అత్తింటి ఆరళ్లకు అబల బలి

19 Sep, 2014 00:02 IST|Sakshi
అత్తింటి ఆరళ్లకు అబల బలి

జూపాడుబంగ్లా:
 పెళ్లి సమయంలో నూరేళ్లు తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త కనీసం ఏడు మాసాలు కూడా భార్యతో అన్యోన్యంగా జీవించలేకపోయాడు. అనుమానంతో నిత్యం వేధింపులకు గురిచేయడం, అదనపు కట్నం కోసం అత్తింటి వారు పెట్టే చిత్రహింసలు మూడు నెలల గర్భిణిని బలిగొన్న సంఘటన జూపాడుబంగ్లా మండలం భాస్కరాపురంలో గ్రామంలో చోటుచేసుకుంది. ఇంట్లో ఉరివేసుకొని శాంతి(22) అనే వివాహిత బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల మేరకు...మండలంలోని భాస్కరాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, లక్ష్మిదేవి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు శేఖర్‌కు ఇదే మండలంలోని తర్తూరు గ్రామానికి చెందిన నడిపి సుబ్బన్న, చిన్నస్వామక్కల ఐదో కుమార్తె శాంతిని ఇచ్చి ఏడు నెలల క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో  రూ.60 వేల నగదు, ఆరు తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. ఇంతటితో సంతృప్తి చెందని భర్త వివాహమైనప్పటి నుంచి పుట్టింటి నుంచి తన వాటా ఆస్తిని తీసుకొని రావాలని భర్యను వేధించేవాడు. విషయం తెలుసుకున్న శాంతి తల్లిదండ్రులు మూడు నెలల క్రితం పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి అల్లుడికి సర్దిచెప్పి కూతురును కాపురానికి పంపించారు.
 ప్రస్తుతం శాంతి మూడు నెలల గర్భిణి. అయినా తీరు మారని శేఖర్ భార్యను అనుమానంతో నిత్యం చిత్రహింసలకు గురిచేసేవాడు. పుట్టింటివారితో ఫోన్‌లో మాట్లాడించే వాడుకాదు. బుధవారం సాయంత్రం చేపలు తెచ్చుకొని తిన్న దంపతులిద్దరు ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు తెల్లారేసరికి శాంతి ఉరిపై వేలాడటంతో స్థానికులు విషయాన్ని మృతురాలి తల్లిదండ్రులకు తెలిపారు. వారు వచ్చి చూసేసరికి మృతురాలి గొంతు చుట్టూ వాతలు ఉండటంతో పాటు స్వరం వద్ద గాయాలున్నట్లు గుర్తించారు. తమ కూతురును అల్లుడు, అత్త లక్ష్మీదేవి కలిసి గొంతునులిపి హతమార్చారని, అనుమానం రాకుండా ఉండేందుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారని శాంతి తల్లిదండ్రులు జూపాడుబంగ్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని నందికొట్కూరు సీఐ నరసింహా మూర్తి, జూపాడుబంగ్లా ఎస్‌ఐ గోపినాథ్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు