బీడీఎస్ విద్యార్థి ఆత్మహత్య

26 Feb, 2014 03:02 IST|Sakshi

 కడప అర్బన్; న్యూస్‌లైన్: రిమ్స్ డెంటల్ కాలేజీలో బీడీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న కృష్ణచైతన్య విద్యార్థి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం రిమ్స్‌తోపాటు నగరంలో కలకలం రేపిన ఈ సంఘటన వివరాలు ఇలా.. రిమ్స్ హాస్టలులో సాయంత్రం 4గంటలకు చైతన్య రూమ్‌మేట్ హాస్టలుకు వెళ్లి తలుపుతట్టాడు. అయితే తెరవకపోవడంతో కిటికీలోంచి చూశాడు. కృష్ణ చైతన్య ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటం చూసి కేకలు వేశాడు. దీంతో తోటి విద్యార్థులు తలుపు పగలగొట్టి చైతన్యను దించేశారు. వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో విద్యార్థులంతా గొల్లుమన్నారు.
 
 మృత దేహంతో ర్యాలీ
  మృతదేహాన్ని సాయంత్రం 5  గంటల నుంచి 8గంటల వరకూ రిమ్స్ ప్రధాన గేటు వద్ద ఉంచి ఆందోళన చేశారు. తర్వాత కలెక్టర్ బంగ్లాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓఎస్‌డీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. వీరిని పోలీసులు అదుపుచేసేందుకు యత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
 
 ఆత్మహత్యకు కారణాలు ఇవేనా?
 నందలూరులోని అరవపల్లెకు చెందిన నాగరాజు, ఈశ్వరమ్మల కుమారుడు గంపాల చైతన్యకృష్ణ. ఇతని తండ్రి నాగరాజు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. చైతన్యకృష్ణ కడప దంత వైద్యకళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినితో మాట్లాడుతుండగా హెచ్‌ఓడీ, ఇన్‌ఛార్జి వార్డెన్ లావణ్య నాలుగు రోజుల కిందట గమనించింది. విద్యార్థిని చేత బలవంతంగా తనను ర్యాగింగ్ చేశాడంటూ ఫిర్యాదు చేయించింది. దీంతో చైతన్యకృష్ణ తీవ్ర ఆవేదనకు గురై మంగళవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
 
 మృతదేహాంతో ఆందోళన
 మృతదేహాన్ని కళాశాల గేటు ముందు పెట్టి విద్యార్థులు ఆందోళన  చేశారు. వీరికి రిమ్స్ వైద్య విద్యార్థులు,హౌస్ సర్జన్లు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ విద్యార్థి బృందం మద్దతు పలికింది. దాదాపు నాలుగు గంటలపాటు ఆందోళన చేపట్టారు. కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, రిమ్స్ సీఐ నాయకుల నారాయణ తమ సిబ్బందితో ఆందోళనను సద్దుమణిచేందుకు ప్రయత్నించినా విద్యార్థులు ఒప్పుకోలేదు. దంత వైద్య కళాశాల డెరైక్టర్ డాక్టర్ బాలసుబ్రమణ్యంపై చర్యలు తీసుకోవాలని, హెచ్‌ఓడీ లావణ్యను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. మృతదేహాన్ని కలెక్టర్ బంగ్లాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దారి పొడవునా పోలీసులు అడ్డుకున్నా వారి ఊరేగింపు కొనసాగించారు.  
 
 లావణ్య వేధింపుల వల్లే మృతి చెందాడు
 హెచ్‌ఓడీ లావణ్య వేధింపుల వల్లనే చైతన్యకృష్ణ మృతి చెందాడని విద్యార్థులు ఆరోపించారు. డెరైక్టర్ బాలసుబ్రమణ్యం వద్ద కౌన్సెలింగ్ తర్వాత కూడా చైతన్యకృష్ణను పదేపదే లావణ్య వేధించడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడన్నారు. ఈనెల 24వ తేదిన అతని తండ్రి నాగరాజుకు ఫోన్ చేసి మీ అబ్బాయి పనికిరాడని చెప్పడం మరింత కృంగ దీసిందన్నారు.
 
 కొడుకును చూడటానికి వస్తే...
 తన కుమారుడు చైతన్యకృష్ణ బాగోగులు చూడటానికి వచ్చిన తంఢ్రికి కుమారుడు శవమై కనిపించాడు. దీంతో నోట మాట రాక ఆయన నిశ్చేష్ఢుడై పోయాడు. బంధువులు, మిత్రులు, స్నేహితుల రోదనలతో రిమ్స్ ప్రాంగణంలో విషాధచాయలు చోటుచేసుకున్నాయి.
 

>
మరిన్ని వార్తలు