అతనంటే ఒకింత అలజడే..

6 Aug, 2017 11:34 IST|Sakshi
అతనంటే ఒకింత అలజడే..
► చిటికెలో ద్విచక్ర వాహనాల చోరీ 
► కంప్యూటర్‌లో అడ్రస్సులు తీసి మెకానిక్‌లకు టోకరా
► వలపన్ని పట్టుకున్న బాపట్ల పోలీసులు
 
బాపట్ల :  ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాలతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల పోలీసులకు జ్యోతిశివశ్రీ అలియాస్‌ గణేష్‌ అంటే ఒకింత అలజడే. చిటికలో ద్విచక్ర వాహనాన్ని మాయం చేయటంతోపాటు ఆధారాలు చూపించి మరీ వాహనాలను విక్రయించటంలో సిద్ధహస్తుడు. పోలీసు రికార్డుల్లో 120కిపైగా ద్విచక్ర వాహనాలు చోరీకి పాల్పడగా రికార్డుకాని కేసులు ఎన్ని ఉన్నాయోనంటూ పోలీసు అధికారులు పెదవి విరుస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తాళ్ళపూడికి చెందిన జ్యోతిశివశ్రీ అలియాస్‌ గణేష్‌ బాపట్ల ప్రాంతానికి చెందిన ఏనిమిది ద్విచక్రవాహనాలు చోరీ చేసి గత నెల 15వ తేదీన పోలీసులకు చిక్కాడు. అయితే చోరీలలో కూడా సాంకేతికతను వినియోగించుకుని వాహనాల విక్రయాలు చేయటం అతని నైజంగా తెలుసుకుని పోలీసుశాఖ కూడా నివ్వెరపోయింది. 
 
చోరీతోపాటు విక్రయాలు ఇలా..
ద్విచక్ర వాహనాల తాళాలను చిటికలో తీసి సమీపంలోని పార్కింగ్‌ స్టాండ్‌లో పెట్టడం చేస్తాడు. వాహనాలకు సంబంధించిన నంబరు ఆధారంగా మీ సేవ, కంప్యూటర్‌ నెట్‌ సెంటర్లలో వాహనాలకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తాడు. సమీపంలోని మెకానిక్‌ షెడ్‌ చూసుకుని మరమ్మతులు చేయిస్తాడు. అక్కడ మెకానిక్‌తో మాటామంతి కలిపి ఆధారాలతో తన బంధుత్వాన్ని కలిపేస్తాడు. ద్విచక్ర వాహనాన్ని విక్రయిస్తామని, కొత్త మోడల్‌ వాహనాన్ని తీసుకుంటున్నట్లు రెండు రోజులు పాటు నమ్మించి ధర నిర్ణయిస్తాడు. చెప్పిన ధర ప్రకారం ఒరిజనల్‌ పత్రాలు తీసుకుని వస్తానంటూ నమ్మబలుకుతాడు. 
 
ఈలోపు మెకానిక్‌ తీసుకోవటమో...లేక ఎవరికైనా ఇప్పించేందుకు సిద్ధమై గణేష్‌కు ఫోన్‌ చేస్తారు. సొమ్ము తీసుకొని ఒరిజనల్‌ పేపర్లు అక్కడ రైల్వే స్టేషన్‌లో ఉద్యోగం చేస్తున్న తన తండ్రి వద్దనో... లేక బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న తన బావ వద్దనో ఉన్నాయంటూ నమ్మించి వారికి వాహనం అప్పగించి వారిని కూడా స్టేషన్‌కో.. బ్యాంకు వద్దకో తీసుకుపోతాడు. అక్కడ నగదు మా వారికి చూపించాలంటూ చెప్పి కొద్దిసేపు అటూ...ఇటూ తిరిగి ఊడాయించి వెళ్లిపోవటం గణేష్‌ నైజం. అయితే గణేష్‌తోపాటు మరో ఇద్దరు కూడా వాహన చోరీలో సహకరించినప్పటికీ  వారు నేరుగా సీన్‌లోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే పోలీసులు కూడా వారు ఎవరైనేది చెప్పకుండానే విచారణ ప్రారంభించారు.
 
కార్తీకమాసమే టార్గెట్‌
బాపట్ల ప్రాంతంలో కార్తీకమాసమంటే ద్విచక్రవాహన చోదకులు హడలిపోతారు. రెండేళ్ల క్రితం కార్తీకపౌర్ణమి రోజు కనీసం 15వాహనాలు చోరీకి పాల్పడగా ఆవి కృష్ణాజిల్లా ఘంటసాల స్టేషన్‌ పరిధిలో రికవరీ చేశారు. గణేష్‌ టీమ్‌ పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు.
>
మరిన్ని వార్తలు