేందుకు ఇబ్బందులు పడ్డారు. ఏఆర్‌ రెహమాన్‌ బృందం ఆలపించిన పలు చిత్రాల్లోని హిట్‌  పాటలకు సందర్శకులు సైతం నృత్యాలు చేశారు.

తెలుగు సినిమాతో పాటు, పలు హిందీ పాటలను సైతం ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ దుస్సారే, దుస్సారే అంటూ ఆలపించిన హిందీ పాటకు ప్రేక్షకులు జైజైలు పలికారు. రెహమాన్‌ సంగీత విభావరి ఆద్యంతం హుషారుగా సాగింది. షెడ్యూల్‌ ప్రకారం 6.45కి ప్రారంభం కావల్సి ఉండగా సాంకేతిక లోపం వల్ల 7.25కి ప్రారంభించారు. అనంతరం ఏఆర్‌ రెహమాన్‌ను ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, హోం మంత్రి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, జేసీ ఎ.మల్లికార్జున, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పట్టుశాలువాలతో గజమాలతోను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. రెండు రోజులుగా ఖాళీగా దర్శనమిచ్చిన వీవీఐపీ, వీఐపీ, ఎంవీఐపీ లాంజ్‌లు రెహమాన్‌ రాకతో కిక్కిరిసిపోయాయి. జిల్లా ఉన్నతాధికారులతో పాటు రాష్ట్రంలోని పలు శాఖలకు చెందిన అధికారులు కుటుంబ సమేతంగా రావడంతో కిందిస్థాయి అధికారులు వారికి కుర్చీలు వేసే పనిలో నిమగ్నం కావల్సి వచ్చింది. అనుకున్న దానికంటే ముఖ్య అతిథులు ఎక్కువగా రావడంతో అదనపు వసతులు కల్పించేందుకు జిల్లా అధికారులు అవస్థలు పడాల్సి వచ్చింది.

>
మరిన్ని వార్తలు