Sakshi News home page

తగ్గని కిరణ్‌   

Published Fri, Dec 22 2017 9:31 AM

lieutenant governor kiran bedi says all details in raj niwas website - Sakshi

సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి ఏ మాత్రం తగ్గడం లేదు. తన మీద పాలకులు చేస్తున్న విమర్శలు, ఆరోపణల్ని తిప్పికొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక, ప్రభుత్వం నుంచి రాజ్‌ నివాస్‌కు వచ్చే అన్ని రకాల ఫైల్స్, అందులోని వివరాలు, ఆమోద ముద్ర వరకు ప్రజలకు తెలియజేయడానికి సిద్ధమయ్యారు. అన్ని విషయాల్ని బహిర్గతం చేస్తామంటూ రాజ్‌నివాస్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ప్రకటించడం విశేషం.  

పుదుచ్చేరిలో సీఎం నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడికి మధ్య సాగుతున్న సమరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వానికి, పథకాలకు వ్యతిరేకంగా కిరణ్‌ వ్యవహరిస్తున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పంపించే ఫైల్స్‌ను తుంగలో తొక్కుతున్నారని, అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. 

ప్రజాహిత కార్యక్రమాలన్నీ గవర్నర్‌ రూపంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని పేర్కొంటూ వస్తున్నారు. ఇది కాస్త ప్రజల్లో ఆగ్రహాన్ని రేపింది. కిరణ్‌ పర్యటన సాగే ప్రాంతాల్లో ఆందోళనలు, వ్యతిరేకత తప్పడం లేదు. ఆమెను ఘెరావ్‌ చేయడం, వెనక్కు వెళ్లాలన్న నినాదంతో ప్రజలతో కలిసి పాలకులు ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తాను ఏ మాత్రం తగ్గేది లేదన్నట్టుగా కిరణ్‌ దూకుడు పెంచడం గమనార్హం. సీఎం నారాయణస్వామి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, విమర్శలను తిప్పి కొట్టే విధంగా కొత్త ఎత్తుగడ వేశారు.

ఇక, అన్నీ బహిర్గతం: 
తాను ఫైల్స్‌ను పక్కన పెడుతున్నట్టు, పథకాలకు ఆమోదం ఇవ్వడం లేదని ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టే విధంగా గురువారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడి నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌ నివాస్‌కు వచ్చే అన్ని ఫైల్స్, ఇతర వివరాలను ప్రజలకు తెలియజేయనున్నట్టు ప్రకటించారు. తమ ఆమోదానికి తగ్గ అన్ని వివరాలను రాజ్‌ నివాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వివరించారు. ఆ మేరకు ఈనెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రాజ్‌ నివాస్‌కు వచ్చిన ఫైల్స్, తాము వేసిన ఆమోద ముద్ర వివరాలను ప్రకటించారు.

ఇందులో ఉచిత బియ్యం పంపిణీకి రూ.1931 కోట్ల కేటాయింపునకు తగ్గ ఫైల్, ఠాకూర్‌ కళాశాల పేరు మార్పు, ఆరోగ్యశాఖలో వైద్యుల పోస్టుల భర్తీ, ఆయా సంస్థలకు ట్రస్టీల నియామకం, నామినేటెడ్‌ పోస్టులు వంటి అంశాలతో కూడిన ఫైల్స్‌ ఉన్నాయి. ఇక, మీద  ప్రతి బుధ, శనివారాల్లో రాజ్‌ నివాస్‌ ద్వారా ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే ఫైల్స్, వాటి స్థితి, ఆమోదం వరకు అన్ని వివరాలను తెలియజేస్తామని కిరణ్‌ పేర్కొనడం గమనార్హం. తాజాగా, తమను ఢీకొట్టే విధంగా కిరణ్‌ అడుగుల వేగాన్ని పెంచడం పాలకులకు మింగుడు పడడం లేదని చెప్పవచ్చు.

Advertisement
Advertisement