బడుగుల అభ్యున్నతికి నడుం బిగించాలి

11 Jan, 2015 02:17 IST|Sakshi
బడుగుల అభ్యున్నతికి నడుం బిగించాలి

బీసీ సంఘం జాతీయ నేత ఆర్.కృష్ణయ్య

గుంటూరు సిటీ: రాజకీయంగా, సామాజికంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి బీసీలు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఏపీ విద్యుత్ శాఖ బీసీ ఉద్యోగుల సంఘం రూపొందించిన 2015 డైరీని కృష్ణయ్య, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు తదితరులు శనివారం బండ్లమూడి గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ విద్యుత్ శాఖ పదోన్నతుల్లో బీసీ ఉద్యోగులకు రిజర్వేషన్ కల్పించాలన్నారు.

విద్యుత్ శాఖ ప్రభుత్వ సలహాదారు కె.రంగనాధం మాట్లాడుతూ వేతన సవరణను ఈ నెల నుంచే అమలు చేస్తారని చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించామన్నారు. ట్రాన్స్‌కో సీఎండీ హెచ్.వై.దొర మాట్లాడుతూ సంస్థలో సాంకేతిక మార్పులను శరవేగంతో తెస్తున్నట్లు వెల్లడించారు. సాంకేతిక నష్టాలను 6శాతం లోపునకు తేవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు.

కేంద్ర ఉద్యోగులతో సమానంగా వేతనాలివ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమాన్ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి పాటుపడుతున్న నాయకులను ప్రశంసించారు. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు మాటాడుతూ సంఘ భవన నిర్మాణానికి రాష్ట్ర రాజధానిలోస్థలం కేటాయించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశ్వరరావు, సంఘం జిల్లా అధ్యక్షుడు అక్కల సత్యనారాయణ, నేతలు జే.శ్రీనివాసరావు, కే.సూర్యప్రకాష్, బి.శ్రీనివాసరావు, జి.రామచంద్రపిళ్ళై, రాజేంద్రకుమార్, డిప్లొమా ఇంజనీర్స్ అధ్యక్షుడు కే.రవిశేఖర్ పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు