సత్తుపల్లి బంద్ సంపూర్ణం

24 Jan, 2014 03:28 IST|Sakshi

సత్తుపల్లి టౌన్, న్యూస్‌లైన్: నూతన భూ సేకరణ చట్టం ప్రకారం సింగరేణి భూ నిర్వాసితులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం పిలుపు మేరకు గురువారం చేపట్టిన సత్తుపల్లి పట్టణ బంద్ విజయవంతమైంది. తెల్లవారుజాము నుంచే అఖిలపక్షం నాయకులు ద్విచక్ర వాహనాలపై ప్రదర్శనగా తిరుగుతూ దుకాణాలను మూసివేయిం చారు. అలాగే పెట్రోల్ బంకులు, సినిమా హాళ్లు, హోటళ్లు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, బ్యాంకులు కూడా బంద్ మూసివేశారు. అనంతరం సింగరేణి భూ నిర్వాసితుల రిలే నిరాహార దీక్షల శిబిరం నుంచి రింగ్ సెంటర్ వరకు నిర్వాసిత రైతులు, అఖిల పక్షం నాయకులు భారీ ప్రదర్శన నిర్వహించారు.
 
 ఈ సందర్భంగా అఖిలపక్ష బృందం సభ్యులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్‌కుమార్ మాట్టాడారు. న్యాయమైన పరిహారం చెల్లించాలని రెండేళ్లుగా భూ నిర్వాసితులు అధికారులను కోరుతున్నా పట్టించుకోకుండా నూతన భూసేకరణ చట్టం అమల్లోకి రావడానికి 48 గంటల ముందు కలెక్టర్ అవార్డు జారీ చేయడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కలెక్టర్ జారీ చేసిన అవార్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
 
 లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం, సింగరేణి భూ నిర్వాసిత రైతులు ఉడతనేని అప్పారావు, చల్లగుళ్ల నర్సింహారావు, గాదిరెడ్డి రాంబాబురెడ్డి, దండు ఆదినారాయణ, అమర్లపూడి రాము, మోరంపూడి పాండు, రావుల రాజబాబు, చిత్తలూరి ప్రసాద్,  కూసంపూడి రవీంద్ర, వందనపు భాస్కర్‌రావు, తడికమళ్ల యోబు, అయూబ్‌పాషా,నారాయణవరపు శ్రీనివాస్, కంభంపాటి మల్లికార్జున్, వెల్ది జగన్మోహన్‌రావు, ఎండీ ఫయాజ్, ఏ.శరత్, సంధ్య, తన్నీరు జమలయ్య, వెల్ది ప్రసాద్, డీఎన్ చారి, పింగళి శ్యామేలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు