సర్వీస్‌ పేరిట బాదుడు!

4 Mar, 2019 08:09 IST|Sakshi
వీరఘట్టం ఏటీఎంలో విత్‌ డ్రా చేస్తున్న ఖాతాదారులు రూ.206.50 పైసలు కట్‌ అయినట్లు మొబైల్‌కు వచ్చిన మెసేజ్‌

ఏటీఎం కార్డులు, బ్యాంకు లావాదేవీలపై సర్వీస్‌ టాక్స్‌

జిల్లాలో సుమారు 7.50 లక్షల మందిపై ఆర్థిక భారం  

శ్రీకాకుళం, వీరఘట్టం: ఏటీఎం కార్డు వినియోగదారులు చేసే లావాదేవీలపై అన్ని బ్యాంకులు సర్వీస్‌ చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఏటీఎం కార్డు వినియోగించినా.. వినియోగించకపోయినా బాదుడు మాత్రం తప్పడంలేదు. జిల్లాలో సుమారు 7.50 లక్షల మంది బ్యాంకు సేవలను పొందుతున్నారు. ఎస్‌బీఐ 2017–2018లో రూ.140లు వసూలు చేస్తే 2018–2019లో రూ.206లు, ఆంధ్రా బ్యాంకు 2017–18లో రూ.120లు వసూలు చేస్తే 2018–19లో రూ.160లు సర్వీస్‌ చార్జీల పేరిట ఖాతాదారులపై భారం మోపుతున్నాయి. ఒక్కో ఖాతాదారుడు నుంచి సరాసరిన లెక్క వేస్తే జిల్లా వ్యాప్తంగా ఏడాదికి రూ.14 కోట్లు సర్వీస్‌ చార్జీల పేరిట వసూలు అవుతున్నట్లు అంచనా.

వసతులు అంతంతమాత్రమే..
జిల్లాలో పలు ఏటీఎం సెంటర్లలో పూర్తి స్థాయి వసతులు లేవు. ఏసీలు పనిచేయవు. ప్రతి లావాదేవికి సంబంధించిన కచ్చితమైన డేటా తెలిసేలా స్లిప్‌లు రావటంలేదు. ఏటీఎంల వద్ద సెక్యూరిటీ గార్డులను కూడా నియమించడం లేదు. పూర్తిస్థాయి వసతులు కల్పించి సర్వీస్‌  చార్జీలు వసూలు చేస్తే బాగుంటుందని ఖాతాదారులు అభిప్రాయ పడుతున్నారు.   

అన్ని సేవలకు చార్జీలు కట్‌అవుతున్నాయి
ఏటీఎం కార్డుతో ఆన్‌లైన్‌ ద్వారా చేసే ప్రతీ లావాదేవీకి సర్వీసు చార్జీల పేరిట డబ్బులు కట్‌ అవుతున్నాయి. మళ్లీ ఏడాదికి ఒకసారి సర్వీసు చార్జీలు వసూలు చేయడం సరికాదు.– భోగి మణి,మెడికల్‌ షాపు యజమాని, వీరఘట్టం  

మరిన్ని వార్తలు