ఒళ్లు గ‌గుర్పొడిచే దృశ్యాలు: ల‌క్ష‌లాది మిడ‌తలు..

25 May, 2020 18:30 IST|Sakshi

జైపూర్: దేశం క‌రోనాతో అత‌లాకుత‌ల‌మ‌వుతోంటే.. పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లుగా ఉంపన్‌ తుపాను వ‌చ్చి బీభ‌త్సం సృష్టించింది. దీనివ‌ల్ల‌ ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్‌లోని చాలా ప్రాంతాలు చిగురుటాకులా వ‌ణికిపోయాయి. వీటికి తోడుగా మ‌రో ప్ర‌మాదం వ‌చ్చిప‌డింది. ప‌లు రాష్ట్రాల్లో మిడ‌త‌ల దండు విధ్వంసం సృష్టిస్తోంది. శ‌నివారం సాయంత్రం ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో మిడ‌త‌ల గుంపు క‌నిపించింది. ఆ త‌ర్వాత ఉజ్జ‌యిన్‌ జిల్లాలోని రానా హెడ గ్రామంలో ల‌క్ష‌లాది మిడ‌తలు క‌నిపించాయి. ఆ త‌ర్వాత అవి రాజ‌స్థాన్‌లోని జైపూర్ మీద‌కు దండెత్తాయి. ఈ క్ర‌మంలో నేడు ఉద‌యం నిద్ర‌లేవ‌గానే టెర్ర‌స్‌పై క‌నిపించిన దృశ్యాలు చూసి జైపూర్‌వాసులు గ‌గుర్పాటుకు లోన‌య్యారు. (వైరల్‌ వీడియో : ఇదీ జీవితమంటే)

ఎటు చూసినా మిడ‌త‌లే క‌నిపించ‌డంతో వాటి ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటూ వారి అనుభ‌వాల‌ను పంచుకుంటున్నారు. ఈ ఒక్క ఏడాదే ఇన్ని విప‌త్తులు వ‌స్తుండ‌టంతో చాలామంది 2020 సంతవ‌త్స‌రాన్ని తిట్టి పోస్తున్నారు. "మాన‌వాళి అంతానికి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయా?", "ఈ యేడాది ముగిసేలోపు ఇంకా ఎన్ని చూడాలో" అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మిడ‌త‌ల దండు ఏప్రిల్‌లోనే రాజ‌స్థాన్‌లోకి ప్ర‌వేశించగా, ఇప్ప‌టివ‌ర‌కు 50,000 హెక్టార్ల పంట‌ను నాశ‌నం చేసింది. దీంతో తీవ్రంగా న‌ష్ట‌పోయిన రైతుల‌పై నెటిజ‌న్లు సానుభూతి చూపిస్తున్నారు. (రాకాసి మిడతల దండుపై కెమికల్‌ స్ప్రే)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు