ఎంతపన్జేసినవ్ తల్లీ!

24 Jan, 2014 02:00 IST|Sakshi

మేడిపెల్లి, న్యూస్‌లైన్: కన్న కొడుకుకు గోరుముద్దలు తినిపిస్తూ.. చందమామ కథలు చెబుతూ.. అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన తల్లి తన పసి బాలుడిని పట్టుకుని బావిలో దూకింది. బావిలో ఉన్న పైపును పట్టుకుని కాపాడండి అంటూ కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి ఆమెను రక్షించగా, పసివాడి ప్రాణం గాలిలో కలిసింది. నెల్లూరు జిల్లా కొండాపూర్ మండలం ఈస్ట్ ఎర్రబెల్లి గ్రామానికి చెందిన చెన్నబోయిన వేణు, ధనమ్మల కుటుంబం పాతికేళ్ల క్రితం కరీంనగర్ జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంటకు సుతారి పనికోసం ఇక్కడే స్థిరపడింది. వీరికి సృజన, విజయలక్ష్మి ఇద్దరు కుమార్తెలు.
 
 తల్లిదండ్రులను కోల్పోయిన మేనల్లుడు అట్ల సురేష్‌ను తమవద్దే ఉంచుకొని పోషించారు. ఏడు సంవత్సరాల క్రితం పెద్ద కుమార్తె సృజనను మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేశారు. తర్వాత సురేష్, సృజన మండలంలోకి కల్వకోటకు వచ్చి ఇటుబట్టీల వ్యాపారం చేస్తున్నారు. వీరికి చరణ్(5), వంశీ(16నెలలు) కుమారులున్నారు. సృజన కొంతకాలంగా మానసికంగా సరిగ్గా ఉండడం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. పదిరోజుల క్రితం కట్లకుంటలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన ఆమె గురువారం గ్రామ శివారులో రోడ్డుపక్కనున్న వ్యవసాయ బావిలో చిన్నకొడుకు వంశీతోపాటు దూకింది.
 
 తర్వాత మోటారు పైపును పట్టుకొని రక్షించడని అరవడంతో అటుగా వెళ్తున్నవారు వచ్చి సృజనను పైకి తీశారు. బాలుడి కోసం రెండుగంటల పాటు బావిలో గాలించగా మృతదేహం దొరికింది. సృజన మానసిక స్థితి సరిగా లేక బావిలో దూకిందా? కుటుంబ కలహాలతోనా? మరేవైనా కారణాలున్నాయా? అనే విషయం తెలియడం లేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. కారణాలేవైనా.. అభం శుభం తెలియని చిన్నారి చనిపోవడం అందరినీ కలిచివేసింది.
 

>
మరిన్ని వార్తలు