మీ మాటలు స్ఫూర్తిగా తీసుకుంటా: సీఎం జగన్‌

25 May, 2020 18:38 IST|Sakshi

‘పరిపాలన–సంక్షేమం’ అంశంపై నిపుణులు–లబ్ధిదార్లు, అధికారులతో సీఎం జగన్‌ ముఖాముఖి

సాక్షి, అమరావతి: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక పథకాల ద్వారా మే 20 వరకు 3,57,51,612 మందికి లబ్ది చేకూరిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. లబ్దిదారుల కోసం రూ. 40,139 కోట్లు ఖర్చు చేశామని.. సంక్షేమ పథకాలను విప్లవాత్మకంగా అమలు చేసి, ఇంత మొత్తం ఖర్చు చేసిన పరిస్థితిని బహుశా ఎప్పుడూ చూడలేదేమోనని పేర్కొన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏడాది కాలంగా అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు.. ఆయా రంగాల్లో తీసుకువచ్చిన మార్పులు, భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం జగన్‌ అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన- మీ సూచన’ పేరుతో మేథోమధన సదస్సు సోమవారం  ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలిరోజు ‘పరిపాలన–సంక్షేమం’ అంశంపై నిపుణులు–లబ్ధిదార్లు, అధికారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. (సీఎం జగన్‌ అధ్యక్షతన ‘మన పాలన- మీ సూచన’)

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ... మేనిఫెస్టోను తాను బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతగా భావిస్తానని ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నానన్నారు. ప్రతి అధికారి, ప్రతి మంత్రి దగ్గర.. ఆఖరికి తన ఛాంబర్‌లో కూడా గోడలకి మేనిఫెస్టోనే కనిపిస్తుందని.. మేనిఫెస్టోలో దాదాపు 90 శాతం మొట్టమొదట సంవత్సరంలోనే పూర్తి చేశామని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాదికి సంబంధించి వడివడిగా అడుగులు వేస్తే దాదాపు 98–99 శాతానికి చేరుకుంటామని పేర్కొన్నారు. ‘పరిపాలన–సంక్షేమం’కు పిల్లర్లు గ్రామ వలంటీర్లు, సచివాలయాలు అని సీఎం జగన్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలోకి ఎన్నడూ అవినీతి రావొద్దని.. దీనిని మరింత బలోపేతం చేయడం కోసం నిరంతరం కృషి చేయాలన్నారు.(జనరంజక పాలన; జనం స్పందన)

మీ మాటలను స్ఫూర్తిగా తీసుకుంటాను..
గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, లబ్ధిదారులు, నిపుణులతో సీఎం జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. గ్రామ, వార్డు వలంటీర్లకు లెర్నింగ్‌ కోసం  యాప్‌ను ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘ఎక్కడా వివక్ష లేకుండా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్న ఆలోచనలతో పుట్టుకొచ్చిందే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ . గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే, వారికి కూడా పథకాలు అందాలని తపించాను. మీ మాటలను ఒక స్ఫూర్తిగా తీసుకుంటాను. ఇంకా బాగా పని చేయడానికి ప్రయత్నిస్తాను’’అని పేర్కొన్నారు.(‘సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు’)

అదే విధంగా.. ‘‘సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సహాయం చేస్తుంటే, లబ్ధిదారులు పొందే ఆనందం, వారి దీవెనలు ఒక కిక్‌లా పని చేస్తాయి. అవి ఉన్నంత వరకు ఈ వ్యవస్థలో అవినీతికి చోటు ఉండదని నా నమ్మకం. గ్రామ సచివాలయాలు మొదలు, వ్యవస్థలో మార్పు, సాచ్యురేషన్‌. ఎక్కడా అవినీతికి తావు ఉండకూడదు. నా స్థాయి నుంచి కలెక్టర్ల వరకు.. ఆ తర్వాత గ్రామ స్థాయి వరకు ఎక్కడా లంచం ఉండొద్దన్నదే లక్ష్యం. అందుకే టెండర్ల ప్రక్రియలో కూడా మార్పు చేశాం’’ అని సీఎం జగన్‌ వివరించారు. జ్యుడీషియల్‌ రివ్యూ మొదలు పెట్టామని.. ఆ తర్వాత రివర్స్‌ టెండరింగ్‌ ఉంటుందని ఆయన ప్రకటించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా