సమైక్య బంద్ సంపూర్ణం

1 Aug, 2013 06:09 IST|Sakshi

సాక్షి, గుంటూరు: సమైక్యవాదుల నిరసనలు జిల్లాలో భగ్గుమన్నాయి. తెలంగాణ విభజనపై యూపీఏ ప్రకటనకు నిరసనగా రాజకీయ, మేధావి, స్వచ్ఛంద, వ్యాపార, ఉద్యోగ, కార్మికవర్గాలు బుధవారం ఆందోళనలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా జరిగిన సమైక్యాంధ్ర నిరసనకారుల బంద్ విజయవంతమైంది. జిల్లా కేంద్రంతో పాటు బాపట్ల, పొన్నూరు, తెనాలి, మంగళగిరి, రేపల్లె తదితర పట్టణాల్లో  సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, జేఏసీ నేతలు భారీగా ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టారు. అన్ని సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయడంతో పట్టణాల్లోని ప్రధాన వీధులన్నీ బోసి పోయాయి. పలుచోట్ల యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.  
 
 
 దేశంలో చిన్న రాష్ట్రాల విభజనకు రెండో ఎస్సార్సీ వేస్తానంటున్న రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆంధ్రప్రదేశ్‌పై చిన్నచూపు చూశారని, సోనియాగాంధీ తన రాజకీయ స్వార్థానికే విభజన అంశం పట్టుకున్నట్లు సర్వత్రా విమర్శిస్తుండటం గమనార్హం. టీడీపీ ఆధినేత తెలంగాణపై లేఖ ఇవ్వడమే రాష్ట్ర విభజన ప్రక్రియ ప్రారంభమైందని రాజకీయ వర్గాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
 
 ఆంధ్ర రాష్ట్రాన్ని తమ స్వలాభాల కోసం ముక్కలు చేస్తున్న కాంగ్రెస్ పెద్దలకు పదవుల్లో కొనసాగే నైతిక అర్హత లేదంటూ  వైఎస్సార్ సీపీ నేతలు బుధవారం బంద్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. నగర, యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో గుంటూరుతో పాటు తెనాలి, బాపట్ల, పొన్నూరు, మంగళగిరిలో భారీగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి.
 
 గుంటూరు నగర పార్టీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో సమన్వయకర్తలు షేక్ షౌకత్, ఎండీ నసీర్‌అహ్మద్, రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం), ఈపూరి అనూప్, ఇంకా ఆతూకూరి ఆంజనేయులు, పార్టీ ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ షేక్ గులాంరసూల్,   విద్యార్ధి విభాగం జిల్లా కన్వీనర్ ఉప్పూటూరి నర్సిరెడ్డి, నగర కన్వీనర్ పానుగంటి చైతన్య, సేవాదళ్ నగర కన్వీనర్ పల్లపు శివ, బీసీ విభాగం నగర కన్వీనర్ మద్దుల రాజాయాదవ్, మేళం ఆనంద్‌భాస్కర్, పారా కౌషిక్, అంగడి శ్రీనివాసరావు, కార్యకర్తలు అరండల్‌పేట, బ్రాడీపేట, ఓవర్‌బ్రిడ్జి, ఏసీ, హిందూ కళాశాల, మార్కెట్ సెంటర్ మీదుగా జిన్నాటవర్ మహాత్మాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేసి అక్కడ రోడ్డుపై బైఠాయించి యూపీఏ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెనాలిలో వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ విభాగం ఆధ్వర్యంలో చెంచుపేట, గాంధీచౌక్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మల్ని దహనం చేశారు.
 సమైక్యాంధ్ర మద్దతు సంఘాల ఆధ్వర్యంలో..: సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు స్పందించి సెలవులు ప్రకటించాయి.
 
 సమైక్యాంధ్ర జేఏసీ గౌరవాధ్యక్షుడు ఆచార్య పి. నరసింహారావు, కన్వీనర్ ఆచార్య శామ్యూల్, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ కోసూరి వెంకట్, సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ కో-ఆర్డినేటర్ మండూరి వెంకటరమణ విద్యార్థులతో కలసి  శంకర్‌విలాస్ సెంటర్‌లో రోడ్డుపై బైఠాయించి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం సమైక్యాంధ్ర కోసం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
 
 సమైక్యవాదం వినిపించడంలో కోస్తా, రాయలసీమల్లోని ప్రజాప్రతినిధులు తీవ్రంగా విఫలమయ్యారని ఆచార్య శామ్యూల్ ఈ సందర్భంగా విమర్శించారు. తెలుగుజాతి ఐక్యత సమితి అధ్యక్షుడు ఆళ్ల హరి ఆధ్వర్యంలో కూడా పలు నిరసన కార్యక్రమాలు జరిగాయి. మైనార్టీస్ ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షులు ఎస్.ఎం.షరీఫ్ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర బంద్‌కు నగర స్వర్ణకారులు మద్దతు తెలియజేశారు. ఏపీ ఎన్జీవో సంఘాల ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాల్లో విధులు నిలిపివేసి, కలెక్టర్ కార్యాలయం ఎదుట మానవహారంగా ఏర్పడ్డారు..
 
 నిలిచిపోయిన ఆర్టీసీ సర్వీసులు.: బంద్ సందర్భంగా గుంటూరు ఆర్టీసీ రీజయన్ నుంచి 400 బస్ సర్వీసులు ఆగిపోయాయి సుమారు రూ. 50 లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని ఆర్టీసీ రీజ నల్ మేనేజర్ పీవీ రామారావు తెలిపా రు. వెయ్యి మందికి పైగా పోలీసులు బస్టాండ్‌ల వద్ద  బందోబస్తు నిర్వహించారు.
 

మరిన్ని వార్తలు