ఆరోగ్యంగా లేమట!

12 Mar, 2018 11:21 IST|Sakshi
సీఎం చంద్రబాబు

ఆసుపత్రుల్లో ప్రసవాలు 97శాతమట !

ఆచార వ్యవహారాలు తెలీవట!

వాతావరణ మార్పులను తట్టుకోలేరట!

సీఎం హెల్త్‌బులిటెన్‌లో విస్తుబోయే అంశాలు

సర్వే చేశారా...అంచనా వేశారా..?

వ్యక్తమవుతున్న అనుమానాలు

కర్నూలు(హాస్పిటల్‌)   డబ్బున్న వాడు కాదు...ఈ సమాజంలో సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న వాడే నిజమైన ధనవంతుడు. మనిషి జీవన విధానం, పాశ్చాత్య పోకడలు, ఆధునిక జీవనశైలి, ఆచార వ్యవహారాలు మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయనడంలో సందేహం లేదు. ఆరోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నామని చెబుతున్నాయి. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్‌ బులిటెన్‌ను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. అందులో ఈ జిల్లా  వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2017– 2018 హెల్త్‌బులిటెన్‌లో జిల్లా పలు అంశాల్లో అధ్వాన్నస్థితిలో ఉందని తేల్చింది. మరికొన్ని అంశాల్లో అద్భుతంగా ఉందని పేర్కొంది. అసలు ఈ బులిటెన్‌ ఏమిటి...? ఎవరు ఈ వివరాలు పంపించారు, ఎప్పుడు తయారు చేశారో జిల్లా వైద్య ఆరోగ్యశాఖకే తెలియని పరిస్థితి. రాష్ట్రస్థాయిలో ఓ ప్రైవేటు సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సర్వే చేసి, నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగా సీఎం హెల్త్‌బులిటెన్‌ విడుదల చేశారని అధికారులు చెబుతున్నారు. దీనిని సెర్నార్‌ ఇండికేటర్స్‌ అంటార ని వారు పేర్కొంటున్నారు. ఇందులో రాష్ట్రంలో మన జిల్లా చిన్నారుల  ఆరోగ్యంలో 13, ఆచార వ్యవహారాల్లో 13, గర్భిణిల ఆరోగ్యంలో 11, పర్యావరణంలో 7, ప్రభుత్వ జవాబుదారీతనంలో 4, మానిసక ఆరోగ్యంలో 3, దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో మొదటి స్థానంలో ఉన్నట్లు తేల్చారు. 

గోనెగండ్ల, నందవరం మండలాల్లో కీళ్లనొప్పులట..?
ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల, నందవరం మండలాల్లో కీళ్లనొప్పులు అధికంగా ఉన్నట్లు హెల్త్‌ బులిటెన్‌ పేర్కొంది. వాస్తవంగా ఇక్కడి ప్రజలు అధికంగా తుంగభద్ర నది నీటిపైనే ఆధారపడతారు. హంద్రీ నది పరివాహక ప్రాంతంలో మాత్రమే పలు చోట్ల ఫ్లోరైడ్‌ శాతం అధికంగా ఉండటం వల్ల కీళ్లనొప్పులు ఉన్నాయి.  గోనెగండ్ల, నందవరం మండలాల్లో ఆ పరిస్థితి లేదు.   హెల్త్‌బులిటెన్‌లో మాత్రం ఈ రెండు మండలాల్లో కీళ్లనొప్పులు ఉన్నాయని పేర్కొనడం వైద్యులను ఆశ్యర్యానికి గురిచేస్తోంది. 

దీర్ఘకాలిక జబ్బులు చాలా తక్కువట...?
దీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్, గుండెజబ్బులు, క్యాన్సర్, గ్యాస్ట్రబుల్‌ వంటి రుగ్మతలు ఈ జిల్లాలో చాలా తక్కువగా ఉన్నాయని హెల్త్‌ బులిటెన్‌ పేర్కొంది. ఆరేళ్ల క్రితం నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజ్‌ సర్వేలో జిల్లాలో బీపీ 15, షుగర్‌ 20 శాతం మందికి ఉన్నట్లు తేలింది. కానీ రాష్ట్రంలో ఇతర జిల్లాల కంటే కర్నూలు జిల్లాలోనే దీర్ఘకాలిక వ్యాదులు చాలా తక్కువగా ఉన్నట్లు చూపడం వైద్యులను ఆశ్యర్యానికి గురిచేస్తోంది.

ఆచార వ్యవహారాలకు దూరమట...!
మన జిల్లా ప్రజలు ఇతర జిల్లాలతో పోలిస్తే ఆచార వ్యవహారాలకు చాలా దూరంగా ఉన్నారని సర్వేలో పేర్కొన్నారు. ఇతర జిల్లాల కంటే కర్నూలు జిల్లాలో అక్షరాస్యతా శాతం  తక్కువ. ప్రధానంగా ఆదోని డివిజన్, కర్నూలు డివిజన్‌లోని పలు మండలాల్లో చాలా తక్కువ శాతం ఉంది. ఈ కారణంగా బాల్యవివాహాలు, మేనరికపు వివాహాలు, ఇంట్లోనే ప్రసవాలు జరుగుతున్నాయి. మరోవైపు దసరా, ఉగాది వంటి పండుగలతో పాటు పలు జాతరల సందర్భంగా ప్రజలు పూర్తిగా ఆచార వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటారు. ఇలాంటి పరిస్థితిలో ఆచార వ్యవహారాల్లో జిల్లా చివరి స్థానంలో ఉందని చెప్పడం ఎంత వరకు సరైనదో అధికారులే చెప్పాలి. 

ఆసుపత్రుల్లో ప్రసవాలు 97శాతమట...!
జిల్లాలో జరిగే ప్రసవాల్లో 97 శాతం ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని నివేదిక ఇచ్చారు. ఈ శాతం వాస్తవానికి చాలా దూరంగా ఉందని వైద్యులే చెబుతున్నారు. 30 శాతానికి పైగా గర్భిణులు ఇప్పటికీ ఇంటి వద్ద ప్రసవాలు చేసుకుంటున్నారని వారు పేర్కొంటున్నారు. ఆదోని డివిజన్‌లోని పలు మండలాల్లో ఈ సంఖ్య అధికంగా ఉంది. కానీ హెల్త్‌బులిటెన్‌లో మాత్రం 97 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని చెప్పడం ఆశ్యర్యానికి గురిచేస్తోంది. 97 శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లో జరుగుతుండగా గర్భిణుల ఆరోగ్యం 11వ స్థానంలో చిన్నారుల ఆరోగ్యంలో 13వ స్థానంలో ఎలా ఉంటుందో ప్రభుత్వమే వివరించాలని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. 

మరిన్ని వార్తలు