సత్రం సూపించు సామీ!

12 Sep, 2015 03:40 IST|Sakshi
సత్రం సూపించు సామీ!

టీటీడీ కల్యాణ మండపాలను బుక్ చేసుకోవడంలో ఇబ్బందులు
బ్యాంకు ఓ చోట.. అధికారి మరోచోట

 
తిరుపతి అర్బన్: వివాహానికి ముందే పెళ్లి బృందాలకు ప్రయాసలు పెడుతున్న ఘనత టీటీడీకే దక్కుతుంది. అందుకు తిరుపతిలోని టీటీడీ కల్యాణ మండపాలను బుక్ చేసుకునేందుకు ఎదురవుతున్న సవాలక్ష ఇబ్బందులు ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయి. ప్రయాసలు పడలేక పెళ్లి బృందాలు.. ఈ కల్యాణ మండపాలూ వద్దూ.. వీటిల్లో సెంటిమెంట్ పెళ్లిళ్లూ వద్దంటూ నిష్టూరుస్తున్నాయి. దాంతో పెళ్లిళ్ల సీజన్‌లోనూ అనేక సందర్భాల్లో కల్యాణ మండపాలు ఖాళీగా ఉంటూ టీటీడీకి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. అయినా సంబంధిత అధికారుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. తిరుపతిలో  టీటీడీ  నిర్వహిస్తున్న శ్రీనివాస, పద్మావతీ కల్యాణ మండపాల సముదాయాల్లో మొత్తం ఎనిమిది మండపాలున్నాయి. తిరుమల వెంకన్నపై ఉండే భక్తితో జనం సెంటిమెంట్‌గా ఈ సత్రాల్లోనే పెళ్లిళ్లు చేస్తుంటారు. అందుకు కొంత ఆలస్య తేదీలు దొరికినా పర్వాలేదని పెళ్లిళ్లు జరిపిస్తుంటారు. అయితే పెళ్లి బృందాల సెంటిమెంట్‌ను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోని టీటీడీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దాంతో కల్యాణ మండపాల బుకింగ్ కోసమే వారాల తరబడి ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. 15 ఏళ్ల క్రితం వరకు ఈ 8 కల్యాణ మండపాల బుకింగ్‌ను ఆయా సత్రాల్లోనే చేపట్టేవారు. దాంతో పెళ్లి బృందాలు నేరుగా సత్రాలకు వెళ్లి నగదు చెల్లింపులు జరిపి మండపాలను బుక్ చేసుకునేవారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో మండపాల బుకింగ్‌ను డీఆర్ మహల్ రోడ్డులోని టీటీడీ ధర్మసత్రాలకు చెందిన సూపరింటెండెంట్‌కు అప్పగించారు.

ఆ పిమ్మట రైల్వేస్టేషన్‌కు ఎదురుగా ఉన్న విష్ణునివాసం డెప్యూటీ ఈవోకు మండపాల బుకింగ్ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ డెప్యూటీ ఈవోను సంప్రదించగానే కావాల్సిన పత్రాలు తీసుకుని ఖాళీగా ఉన్న కల్యాణ మండపానికి ఉన్న అద్దె రేటు ప్రకారం ఇక్కడే ఉన్న బ్యాంకులో నగదు చెల్లించి చలానా డెప్యూటీ ఈవోకు అందజేస్తే మండపం బుక్ అయ్యే సౌకర్యం ఉండేది. కానీ కొందరు టీటీడీ అధికారుల ఏకపక్ష నిర్ణయం కారణంగా ప్రస్తుతం మండపాల బుకింగ్‌ను యూనివర్సిటీ వద్దనున్న పద్మావతీ అతిథిగృహం డెప్యూటీ ఈవోకు మార్చారు. ఇక్కడ్నుంచి పెళ్లి బృందాలకు కష్టాలు మొదలయ్యాయి. ఇక్కడ సరైన సమాచారం చె ప్పేవాళ్లు లేక, సిబ్బంది అందుబాటులో ఉండక అవస్థలు పడుతున్నారు. అంతేగాక పద్మావతీ అతిథిగృహానికి నిత్యం వీఐపీల తాకిడి ఉంటున్న కారణంగా అక్కడి డెప్యూటీ ఈవో పెళ్లి బృందాలకు సకాలంలో అందుబాటులో ఉండడం లేదు.

ఒకవేళ అధికారి ఉన్నా, పెళ్లి నిర్వాహకులు నగదు చెల్లింపు కోసం మళ్లీ టౌన్‌లోని బ్యాంకులకే రావాల్సి ఉంది. ఆ కారణంగా విసిగివేసారి.. వద్దురా ఈ కల్యాణ మండపాలంటూ విసిగిపోతున్నారు. గతంలోలాగా విష్ణునివాసంలోని డెప్యూటీ ఈవోకే ఆ బాధ్యతలు అప్పగిస్తే,  బ్యాంకు కూడా అక్కడే ఉన్న కారణంగా పెళ్లి బృందాలకు మండపాల బుకింగ్ సులభతరమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
 

మరిన్ని వార్తలు