స్మార్ట్‌ఫోన్... ముక్కలు ముక్కలుగా! | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్... ముక్కలు ముక్కలుగా!

Published Wed, Feb 25 2015 11:51 AM

స్మార్ట్‌ఫోన్...  ముక్కలు ముక్కలుగా! - Sakshi

స్మార్ట్‌ఫోన్ మార్చడం ఇప్పుడు దుస్తులు మార్చుకోవడమంత సులభం. కొత్త ఫీచర్లు ఉన్నాయని తెలిస్తే చాలు.. కొనేస్తే పోలా అనుకుంటాం. అయినప్పటికీ వాటి ఫీచర్లతో కొంతైనా రాజీ పడక తప్పదు. డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా ఇలా  ఏదో ఒకటి మనం అనుకున్నట్లుగా లేకపోయినా అలా వాడేస్తూంటాం. ఈ ఇబ్బంది కూడా ఇంక కొంత కాలమే. ఆ తరువాత మీకు నచ్చిన ఫీచర్లను మీకు నచ్చిన విధంగా దేనికదే సెపరేట్‌గా ఎన్నుకోవచ్చు. మార్చాలనుకున్నప్పుడు కూడా ఏది సరిగా లేదనుకుంటారో దాన్ని మాత్రమే మార్చుకోవచ్చు.
 అదెలా? అన్నదేనా మీ ప్రశ్న.  అంతా గూగుల్ ‘ప్రాజెక్ట్ ఆరా’ మహత్యం.
 
మైక్రోప్రాసెసర్, గ్రాఫిక్ కార్డ్, మెమరీ, కెమెరా.. ఇలా అనేక విడిభాగాలను ఒకదగ్గరకు చేర్చి స్మార్ట్‌ఫోన్ తయారు చేస్తారన్నది మనకు తెలిసిన విషయమే. కానీ... కొంతకాలం తరువాత ఈ విడిభాగాల్లో ఏది సక్రమంగా పనిచేయకపోయినా... అన్నింటినీ పక్కనపడేయాలి. కొత్తగా కొనుక్కోవాలి. ఇలాకాకుండా ఏ విడిభాగానికి అది వేరుగా దొరికితే? పనిచేయని భాగాన్ని మాత్రమే పడేసి దాని స్థానంలో కొత్త భాగాన్ని వేసి యధావిధిగా వాడుకోగలిగితే? అద్భుతంగా ఉంటుంది. గూగుల్ సిద్ధం చేస్తున్న సరికొత్త, వినూత్న స్మార్ట్‌ఫోన్... ‘ఆరా’ అచ్చంగా ఇలాగే పనిచేస్తుంది!

గూగుల్ 2013 నుంచి ఫోన్‌బ్లాక్స్ పేరుతో ఆరా తరహా స్మార్ట్‌ఫోన్ తయారీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఆ సమయంలో గూగుల్ ఆధీనంలోనే ఉన్న మోటరోలా కంపెనీలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అండ్ ప్రాజెక్ట్ గ్రూప్ కూడా ఇదే ఆలోచనతో ఉండటంతో ఆరా ప్రాజెక్టు వేగం పుంజుకుంది. రెండు ప్రాజెక్టులను కలిపేసిన గూగుల్ మోటరోలాను లెనవూకు విక్రయించినా ఈ ప్రాజెక్టును మాత్రం తమవద్దే ఉంచుకుంది. చివరకు గత నెలలో ఆరా తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయో? ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందో గూగుల్ ప్రకటించింది.
 
పేర్చుకుంటూ పోతే సరి..

ప్రతి స్మార్ట్‌ఫోన్‌లోనూ తప్పనిసరిగా ఉండే మదర్‌బోర్డ్ ప్రాజెక్ట్ ఆరా స్మార్ట్‌ఫోన్‌లో అత్యంత కీలకమైన భాగం. మదర్‌బోర్డ్ ఒకవైపు మొత్తం ఫోన్‌స్క్రీన్‌గా ఉపయోగపడుతుంది. ఈ రెండింటినీ కలిపి స్పైరల్ 2 ఎక్సోస్కెలిటన్ అని పిలుస్తున్నారు. ఇది కూడా మినీ, మీడియం, లార్జ్ అన్న మూడు సైజుల్లో ఉంటుంది. ఎక్సోస్కెలిటన్‌పై క్లిప్ చేసుకోగల మాడ్యూళ్ల సంఖ్యను బట్టి స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, సైజు మారిపోతాయి. మీడియం వెర్షన్ ఎక్సోస్కెలిటన్‌నే తీసుకుంటే అది ఐదంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. దీనిపై 3 బై 6 గ్రిడ్‌లో మాడ్యూల్స్ క్లిప్ చేసుకోవచ్చు. లార్జ్ వెర్షన్‌లోనైతే స్క్రీన్‌సైజు 6 అంగుళాల కంటే ఎక్కువ ఉండగా, మాడ్యూళ్లు కూడా ఎక్కువ సంఖ్యలో పడతాయి. 1 బై 1, 1 బై 2, 2 బై 2 సైజుల్లో లభించే మాడ్యూళ్లను పేర్చుకుంటూ పోతే ఫీచర్లు పెరుగుతూ పోతాయన్నమాట.

మెమరీ చాలదనుకుంటే ఆ మాడ్యూల్‌ను అలాగే కెమెరా, ఇతర పరికరాల మాడ్యూల్స్‌ను ఎప్పటికప్పుడు విడివిడిగా మార్చుకోవచ్చు. అంతేకాదు. మాడ్యూల్స్ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అవుతూంటాయి కాబట్టి కొత్త ఫీచర్లున్నాయో... స్క్రీన్ బాగుందనో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాల్సిన అవసరం రాదు.

 ఉపయోగాలెన్నో...

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం ఇప్పుడు కేవలం మాట్లాడుకునేందుకు, నెట్ బ్రౌజ్ చేసేందుకు మాత్రమే పరిమితం కాలేదు. వైద్య పరీక్షలతోపాటు, కంప్యూటర్‌కు ప్రత్యామ్నాయంగానూ ఇది ఎదిగింది. ఈ నేపథ్యంలో ఆరా స్మార్ట్‌ఫోన్‌లోని మాడ్యూల్స్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వీటిద్వారా ఏఏ ఉపయోగాలు ఉంటాయో అంచనా వేస్తున్నాయి. వెస్టిజెన్ అనే కంపెనీ రక్త పరీక్షల కోసం ఓ మాడ్యూల్‌ను తయారు చేయాలని ఆలోచిస్తోంది. అలాగే లాప్‌కా అనే సెన్సర్ రీసెర్చ్ సంస్థ గాలి, వెలుతురు నాణ్యతల పరిశీలన కోసం మాడ్యూల్‌ను తయారు చేయవచ్చునన్న ఆలోచనలో ఉంది. గూగుల్ గ్రూప్స్‌లో ఒక బృందం మాడ్యూళ్లకు సంబంధించిన ఆలోచనలు చేసేందుకు, చర్చించేందుకూ ఏర్పాటైంది.

ఖరీదు ఎక్కువవుతుందేమో?

మీకు ఏయే మాడ్యూల్స్ అవసరమవుతాయన్నదానిపై ఆరా స్మార్ట్‌ఫోన్ ఖరీదు ఆధారపడి ఉంటుంది. మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీని ధరను కనీస స్థాయిలో ఉంచేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది. హంగు, ఆర్భాటాలు ఏవీ లేని బేసిక్ ఫోన్‌ను యాభై డాలర్ల (రూ.3000)కే లభించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ఏడాది చివరికల్లా ప్యూర్టోరికో ప్రాంతంలో మొట్టమొదటి ఆరా స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. మొబైల్ ఇంటర్నెట్ వాడకం ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడం, అమెరికా ఆధీనంలోనే ఉన్న చోటు కావడం వల్ల ప్యూర్టొరికోను ఎన్నుకున్నామని గూగుల్ చెబుతోంది. అన్నీ బాగానే ఉన్నప్పటికీ ప్రాజెక్ట్ ఆరాపై ఇంకా కొన్ని సందేహాలు మిగిలే ఉన్నాయి. అసలు ఇది సాధ్యమయ్యే పని కాదని కొందరు అంటూ ఉంటే, మాడ్యూళ్లు కేవలం ఉన్నతశ్రేణి వారికి మాత్రమే పరిమితమవుతాయని కొందరు అంచనా వేస్తున్నారు. ఏమైతేనేం... స్మార్ట్‌ఫోన్ తీరుతెన్నులైతే సమూలంగా మారిపోనుందనేది మాత్రం నిజం!
 
 

Advertisement
Advertisement