సింగరేణికి గడ్డుకాలం

5 Aug, 2013 04:14 IST|Sakshi

 శ్రీరాంపూర్, న్యూస్‌లైన్ : సింగరేణి  గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.  పదిహేనేళ్లలో మొదటిసారిగా కంపెనీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. బొగ్గు ఉత్పత్తి తగ్గడం, గుర్తింపు సంఘంతో చర్చలు లేకపోవడం, తక్షణం పరిష్కరించాల్సిన కార్మికుల సమస్యలు పెండింగ్‌లో ఉండటం, డెరైక్టర్ల మధ్య సమన్వయ లోపం ఇలా అనేక సమస్యలతో సింగరేణి సతమతం అవుతోంది. పారిశ్రామిక సంబంధాలు అధ్వానంగా మారాయి. అధికారులపై అజమాయిషీ కొరవడింది. గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి గుర్తింపు సంఘానికి కంపెనీకి మధ్య సంక్షోభం తలెత్తింది. టీబీజీకేఎస్‌లో తలెత్తిన గ్రూపుల  మూలంగా యాజమాన్యం గుర్తింపు సంఘంతో చర్చలు జరుపడం మానేసింది.
 
  గ్రూపుల పంచాయతీ తెంచుకొని వస్తేనే చర్చలంటూ తలుపులు మూసింది. దీంతో కార్మికుల ప్రధాన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. గత నెల జరగాల్సిన స్ట్రక్చరల్ సమావేశం, జేసీసీ సమావేశాలను జరుగలేదు. ఇందులో చర్చించాల్సిన కార్మికుల ప్రమోషన్లు, బదిలీ ఫిల్లర్ల పర్మినెంట్ సమస్య, కంపెనీ గతేడాది సాధించిన లాభాలు, అందులో కార్మికుల వాటా, మైనింగ్ స్టాఫ్‌కు సూటబుల్ జాబ్, ఆర్కేపీ, గోదావరిఖనిలో నర్సింగ్ కాలేజీల ఏర్పాటు, ఇంకా ఇతర ప్రధాన డిమాండ్లు అలానే ఉన్నాయి. ప్రధాన మైన సేఫ్టీ ట్రైపార్టియేట్‌ను కూడా నిర్వహించడం లేదు. దీంతో గనుల రక్షణ గాలిలోదీపంగా మారింది. ఈ పరిస్థితులతోనే గాలి ఆడక కార్మికులు ఇటీవల మృత్యువాత పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.
 
 రాజకీయాలకు నిలయంగా కార్యాలయం
 కార్పొరేట్ కార్యాలయం రాజకీయాలకు నిలయంగా మారిందని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్య అధికారులు ఎవరిదారి వారిదే అన్న రీతిలో వ్యవహారం నడిపిస్తున్నారు. డెరైక్టర్ స్థాయి అధికారుల మధ్య సమన్వయం లోపించింది. కీలక స్థానంలో ఉన్న  డెరైక్టర్(పా) కొద్ది కాలంగా వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నాడు. మెడికల్ అన్‌ఫిట్ కేసులు, బదిలీలు ఇతర వాటిల్లో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు కొన్ని సంఘాలు సింగరేణి చైర్మన్‌తోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేశాయి. ఇదిలా ఉంటే ఇటీవల జీఎం(పర్సనల్) పోస్టును నాలుగుగా చేశారు. కొందరు డెరైక్టర్లు వ్యూహాత్మకంగా తమవారికి పోస్టులు ఇప్పించుకొనేందుకు కొత్త పోస్టులు సృష్టించి ఇచ్చారని ఆరోపణలున్నాయి. కార్పొరేట్‌స్థాయి అధికారుల్లో కూడా ‘కమ్యూనిటీ పాలిటిక్స్’ నడుస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
 
 రేపు చైర్మన్‌తో ప్రాతినిధ్య సంఘాలు భేటీ
 ప్రాతినిధ్య సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్‌లు మంగళవారం కంపెనీ సీఎండీని కలువనున్నారు. గుర్తింపు సంఘంతో చర్చలు జరుపడం లేనందున కార్మిక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, సేఫ్టీ సమావేశాలు కూడా జరుగకపోవడంతో గనుల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కావున కనీసం ప్రతినిధ్య సంఘాలతోనైన తమతో కార్మిక సమస్యలపై చర్చలు జరుపాలని చైర్మన్‌ను కోరుతామని హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తెలిపారు. ఇం దులోనే లాభాల విషయం ప్రస్తావిస్తామన్నారు.
 
 ఓసీపీల్లో అధ్వానంగా ఉత్పత్తి
 రాజకీయాల సంగతి ఎలా ఉన్న బొగ్గు ఉత్పత్తిలో మాత్రం ముందుండే సింగరేణి  వెనుకబడి ఉంది. ఓబీ టెండర్ల ఆలస్యం వల్ల సింగరేణి వ్యాప్తంగా పలు ఓసీపీల్లో అనుకున్న స్థాయిలో బొగ్గు ఉత్పత్తి జరుగడం లేదు. ప్రతి నెల 100 శాతం ఉత్పత్తి నమోదు కావాల్సిన ఓసీపీల్లో కొన్ని సగం కు మించి ఉత్పత్తి చేయడం లేదు. సింగరేణి వ్యాప్తంగా ఓసీపీ, యూజీలల్లో కలిపి ఈ సంవత్సరం ఇప్పటివరకు నిర్ధేశించిన లక్ష్యం 1,63,05,323 టన్నులు కాగా ఈ నెల 3 నాటికి ఇందులో 1,38,72,262 టన్నులు మాత్రమే సాధించడం జరిగింది. దీంతో కేవలం 85 శాతమే బొగ్గు  ఉత్పత్తి నమోదైంది. వర్షాల దెబ్బకు జూలైలోనైతే మరి అధ్వాన్నంగా కేవలం 64 శాతం మాత్రమే ఉత్పత్తి అయ్యింది. ఎప్పుడు 100 శాతం దాటి ఉత్పత్తి జరిగేది ఓసీపీల్లో ఇప్పుడు 94 శాతమే లక్ష్యం సాధించారు. శ్రీరాంపూర్ ఓసీపీలో 14 శాతం, కైరిగూడలో 73 శాతం, ఆర్జీ 2 ఓసీపీలో 73 శాతమే ఉత్పత్తి జరిగింది.
 
 

మరిన్ని వార్తలు