అక్కడ ఎందుకు ఆగింది?

5 Oct, 2017 13:06 IST|Sakshi

డీసీసీబీ వద్ద సిరిమాను ఆగడంపై కేంద్ర మంత్రి ఆగ్రహం

నివేదిక ఇవ్వాలంటూ ఆలయ ఈఓకు ఆదేశం

ప్రతిపక్షానికి అమ్మవారి కరుణ దక్కకూడదని ముందునుంచే కుట్ర

తమ ప్రయత్నం ఫలించకపోవడంతో చిన్న బుచ్చుకున్న టీడీపీ నేతలు

పాలకపెద్దల చర్యలకు విస్తుపోతున్న జనం

అమ్మకరుణ అందరిపైనా ఉండాలి. అందరికీ ఆమె ఆశీస్సులు అందాలి. అందుకోసమే ఎంత దూరం నుంచైనా... ఎన్ని పనులున్నా... పక్కన పెట్టి సిరిమాను ఉత్సవాన్ని తిలకించేందుకు జనం తరలివస్తారు. కానీ కొందరిని లక్ష్యంగా చేసుకుని అమ్మ కటాక్షం అందకూడదని భావిస్తే?...! ఇప్పుడదే జరిగింది. డీసీసీబీ వద్ద యాదృచ్ఛికంగా సిరిమాను ఆగడంపై రాజకీయాలు తెరమీదికొచ్చాయి. విపక్ష నేతలు అక్కడున్నారనీ... అక్కడ ఆగడం సరికాదంటూ కొత్త వివాదాలు పుట్టుకొస్తున్నాయి. దీనికి ఎవరినో ఒకరిని బలిచేసేందుకు పావులు కదులుతున్నాయి.

సాక్షిప్రతినిధి విజయనగరం: పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా సిరిమానోత్సవం మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. కాని రాజకీయవర్గాల్లో పెను దుమారాన్ని రేపింది. డీసీసీబీ వద్ద సిరిమాను కాసేపు నిలిచి ఉండటాన్ని కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు తీవ్రంగా పరిగణిస్తున్నారు. సిరి మానును వీక్షించేందుకు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులతో పాటు వైఎస్సార్‌సీపీ ముఖ్యనేతలు డీసీసీబీ వద్ద ఉండటమే కారణం. ఆ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సిరిమాను ఆగకూడదని ముందుగానే హుకుం జారీ చేసినప్పటికీ అందుకు విరుద్ధంగా జరగడాన్ని టీడీపీ వర్గాలు తీవ్రంగా చర్చించుకుంటున్నాయి. దీనికి ఎవరినో ఒకరిని బాధ్యులుగా చేసి బలిచేసేందుకు సిద్ధమవుతున్నాయి.

ముందునుంచీ కుట్రకు వ్యూహం
ఏటా డీసీసీబీ కార్యాలయం వద్ద నుంచే సిరిమాను ఉత్సవాన్ని తిలకించడం బొత్స కుటుంబానికి అలవాటు. వారితో పాటు వారి అనుచరులు, ఆ పార్టీ ముఖ్యనేతలు అక్కడి నుంచే సిరిమానుకు మొక్కుతుంటారు. అయితే ఈ విషయంపై పాలకవర్గం ముందునుంచి కుట్ర పూరితంగానే వ్యవహరిస్తోంది. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంపై జరిగిన అధికార సమీక్షల్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. డీసీసీబీ వద్దకు వెళ్లే సరికి సిరిమాను కాసేపు ఆగిపోతోందని టీడీపీ నాయకులు సమీక్షలోనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలా ఎందుకు జరుగుతోందని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆరా తీయగా అక్కడ బొత్స కుటుంబీకులుంటారని వారు బదులిచ్చారు. ఈ ఉత్సవంలో మాత్రం అలా జరగటానికి వీల్లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ సిరిమాను అక్కడ ఆగకూడదని కలెక్టర్‌ ఆదేశించారు. నిజానికి తమ వద్దకు వచ్చేసరికి సిరిమానును కాసేపు ఆగాలని బొత్స కుటుంబీకులు గాని, వైఎస్సార్‌సీపీ నాయకులు గాని ఏనాడూ అధికారులకు చెప్పలేదు. తమ సౌలభ్యం కోసం మాత్రమే అమ్మవారిని వీక్షించేందుకు డీసీసీబీ ప్రాంతాన్ని వారు ఎప్పటిమాదిరిగానే ఎంచుకున్నారు. యాదృచ్ఛికమో... లేక అమ్మవారి కృపో తెలియదు గాని వారి ముందుకు వచ్చేసరికి సిరిమానును మోసే ఇరుసుమాను కాసేపు మొరాయించింది. ముందుకు వెళ్లేందుకు మొండికేసింది. ఈ పరిస్థితులు కావాలనే కల్పించినట్లు అధికార పార్టీ భావిస్తోంది. తాము ఎంత ప్రయత్నించినా తాము అనుకున్నది చేయలేకపోవడంపై చిన్నబుచ్చుకున్న టీడీపీ పెద్దలు జరిగిన దానిపై పోస్టుమార్టం ప్రారంభించారు.

ఈవోపై కేంద్ర మంత్రి ఆగ్రహం?
పైడితల్లి అమ్మవారి ఆలయ ఈఓ భానురాజా అర్చకులతో కలిసి బుధవారం వెళ్లి కేంద్ర మంత్రి అశోక్‌కు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఆ సమయంలో ఆయన ఈఓపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సిరిమాను డీసీసీబీ వద్ద ఎందుకు నిలిచిందన్న దానిపై తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని, బాధ్యులెవరనేది వెంటనే చెప్పాలని ఆయన ఆదేశించినట్టు తెలిసింది. కాగా అమ్మవారిని దర్శించడం, సిరిమానుకు మొక్కడం అనేది ప్రజలం దరి హక్కు. భక్తితో అమ్మవారికి నమస్కరించడాన్ని కూడా తట్టుకోలేని స్థితిలో టీడీపీ పెద్దలుండడం విమర్శలకు తావిస్తోంది. అమ్మవారి ఉత్సవం పేరు చెప్పి లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ సిరిమానుకు కనీసం ఆసరాగా ఉండే పక్కరాటలు కూడా పటిష్టంగా ఏర్పాటు చేయలేకపోయారు. సిరిమాను తిలకించడానికి వచ్చిన భక్తులకు తాగునీటిని సైతం అందించలేకపోయారు. వీటిపై పోస్టుమార్టం చేయాల్సింది పోయి ప్రతిపక్ష పార్టీ నాయకులపై సిరిమాను కరుణ ఎందుకు కురిపించిందనేదానిపై మాట్లాడటం అధికార పార్టీ వైఖరికి అద్దం పడుతోందని సామాన్యులు దుమ్మెత్తి పోస్తున్నారు.

మరిన్ని వార్తలు