చైన్ స్నాచింగ్ ముఠా అరెస్టు

26 Feb, 2015 01:57 IST|Sakshi

కాకినాడ క్రైం : కాకినాడ డీప్ వాటర్ పోర్టులో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను కాకినాడ క్రైం పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. త్రీ టౌన్ క్రైం పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీఎస్పీ పిట్టా సోమశేఖర్ తెలిపిన వివరాలిలావున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీరామ్‌పురానికి చెందిన నేరెళ్ల వెంకటశివప్రశాంత్ బీఎస్సీ చదివాడు. అతడు కాకినాడ సీ పోర్ట్సు లిమిటెడ్ (డీప్ వాటర్ పోర్టు)లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసుకుంటూ కాకినాడ రూరల్ మండలం వలసపాకల సాయిబాబా గుడి వద్ద అద్దెకు ఉంటున్నాడు.

తాళ్లరేవు మండలం నీలపల్లికి చెందిన రేవు వెంకటరమణ మూర్తి కూడా పోర్టులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ కాకినాడ డెయిరీఫారం సెంటర్‌లోని రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్నాడు. కాకినాడ జగన్నాథపురం శివారు ఆంధ్రా పాలిటెక్నిక్ సమీప ప్రాంతానికి చెందిన బల్లా వీరవెంకట సాయి రంజిత్ కుమార్ వారితో పాటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడిన ముగ్గురూ డబ్బు సంపాదనకు చోరీలను మార్గంగా ఎంచుకున్నారు. మోటారు సైకిల్ చోరీ చేసి దానిపై తిరుగుతూ మహిళల మెడల్లోని బంగారు ఆభరణాల చోరీలకు పాల్పడుతున్నారు.

ఇటీవల కాకినాడ నగర, రూరల్ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగిపోవడంతో ఎస్పీ ఎం.రవిప్రకాష్ ఆదేశాల మేరకు క్రైం పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. చైన్ స్నాచింగ్ ముఠాలను గుర్తించేందుకు బృందాలుగా ఏర్పడ్డారు. ప్రధాన సెంటర్లలో రెక్కీ నిర్వహించి ఎట్టకేలకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా చైన్ స్నాచింగ్‌ల విషయం వెలుగు చూసింది. ప్రశాంత్, రమణమూర్తి, రంజిత్ కుమార్ కాకినాడ టూ టౌన్, సర్పవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో గత ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ ఏడు చోరీలకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు.

వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 3.25 లక్షల విలువైన 17 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటుపడిన ముగ్గురూ సెక్యూరిటీ గార్డులుగా పనిచేసుకుంటూనే ఖాళీ సమయంలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నందున వారిని గుర్తించడం కష్టతరమైందని చెప్పారు. చోరీ చేసిన సొత్తును టూ టౌన్, యానాం పోలీస్ స్టేషన్ల పరిధిలోని ఓ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి ఆ సొమ్ముతో జల్సాలు చేశారన్నారు. ముఠాను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన టూ టౌన్ క్రైం ఎస్సై ఎండీఎం ఆర్ ఆలీఖాన్, హెడ్ కానిస్టేబుల్స్ గోవిందు, శ్రీను, కానిస్టేబుల్స్ శ్రీరామ్, వర్మ, చిన్నలను డీఎస్పీ సోమశేఖర్ అభినందించారు.

మరిన్ని వార్తలు