మూర్తి.. సేవా స్ఫూర్తి

25 Feb, 2015 00:21 IST|Sakshi

     రక్త, నేత్రదానాలతో ప్రోత్సాహం
     పేదలకు ఆర్థికంగా చేయూత
     25 ఏళ్లుగా సేవే పరమావధిగా..

 
 రామచంద్రపురం :ఆయన పేరు తొగరు మూర్తి.. కాలేజీ వయస్సు నుంచి సేవే పరమావధిగా ముందుకుసాగుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా అడుగులేస్తున్నారు. 25 ఏళ్లుగా సేవా స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. ఎవరైనా రక్తం కావాలని అడగడమే తరువాయి. వెంటనే స్పందించే గుణం ఆయనది...
 
 సేవా ప్రస్థానం ప్రారంభం ఇలా..
 మూర్తి బీకాం చదువుతున్న రోజుల్లో కాలేజీ బయట తన స్నేహితుడు శ్రీధర్ ప్రమాదానికి గురయ్యాడు. రక్తం కావాల్సి వస్తే తన స్నేహితులు నలుగురితో కలిసి మూర్తి రక్తాన్ని అందించారు. తమ కుమారునికి పునర్జన్మ ప్రసాదించారంటూ  శ్రీధర్ తల్లిదండ్రులు ప్రదర్శించిన కృతజ్ఞతాభావం మూర్తిలో సేవా భావాన్ని తట్టిలేపింది. రక్తం లేక ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని తెలుసుకున్న మూర్తి వెంటనే తన నలుగురు స్నేహితులతో కలిసి ఏర్పాటు చేసిన రక్షా ఫౌండేషన్ ద్వారా గత 25 ఏళ్లలో  జిల్లావ్యాప్తంగా సుమారుగా 12వేల మందికి రక్తాన్ని అందించారు.
 
 మూర్తిగానే సుపరిచితులు
 తొగరు ఆదినారాయణ, మంగామణి దంపతుల పెద్దకుమారుడు తొగరు సత్యనారాయణమూర్తి. ఆయన అందరికీ మూర్తిగానే సుపరిచితులు. 1989 నుంచి రక్షా ఫౌండేషన్ ద్వారా యువకులకు, రక్త, నేత్రదానంపై అవగాహన కల్పించడంతోపాటుగా ఇప్పటివరకు ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు 11 జతల నేత్రాలను కూడా అందించారు. గత 25 ఏళ్లుగా ఇప్పటివరకు మూర్తి 50సార్లు స్వయంగా రక్తదానం చే సి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. రోటరీ క్లబ్ మేనేజర్ డాక్టర్ కామరాజు, సినీ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్‌తో పాటుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి నుంచి కూడా మూర్తి ప్రశంసలదుకున్నారు.
 
 పేదలకు సాయం చేయడంలోనూ ముందు
 రక్తదానమే కాకుండా పేదలకు సాయం చేయటంలోనూ మూర్తి ముందుంటారు. ఎందరో నిరుపేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించి ఉపాధి మార్గాన్ని చూపించారు. పేదవారి వివాహాలకు కూడా ఆర్థిక సాయాలు అందించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే సంజీవిని 108ను ఉంచేందుకు చోటు లేకపోతే. పట్టణంలోని డీసీసీబీ బ్యాంకు వద్ద రూ.10వేలతో షెడ్డును ఏర్పాటు చేశారు. ఓటరు అవగాహన సదస్సుల ఏర్పాటుతోపాటు, బాల కార్మికుల సంక్షేమం గురించి పోరాటం చేయడంలోనూ మూర్తి ముందుంటారు. స్థానిక వైఎస్సార్ నగర్‌లో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించారు. స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడాప్రాంగణంలో వాకర్స్ క్లబ్ గౌరవాధ్యక్షునిగా కూడా మూర్తి పనిచేస్తున్నారు. క్రీడాప్రాంగణంలో సదస్సులు ఏర్పాటు చేసి నడకతో కలిగే ప్రయోజనాలు, యోగా ద్వారా కలిగే ఆరోగ్య ఉపయోగాల గురించి తెలియజేస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అనే తలంపుతోనే సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు మూర్తి చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు