రోగులంటే అంత చులకనా?

27 May, 2014 00:04 IST|Sakshi
రోగులంటే అంత చులకనా?
  •     నేలపై చిందరవందరగా ఖరీదైన మందులు
  •      స్టోర్ రూమ్‌లో కొత్త దిండ్లు, పరుపులు
  •      చిరిగిన దిండ్లు, పరుపులపై రోగుల అవస్థలు
  •       కోడ్ పాటించకుండా విధులకు హాజరైన వైద్యుడు
  •      మండిపడ్డ కో-ఆర్డినేటర్ డాక్టర్ నాయక్
  •  రోగుల కోసం పంపిన పరుపులు స్టోర్ రూమ్‌లో మూలుగుతున్నాయి. రోగుల మంచాలపై చిరిగిపోయిన దిండ్లు, పరుపులు దర్శనమిస్తున్నాయి. ఖరీదైన యాంటీబయాటిక్ ఇంజక్షన్లు చిందరవందరగా నేలపై పడిఉన్నాయి. స్టాకు రిజిస్టర్‌లో మందుల వివరాలు అసమగ్రంగా ఉన్నాయి. నక్కపల్లి ముప్ఫయ్ పడకల ఆస్పత్రి సిబ్బంది పనితీరిది. వైద్య విధాన పరిషత్ జిల్లా కో-ఆర్డినేటర్ నాయక్ సోమవారం జరిపిన ఆకస్మిక తనిఖీల్లో బయటపడిన నిర్లక్ష్యమిది.
     
     నక్కపల్లి, న్యూస్‌లైన్:   విధి నిర్వహణలో అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న నక్కపల్లి 30 పడకల ఆస్పత్రి సిబ్బందిపై వైద్యవిధాన పరిషత్ జిల్లా కో-ఆర్డినేటర్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల జీవితాలతో ఆటలాడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఆయన సోమవారం నక్కపల్లి 30 పడకల ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మందులను భద్రపరిచే గదిని పరిశీలించి అక్కడ రోగులకు వాడే అత్యంత ఖరీదైన మందులు చెల్లా చెదురుగా పడి ఉండటంపై ఫార్మసిస్టు, ఆస్పత్రి సిబ్బందిపై మండిపడ్డారు.
     
     డంపింగ్ యార్డ్‌ను తలపిస్తున్న స్టోర్ రూం

     సీడీసీ నుంచి తీసుకొచ్చిన మందులకు రిజిస్టర్‌ను నిర్వహించకపోవడం, రోగుల కోసం ప్రభుత్వం సరఫరాచేసిన బెడ్లను స్టోర్‌రూంలో భద్రపరచడాన్ని కూడా తప్పుపట్టారు. రోగులు చిరిగిపోయిన బెడ్లపై, దిండ్లు లేకుండా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం సరఫరా చేసిన పరుపులు, దిండ్లను స్టోర్‌రూంలో భద్రపరచడం సరికాదన్నారు. డాక్టర్ల గదుల్లో కొత్త పరుపులు వేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
         
    ఆస్పత్రి నిర్వహణ అధ్వానంగా ఉందని, వైద్యాధికారుల పర్యవే క్షణ కొరవడిందన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడే ఖరీదైన మందులను భద్రపరచాల్సిన స్టోర్‌రూం డంపింగ్ యార్డు ను తలపిస్తోందన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన పరుపులను తక్షణమే వార్డుల్లోని మంచాలపై వేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో మూలుగుతున్న రూ.లక్షల నిధులతో రోగులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. అనంతరం ఎన్ బీఎస్ యూనిట్‌ను సందర్శించారు. పుట్టిన శిశువు పచ్చకామెర్లు, ఉబ్బసం, ఊపిరాడక, ఉష్ణోగ్రత సరిపోక ఇబ్బందిపడితే కాపాడేందుకు ప్రభుత్వం ఈ ఆస్పత్రిలో నూబోర్న్స్‌స్టెబిలైజేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. అసలు ఇక్కడ ఆ సౌకర్యం ఉన్నట్లు ఎవరికీ తెలియదు. ఈ సౌకర్యం ఉన్నట్లు అందరికి తెలియజేయాలని అక్కడి ఏఎన్‌ఎంకు సూచించారు.
         
    ఒక వైద్యుడు టీ షర్ట్, జీన్ ప్యాంట్ ధరించి విధులకు హాజరుకావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఈ దుస్తుల్లో మిమ్మల్ని రోగులు చూస్తే వైద్యుడని భావిస్తారా?, డ్రస్ కోడ్ పాటించి హుందాగా డ్యూటీ చేయండని’ డాక్టర్ నాయక్ హితవు పలికారు. డ్రస్ కోడ్ పాటించని సిబ్బందిని విధులకు హాజరుకానీయొద్దని వైద్యాధికారి పూర్ణచంద్రరావును ఆదేశించారు. సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు.
     
     రేపటినుంచి విధులకు రాకు

     యాంటీ బయాటిక్ ఇంజక్షన్లు, మందులను గదిలో ఎక్కడిపడితే అక్కడ చిందరవందరగా పడేసిన ఫార్మసిస్టుపై డాక్టర్ నాయక్ మండిపడ్డారు. ‘నువ్వు ఎంతోమందితో రికమండేషన్లు చేయిస్తే తప్పని పరిస్థితుల్లో నీకు ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చింది. ఇలా బాధ్యతారాహిత్యంగా విధులు నిర్వహిస్తావా? రేపటి నుంచి డ్యూటీకి రాకు. అవసరానికి మించి స్టాకు తీసుకొచ్చి ఇష్టానుసారం పడేసావు. ఎక్కడైనా మందుల కొరత ఏర్పడితే నేనేం చేయాలి? ఏమని సమాధానం చెప్పాలి?’ అని నిలదీశారు.
         
    తీసుకొచ్చిన మందుల వివరాలను రికార్డుల్లో రాయకపోవడాన్ని కూడా తప్పుబట్టారు. పాము, కుక్కకాటు ఇంజక్షన్లకు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కొరత ఉంది. ఈ ఆస్పత్రిలో మాత్రం అవసరానికి, డిమాండ్‌కు మించి స్టాకు ఉన్నాయి. ఇంత ఎక్కువ మొత్తంలో స్టాకు తీసుకువచ్చి సక్రమంగా భద్రపరచ కపోవడంపై డాక్టర్ నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
     

మరిన్ని వార్తలు