పోలవరానికి రూ.3 వేల కోట్లు!

26 Oct, 2019 03:24 IST|Sakshi

కేంద్ర జల్‌శక్తి శాఖ పంపిన ప్రతిపాదనలపై సానుకూలంగా  స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ 

నవంబర్‌ మొదటి వారంలో నిధులు విడుదల చేస్తామని సమాధానం

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు రూ.మూడు వేల కోట్లను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ శుక్రవారం పంపిన ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది. నవంబర్‌ మొదటి వారంలో నాబార్డ్‌ ద్వారా నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామని కేంద్ర జల్‌శక్తి శాఖకు సమాచారం ఇచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. వివరాల్లోకి వెళితే.. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటిదాకా రూ.16,935.6 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు (ఏప్రిల్‌ 1, 2014కు ముందు) రూ.5,135.87 కోట్లను ఖర్చు చేసింది. పోలవరం ప్రాజెక్టును వంద శాతం వ్యయంతో పూర్తి చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చాక ఏప్రిల్‌ 1, 2014 నుంచి ఇప్పటిదాకా రూ.11,799.73 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో రూ.6,727.26 కోట్లను కేంద్రం రీయింబర్స్‌ చేయగా రూ.5,072.47 కోట్లను రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. 

సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షతో కదలిక
గతేడాది జూలై 26న పోలవరం ప్రాజెక్టుకు రూ.393.51 కోట్లను విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు కేంద్ర జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపింది. ఏప్రిల్‌ 1, 2014కు ముందు పోలవరం ప్రాజెక్టుకు వ్యయం చేసిన నిధులకు సంబంధించి ఆడిట్‌ చేయించి.. స్టేట్‌మెంట్‌ను పంపితే నిధులు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి గతేడాది కేంద్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. కానీ ఏప్రిల్‌ 1, 2014కు ముందు చేసిన పనుల వ్యయానికి సంబంధించి ఆడిటెడ్‌ స్టేట్‌మెంట్‌ పంపకుండా టీడీపీ సర్కార్‌ జాప్యం చేస్తూ వచ్చింది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక సాగునీటి ప్రాజెక్టులపై నిర్వహించిన తొలి సమీక్ష సమావేశంలోనే.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని ఆరా తీశారు.

ఏప్రిల్‌ 1, 2014కు ముందు చేసిన వ్యయానికి ఆడిటెడ్‌ స్టేట్‌మెంట్‌ను కేంద్ర ఆర్థిక శాఖకు పంపాల్సి ఉందని అధికారులు చెప్పారు. దాంతో ఆడిటెడ్‌ స్టేట్‌మెంట్‌ను పంపాలని ఆదేశించారు. ఆ మేరకు ఆడిటెట్‌ స్టేట్‌మెంట్‌ను కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ పంపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ఆడిటెడ్‌ స్టేట్‌మెంట్‌పై కేంద్ర ఆర్థిక శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్‌ చేయాలని ప్రధాని మోదీతో సమావేశమైనప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. బకాయిపడిన రూ.5,072.47 కోట్లను విడుదల చేయాలని కేంద్ర జల్‌ శక్తి శాఖకు రాష్ట్ర జలవనరుల శాఖ మరోసారి ప్రతిపాదనలు పంపింది.  కేంద్ర జల్‌శక్తి తొలి విడతగా రూ.3 వేల కోట్లు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపడంతో నిధుల విడుదలకు అడ్డంకులు తొలిగాయి. విడుదల చేసిన నిధులకు యూసీ (యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు)లు పంపితే క్రమం తప్పకుండా నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు