చెన్నంపల్లి కోటలోకి పురావస్తు శాఖ!

22 Dec, 2017 02:50 IST|Sakshi

తవ్వకాలను ఆ శాఖకే అప్పగిస్తామన్న కలెక్టర్‌  

‘సాక్షి’లో వరుస కథనాల నేపథ్యంలో నిర్ణయం  

గ్రామకంఠం భూమిగా చెబుతున్న రెవెన్యూ రికార్డులు

పంచాయతీకి తెలియకుండానే తవ్వకాలపై విమర్శలు

సాక్షి ప్రతినిధి, కర్నూలు/తుగ్గలి:  కర్నూలు జిల్లా తుగ్గలి మండలంచెన్నంపల్లి కోటలో తవ్వకాలపై ఎట్టకేలకు పురావస్తుశాఖ రంగంలోకి దిగనుంది. తవ్వకాలను ఆ శాఖకు అప్పగించనున్నట్టు జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ గురువారం ప్రకటించారు. ఇప్పటివరకు జరిపిన తవ్వకాల్లో ఏనుగు దంతాలు, ఎర్రటి ఇటుకలు, సొరంగమార్గం బయటపడిందన్నారు. చారిత్రక ఆనవాళ్లు లభిస్తున్న నేపథ్యంలోనే పురావస్తు శాఖకు తవ్వకాలను అప్పగించనున్నట్టు స్పష్టం చేశారు.

వాస్తవానికి రాత్రి సమయాల్లో అధికారులు తవ్వకాలకు సిద్ధం కావడం, గ్రామస్తులు తిరుగుబాటు చేయడం.. అనంతరం తూతూమంత్రంగా గ్రామ కమిటీ ఏర్పాటు చేసి తవ్వకాలు చేపట్టడంపై విమర్శలు మొదలయ్యాయి. కనీసం పురావస్తు శాఖ అధికారులకు తెలియకుండా ఒక ప్రైవేటు ఏజెన్సీ దరఖాస్తు నేపథ్యంలోనే తవ్వకాలు చేపట్టడం ఇలా అన్ని విషయాలపై ‘సాక్షి’వరుస కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.  

గ్రామ కంఠం భూమిపై కన్ను!
 తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలోని భూమి గ్రామ కంఠానికి చెందినది. రెవెన్యూ రికార్డుల్లో తుగ్గలి మండలం చెన్నంపల్లి గ్రామంలోని 607 సర్వే నంబరుకు చెందిన 102.54 ఎకరాల భూమిలోనే ఇదీ ఉంది. ఈ ప్రకారం ఆ భూమిపై పూర్తి అధికారం పంచాయతీకే ఉంటుంది. అలాంటిది పంచాయతీకే తెలియకుండా తవ్వకాలు చేపట్టడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మొదట్లో గుప్త నిధులని పేర్కొన్న అధికారులు చివరకు ఖనిజాల కోసమంటూ మాటమార్చారు.

ఇక్కడ విలువైన ఖనిజాలు ఉన్నాయని ఏ సర్వే చెప్పిందనే విషయాన్ని మాత్రం వెల్లడించడం లేదు. ఈ సర్వే నంబర్‌లో తమకు లీజు ఇవ్వాలంటూ భూగర్భ గనుల శాఖకు అక్టోబర్‌లో కొందరు దరఖాస్తు చేసుకున్న విషయం కూడా ఈ సందర్భంగా వెలుగు చూసింది. గ్రామ కంఠానికి చెందిన స్థలంలో తవ్వకాలు చేపట్టేటప్పుడు కనీసం పంచాయతీకి సమాచారం ఇవ్వకపోవడంపై స్థానికులు నిలదీస్తున్నారు. ఇలా అన్ని రకాల ఒత్తిడి పెరగడంతో ఇప్పుడు పురావస్తు శాఖను రంగంలోకి దింపుతున్నారు.

ప్రమాదకరరీతిలో తవ్వకాలు
చెన్నంపల్లి కోటలో అధికారులు చేపట్టిన తవ్వకాలు ప్రమాదకరరీతిలో సాగుతున్నాయి. బండరాళ్ల కింద ఉన్న రాళ్లు, మట్టిని తొలగించగా ఏర్పడిన సొరంగంలో కూలీలు పనిచేస్తున్నారు. తవ్వకాల వద్ద బండ రాళ్లు ఉండడంతో వాటి కింద పనులు చేస్తున్న కూలీలు ఎప్పుడు.. ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పక్కనే ఓ బండరాయి జారిపడేటట్లు ఉండటంతో దానికి తాడు కట్టారు. అధికారులు అక్కడ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలూ తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

మరిన్ని వార్తలు