నేరాల నియంత్రణకు మూడో నేత్రం

1 Jun, 2018 13:36 IST|Sakshi
తెనాలి బోసురోడ్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు

తెనాలి పట్టణంలో ముందడుగు

ప్రధాన కూడళ్లలో అత్యాధునిక నిఘా కెమెరాల ఏర్పాటు

ట్రాఫిక్, నేరాల నియంత్రణే లక్ష్యం

జిల్లాలో పెరుగుతున్న ట్రాఫిక్, నేరాల నియంత్రణకు పోలీస్‌ శాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌(ఏపీఎస్‌ఎప్‌ఎల్‌) ఆధ్వర్యంలో భారీ వ్యయంతో తెనాలి పట్టణంలో ప్రధాన కూడళ్లు, రహదారుల్లో అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేసి నేర నియంత్రణకు ముందడుగు వేసింది.  

తెనాలి రూరల్‌ : సమస్యాత్మక ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో నిఘా నేత్రాల ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే నిఘా కెమెరాల ఏర్పాటు పూర్తికావడంతో కొద్ది రోజుల్లో ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు. కేవలం పట్టణం, ప్రధాన కూడళ్లే కాకుండా మారుమూల గ్రామాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్‌ సమస్యనే కాకుండా శాంతి భద్రతల రక్షణ, నేరాల అదుపు వంటి బహుళ ప్రయోజనాలకు ఈ వ్యవస్థను వినియోగించుకునేందుకు పోలీసుల శాఖ ముందడుగు వేసింది. సీసీ కెమెరాలతో ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి చలాన్లు రాసేందుకేనన్న విమర్శలున్నాయి. దీనికి భిన్నంగా రాష్ట్రంలో ఆధునతన పరిజ్ఞానంతో కెమెరాలను ఏర్పాట చేస్తున్నారు. నేరాల నియంత్రణకు వీటిని ఎంచుకోవడం విశేషం! హైటెక్‌ సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సాఫ్ట్‌వేర్‌ను ఇందుకోసం ఉపయోగించనున్నారు.

రూ. వెయ్యి కోట్లతో..
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌(ఏపీఎస్‌ఎప్‌ఎల్‌) ఆధ్వర్యంలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించి, రూ.969 కోట్లు కేటాయించింది. మేట్రిక్స్‌ సంస్థ ఈ పనులు చేపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 14,764 కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జిల్లా హెడ్‌క్వార్టరు, సబ్‌ డివిజన్‌ హెడ్‌క్వార్టర్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం కెమెరాల ఏర్పాటు పూర్తి కావచ్చింది. త్వరలో కంట్రోల్‌ రూమ్‌ల కేటాయింపులు చేపట్టనున్నారు. అడ్వాన్స్‌డ్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌(ఏఎన్‌పీఆర్‌), రెడ్‌ లైట్‌ వయోలేషన్‌ రికగ్నిషన్‌(ఆర్‌ఎల్‌వీడీ), ఫస్త్రస్‌ రికగ్నిషన్‌(ఎఫ్‌ఆర్‌ఎస్‌), వీడియో అనలైటిక్స్‌(వీఏ) వంటి నాలుగు రకాల ఆధునాతన కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. తెనాలి సబ్‌ డివిజన్‌లోని 10 పోలీస్‌స్టేషన్లకు గాను 107 కెమెరాలను కేటాయించారు. వీటిలో ఏఎన్‌పీఆర్‌ – 45, ఎఫ్‌ఆర్‌ఎస్‌ – 5, వీఏ – 20, ఆర్‌ఎల్‌వీడీ, సాధారణ కెమెరాలు 37 ఉన్నాయి.

ఆధునిక కెమెరాల ప్రయోజనాలు
ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు వాహనాల నంబర్‌ప్లేట్లను గుర్తిస్తాయి. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ నంబర్‌ ప్లేట్ల వివరాలను డేటాబేస్‌తో సరిపోల్చి, యజమాని వివరాలను తక్షణమే కంట్రోల్‌ రూమ్‌ సిబ్బందికి తెలియజేస్తుంది. అంతే కాక, నేరానికి పాల్పడి, వాహనాలపై పరారవుతున్నా వారిని గుర్తించడం సులువవుతుంది.
ఆర్‌ఎల్‌వీడీ కెమెరాలు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద రెడ్‌లైట్‌ పడి ఉన్నా, అతిక్రమించే వారిని గుర్తించి, వాహన వివరాలను కంట్రోల్‌రూమ్‌కు చేరవేస్తాయి. ట్రాఫిక్‌ సిబ్బంది లేకపోయినా, చలానాలు వస్తుంటాయి, వాహనదారులు ఇక సిగ్నల్‌ పడితే బ్రేక్‌ వేయాల్సిందే.
ఎఫ్‌ఆర్‌ఎస్‌ కెమెరాలు డేటాబేస్‌లోని వ్యక్తుల ముఖాలను ఎప్పటికప్పుడు పోల్చుకుంటూ ఉంటాయి. పరారీలో ఉన్న నేరగాళ్లు, బహిష్కృత నేరగాళ్లు, అంతకు ముందే పోలీసుల రికార్డుల్లో ఉన్న అసాంఘిక శక్తులు ప్రవేశిస్తే వంటనే ఈ కెమెరాలు కంట్రోల్‌ రూమ్‌ సిబ్బందిని అప్రమత్తం చేస్తాయి.
వీఏ కెమెరాలు వీడియో రికార్డింగ్‌ను చేస్తుంటాయి. నెల, రెండు నెలలే కాకుండా కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజిలతో నేర దర్యాప్తును చేసేందుకు వీలవుతుంది. కంట్రోల్‌ రూములో వీటిని పర్యవేక్షించే సీఐ స్థాయి అధికారి ఎక్కడ ట్రాఫిక్‌ సమస్య తలెత్తినా వెంటనే ప్రత్యామ్నాయ మార్గాల్లో క్లియర్‌ చేసే వీలుంటుంది.

ఏర్పాటు సరే.. నిర్వహణ..
అధునాతన కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయడం ఏ ఎత్తయితే, దీని నిర్వహణ తలకు మించిన భారం కానుంది. తెనాలి పట్టణంలో 2012లోనే 48 కూడళ్లలో అధునాతన కెమెరాలను ఏర్పాటు చేశారు. పురపాలక సంఘం రూ. 15 లక్షలు కేటాయించి, మార్కెట్‌ కాంప్లెక్సులో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటుకూ అనుమతిచ్చింది. నేర పరిశోధనల్లో ఈ కెమెరాలూ ఉపయోగపడ్డాయి. అయితే తదనంతర కాలంలో వీటి నిర్వహణపై ఇరు శాఖలు పట్టించుకోలేదు. దీంతో కెమెరాలు నిరుపయోగమయ్యాయి. కెమెరాల దీర్ఘకాలిక నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు