చప్పగా సాగిన సీఎం పర్యటన

21 Nov, 2013 03:10 IST|Sakshi

సాక్షి ప్రతినిధి-తిరుపతి: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లా పర్యటన చప్పగా సాగింది. జిల్లాకు మంజూరు చేసిన ఏడు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల కోసం బుధవారం వచ్చిన ఆయనను జనం పెద్దగా పట్టించుకోలేదు. సొంత నియోజకవర్గమైన పీలేరులోని కలకడలో నిర్వహించిన సభ జనం లేక వెలవెలపోయింది. అక్కడి రచ్చబండ కూడా అంతంతమాత్రంగానే సాగింది.

సీఎం పర్యటనలో జిల్లా నేతల కంటే ఇతర జిల్లాలకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, కొండ్రు మురళి, ఇన్‌చార్జి మంత్రి పార్థసారథి తదితరుల హడావుడే ఎక్కువగా కనిపించింది. గతంలో కంటే భిన్నంగా చిత్తూరు శాసనసభ్యుడు సీకే బాబుకు ఈ పర్యాయం కిరణ్ కాస్త ప్రాధాన్యతనివ్వడం చర్చనీయాంశమైంది. తొలుత శ్రీసిటీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఆ తరువాత తిరుపతి అంతర్జాతీయ క్రికెట్ స్డేడియానికి, పద్మావతి మహిళా వైద్య కళాశాలకు, చిత్తూరు మంచినీటి పథకానికి శంకుస్థాపన  చేశారు.

జిల్లేళ్లమందలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధికారులు జనసమీకరణ చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని విద్యాసంస్థల వాహనాలను మంగళవారం నుంచే తమ ఆధీనంలోకి తీసుకొని జనాన్ని సమీకరించడంతో ఆ కార్యక్రమం కాస్త బాగా సాగింది. ఆ తర్వాత జరిగిన కలకడ సభలో వేదిక ముందు ఏర్పాటు చేసిన వీఐపీ గ్యాలరీ సైతం ఖాళీగానే కనిపించింది. తిరుపతిలో జరిగిన శంకుస్థాపనలు కూడా మొక్కుబడిగానే సాగాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ రాష్ట్ర విభజనకు వేగంగా పావులు కదుపుతుండడం ఇక్కడి కాంగ్రెస్ క్యాడర్‌ను పూర్తిగా నిర్వేదంలో పడేసింది.

ముఖ్యమంత్రికి గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు కూడా పార్టీ నేతలు, కార్యకర్తలు ముందుకు రాలేదు. తమ వల్లే వేల కోట్ల ప్రాజెక్టులు చిత్తూరుకు వస్తున్నాయని చెప్పుకొనే ప్రయత్నం కూడా ఆ పార్టీ నేతలు చేయకపోవడం గమనార్హం. రాష్ట్ర విభజన కసరత్తు జోరుగా సాగుతున్న సమయంలో సమైక్యవాదుల నుంచి ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. స్విమ్స్‌లో జరిగిన కార్యక్రమంలో సమైక్యవాదులు ముఖ్యమంత్రిని కలసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేశారు.
 

>
మరిన్ని వార్తలు