తుపానుకు తెగిన చెరువులు.. కుంటలు

29 Oct, 2013 07:03 IST|Sakshi

సాక్షి, నల్లగొండ:  జిల్లాలో చెరువులు ఎంత పటిష్టంగా ఉన్నాయో ఇటీవల కురిసిన వర్షాలే స్పష్టం చేశాయి. చెరువు కట్టల నాణ్యతలో ఉన్న డొల్లతనం కళ్లకు కట్టినట్టు కనబడుతోంది. వర్షాకాలం వచ్చినా పట్టించుకోలేదు. వర్షాలు కురిసే నాటికే చెరువులకు పకడ్బందీగా పనులు చేపట్టాల్సి ఉండగా నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవ ర్తించారు. కొన్నిచోట్ల చేసిన మరమ్మతుల్లో  నాణ్యత మచ్చుకైనా కనిపించడం లేదు. దీని ఫలితంగానే వందకుపైగా చెరువులు, కుంటల కట్టలకు గండ్లు పడి తెగిపోయాయి. ఈ వరద ఉధ్ధృతికి దిగువ ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలు నామరూపాల్లేకుండా పోయాయి. జిల్లాలో 27వ తేదీ వరకు 385 చెరువులు, కుంటలు, ఫీడర్ ఛానళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు లెక్కగట్టారు.
 
  సోమవారం కూడా మరో 35 చెరువులు, కుంటలకు గండ్లు పడ్డట్టు తెలిసింది. ఈ మొత్తంలో 200కు పైగా పూర్తిగా కట్టలు తెగిపోయాయని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ లెక్కన నీటిపారుదల శాఖకు *36 కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. కట్టలు తెగిపోవడంతో పారిన వరదలు పంటపొలాలు, గ్రామాలను ముంచెత్తాయి. వ్యవసాయ మోటార్లు, మూగజీవాలు కొట్టుకుపోయాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ కారణంగా వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ముఖ్యంగా అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
 
 అప్పటికే పరిస్థితి చేజారింది
 చెరువులు, కట్టలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని సమాచారం అందడం వాస్తవమే. దీంతో మేం కొన్నిచోట్ల ఎటువంటి ముప్పు వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. శాయశక్తులా కృషి చేశాం. అయితే కొన్ని గ్రామాల్లో చర్యలు తీసుకునే అవకాశం లేకపోయింది. భారీగా కురుస్తున్న వర్షాలు, చెరువులకు యంత్రాలు వెళ్లలేని స్థితి పనులకు ఆటంకం కలిగించింది. అప్పటికే వరద ఉద్ధృతంగా రావడంతో పరిస్థితి చేజారిపోయింది. కట్టలు తెగిపోవడం విచారకరం.
 - హమీద్‌ఖాన్, నీటి పారుదల శాఖ ఈఈ
 
 నాణ్యత నగుబాటు
 జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఆర్జాలబావిలోని వల్లభరావు చెరువుకు ఇటీవలే మరమ్మతులు చేపట్టారు. ఆర్‌ఆర్‌ఆర్ (మరమ్మతులు, పునరుద్ధరణ, పునర్నిర్మాణం) నిధుల కింద *8 లక్షలు ఖర్చు చేసి చెరువు కట్టను అభివృద్ధి చేశారు. ఈ పనుల్లో ఎక్కడా నాణ్యత కనబడడం లేదు. కేవలం పైపై మెరుగులు దిద్ది చేతులు దులుపుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కట్ట అక్కడక్కడా కుంగిపోయింది. చివరకు నిలువలేక పోయింది. గండి పడి నీరంతా పొలాల్లో పారడంతో వరిపైరంతా తుడిచిపెట్టుకుపోయింది. అంతేగాక సమీపంలోని అర్బన్ కాలనీ, పానగల్‌లోని సగం ఇళ్లు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని దెబ్బతిన్నాయి. చిరువ్యాపారుల బతుకులు చిన్నాభిన్నమయ్యాయి. రెండు రోజుల పాటు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
 
 సమాచారం ఇచ్చినా...
 ఈ సీజన్‌లో ముందు కురిసిన వర్షాలతోనే తిప్పర్తి మండలం చెరువుపల్లి చెరువు పూర్తిగా నిండి అలుగు పోసింది. చెరువుకట్ట ప్రమాద స్థితిలో ఉందంటూ రైతులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కట్ట పరిస్థితిని తెలియజేసే ఫొటోలు సైతం అధికారులకు పంపించారు. అయినా అధికారులు నిద్రమబ్బు వీడలేదు. దీంతో రైతులే స్వయంగా ఇసుక సంచులు కట్టకు సపోర్టుగా వేశారు. ఇలా నెలరోజుల పాటు బాగానే ఉంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వచ్చిన వరదతో కట్టకు గండిపడింది. దీంతో నీరంతా దిగువ ప్రాంతాల్లో ఉన్న వరిపైరును నేలమట్టం చేసింది. పంటపొలాల్లో ఎక్కడ చూసినా ఇసుక మేటలు ఏర్పడ్డాయి. దాదాపు 300ఎకరాల్లో వరిపైరు చేతికి రాకుండా పోయింది. మరో 100ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది.

మరిన్ని వార్తలు