వచ్చారు.. ఏమిచ్చారు

18 Jul, 2014 01:37 IST|Sakshi
వచ్చారు.. ఏమిచ్చారు

ఎన్నికల వేళ ‘వస్తున్నా.. మీ కోసం’ అంటూ చంద్రబాబు నాయుడు ఊరూవాడా తిరిగారు. ఎన్నెన్నో హామీలు కురిపించారు. తాజాగా ముఖ్యమంత్రి హోదాలో జిల్లా పర్యటనకు వచ్చారు. ఊరూరా పర్యటించారు. అన్ని స్థానాలను టీడీపీకి కట్టబెట్టిన మన జిల్లాకు ఆయన రాకతో ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు సామాన్య ప్రజలు సైతం ఆశగా ఎదురుచూశారు. అయితే, జిల్లా అభివృద్ధి విషయంలో చంద్రబాబు కనీసం నోరు మెదపకపోవడంతో వారంతా నిశ్చేష్టులయ్యూరు. ‘ఆ జిల్లాకు ఎయిమ్స్.. పక్క జిల్లాకు ఎయిర్‌పోర్టు.. మరో జిల్లాకు పెట్రో కారిడార్..

ఆ శివారు జిల్లాకు ఐటీ హబ్.. ఇంకో జిల్లాకు యూనివర్సిటీ’ అంటూ ఇతర జిల్లాల అభివృద్ధి విషయంలో ప్రకటనలు గుప్పిస్తున్న ముఖ్యమంత్రి మన జిల్లాకు అలాంటివేమీ ప్రకటించకుండానే వెళ్లిపోయూరు. రుణమాఫీ ఎప్పుడు చేస్తారని రైతులు, డ్వాక్రా మహిళలు అడిగితే డబ్బుల్లేవన్నారు. ‘మేం అడక్కుండానే రుణమాఫీ హామీ ఇచ్చారుగా..’ అని నిలదీస్తే ‘డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయూ..’ అంటూ అసహనంతో ఊగిపోయూరు. ‘ఇదేంటి బాబూ..’ అని అడిగిన రైతును ‘నీ సంగతి తేలుస్తా’నంటూ హుంకరించారు. మీ చావు మీరు చావండన్నట్టు జిల్లాను అభివృద్ధి చేయూల్సిన బాధ్యత అధికారులదేనంటూ హితబోధ చేశారు. మొత్తానికి ఊరడింపులు.. ఈసడింపుల నడుమ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండురోజుల పర్యటన సాఫీగా సాగిపోరుుంది.
 
జిల్లా ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన చంద్రబాబు
* పొరుగు జిల్లాలకు వరాలు
* ‘పశ్చిమ’కు మాత్రం నిండు సున్నాలు
* కొత్త ప్రాజెక్టులపై నోరు మెదపని సీఎం
* ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నేతల్లో నిరాశ
* రుణమాఫీపై స్పష్టత ఇవ్వకపోవడంతో
* రైతులు, డ్వాక్రా మహిళల్లో నిస్పృహ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనపై గంపెడాశలు పెట్టుకున్న జిల్లా ప్రజలకు నిరాశే మిగిలింది. సీఎం రెండురోజుల పర్యటన సందర్భంగా జిల్లాకు కీలక ప్రాజెక్టులు ఏమైనా వస్తాయని ఆశించిన వారికి భంగపాటే ఎదురైంది. బుధ, గురువారాల్లో గోపాలపురం, చింతలపూడి, పోలవరం నియోజకవర్గాల పరి దిలోని గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేసి బహిరంగ సభలు నిర్వహించిన చంద్రబాబు జిల్లాకు కొత్తగా ఏదైనా ప్రాజెక్టు ఇస్తున్నామని గాని, అభివృద్ధికి ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని గాని ప్రకటన చేయకుండానే గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు పయనమయ్యూరు. ‘ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకోలేనిది. టీడీపీ అధికారంలోకి రావటానికి ఇక్కడి ఫలితాలే కీలకం. అందుకే రాష్ట్రంలో తొలి పర్యటనను ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాను. జిల్లాను నంబర్-1 చేస్తా’నని తొలిరోజు చెప్పిన చంద్రబాబు జిల్లా ప్రజల్లో ఆశలు రేపారు.

ఇందుకు సంబంధించి గురువారం ఏదైనా ప్రకటన చేస్తారని జిల్లా ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ నేతలు ఆశించారు. అయితే గురువారం అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జంగారెడ్డిగూడెంలో సమీక్ష నిర్వహించిన ఆయన జిల్లా అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు చేశారే కానీ.. కొత్త ప్రాజెక్టుల ఊసెత్తలేదు. ఇక్కడ అపారంగా ఉన్న సహజ, శక్తి వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా జిల్లాను అభివృద్ధి చేసుకోవాలని చెప్పారేగాని ఇదిగో ఈ ప్రాజెక్టు ఇస్తున్నాం లేదా త్వరలో ఇస్తాం అనే దిశగా ఎటువంటి ప్రకటనా చేయలేదు. దీనిపై టీడీపీ నేతల్లోనూ అసంతృప్తి నెలకొంది. దీనిపై ఏలూరు ఎంపీ మాగంటి బాబు లోలోన మదనపడుతూనే పైకి మాత్రం ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారని విలేకరుల ఎదుట చెప్పుకొచ్చారు.
 
రైతుల ధర్మాగ్రహం
రుణమాఫీపై ఈ జిల్లాలోనే స్పష్టత వస్తుందని.. కనీసం ఆశావహ ప్రకట నైనా చేస్తారని ఎదురుచూసిన రైతులు తొలిరోజు అలాంటి పరిస్థితి కనిపించకపోవడంతో గురువారం ఒక్కసారిగా చంద్రబాబుపై తిరగబడ్డారు. గురువారం నాటి పర్యటనలో అడుగడుగునా ఆయనకు నిరసన ధ్వనులే వినిపించాయి. నరసన్నపాలెం, బయ్యనగూడెం, కొయ్యలగూడెంలలో రైతులు రుణమాఫీ జాప్యంపై నిరసన వ్యక్తం చేశారు. ముఖాముఖి చర్చల్లో నేరుగా చంద్రబాబును నిలదీశారు. వీలైనంత త్వరగా రుణమాఫీ విషయం తేల్చాలని గట్టిగా అడిగారు.
 
మలి రోజు కానరాని జోష్
తొలిరోజు పర్యటనలో చంద్రబాబు ఆగిన ప్రతిచోటా వందలాదిగా కనిపించిన జనం గురువారం మాత్రం పదుల సంఖ్యలోనే కనిపించారు. కొయ్యలగూడెం మెయిన్ సెంటర్‌లో సైతం వందమందికి మించి జనం కనిపించలేదు. దీంతో బాబు కూడా ఒకింత అసహనానికి గురయ్యారు. తొలిరోజు బాబు వెంట కనిపించిన మంత్రులు, సీనియర్ నాయకులు కూడా గురువారం నాటి పర్యటనలో కానరాలేదు.

మరిన్ని వార్తలు