అధికారులా...అధికారపార్టీ తొత్తులా? | Sakshi
Sakshi News home page

అధికారులా...అధికారపార్టీ తొత్తులా?

Published Sun, Sep 28 2014 2:28 AM

అధికారులా...అధికారపార్టీ తొత్తులా? - Sakshi

తిరుపతి రూరల్:
 వైఎస్సార్ జిల్లాలో రైతు సమస్యలను విస్మరించి విద్యుత్ అధికారులు అధికార పార్టీ తొత్తుల్లాగ వ్యవహరిస్తున్నారని వైఎస్‌ఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లాలో రైతులు విద్యుత్ సరఫరా, ట్రాన్స్‌ఫార్మర్ల  ఏర్పాటులో ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం తిరుపతిలోని డిస్కం  కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ హెచ్‌వై దొరను కలసి  చర్చించారు. రైతులకు ఉచిత విద్యుత్ నిరంతరాయంగా సరఫరా కావడం లేదని, కేవలం ఆరుగంటలే ఇస్తున్నా అది కూడా రెండు, మూడు విడతలుగా సరఫరా చేస్తున్నారని వివరించారు. వైఎస్సార్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు పనితీరు బాగాలేదని, జెడ్పీ మీటింగ్‌కు కూడా హాజరు కావడం లేదని సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, రఘురామిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, అంజాద్‌బాషా, జయరాములు, శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో అధికారులు వివక్ష చూపుతున్నారని తెలిపారు. ముందు చలానా కట్టిన రైతులను విస్మరించి  పచ్చనేతలు రెకమండ్ చేసిన వారికి బిగిస్తున్నట్టు చెప్పారు. కొత్తగా సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని సీఎండీని కోరామన్నారు. సబ్‌స్టేషన్లలో కాంట్రాక్టు పోస్టులను అధికార పార్టీ నేతలతో కలసి అధికారులు అమ్మేసుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాలో కరెంటు సమస్యలపై స్థానిక అధికారులు స్పందించకపోవడంతో సీఎండీని కలసి విన్నవించామన్నారు. సీఎండీ సైతం అధికార పార్టీకి వత్తాసుగా మాట్లాడడం బాధ కలిగించిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ  గ్రామాల్లో 50 యూనిట్ల విద్యుత్ ఉచితమని ప్రకటించినా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని పేర్కొన్నారు. అధికారులు సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడప జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, భరత్‌రెడ్డి పాల్గొన్నారు.



 

Advertisement
Advertisement