నిందితుడి జేబులో లెటర్‌ : పథకం ప్రకారమే దాడి

25 Oct, 2018 14:19 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఏపీ పోలీసులు స్పందించారు. వైఎస్‌ జగన్‌కు అత్యంత సన్నిహితంగా వెళ్లి మరీ  దుండగుడు శ్రీనివాస్‌ దాడి చేశాడని, పథకం ప్రకారమే ఈ దాడి జరిగినట్టు కనిపిస్తోందని డీజీపి ఆర్‌పీ ఠాకూర్‌ ప్రకటించారు. దాడికి పాల్పడిన శ్రీనివాస్‌ జేబులో ఒక లెటర్‌ను (ఎనిమిది పేజీల లేఖ) కూడా కనుగొన్నామని చెప్పారు. దీన్ని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది తమకు అందించారని తెలిపారు. ఈ దాడికి సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిదే పూర్తి బాధ్యత అని డీజీపీ పేర్కొన్నారు.

సీఐఎస్‌ఎఫ్‌ రిపోర్టు ఆధారంగా ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. నిందితుడి ఎడమ చేతిలో ఉన్న కత్తిని స్వాధీనం  చేసుకున్నామని చెప్పారు. పబ్లిసిటీ కోసమే చేశాడా, లేక  ఈ దాడి వెనుక ఎవరన్నా ఉన్నారనేది  విచారిస్తామని, విచారణ అనంతరం  పూర్తి వివరాలు అందిస్తామని డీజీపీ చెప్పారు. మరోవైపు  ఎయిర్‌పోర్టులోకి కత్తితో  నిందితుడు ఎలా   ప్రవేశించాడనేది విచారిస్తున్నామని తెలిపారు. అలాగే దాడికి గురైన ప్రతిపక్షనేత జగన్‌ను విమానం ద్వారా హైదరాబాద్‌కు తరలించినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు