వద్దే.. వద్దు

17 Feb, 2014 02:45 IST|Sakshi

 కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజల దృష్టంతా రాష్ట్ర విభజన అంశంపై కేంద్రీకృతమై ఉన్న ప్రస్తుత తరుణాన్ని ఆసరాగా తీసుకుని కడప సమీపంలో యురేనియం  స్టాక్‌పాయింట్  ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందా.. ఇందుకోసం తాడిగొట్ల గ్రామం వద్ద ఏపీఐఐసీ ద్వారా వెయ్యి ఎకరాల భూమి కేటాయించారా...కొద్దిరోజులుగా ఈ వార్తలు గుప్పుమంటున్నా ప్రభుత్వ వర్గాలు గుంభనంగా ఉండటం సందేహాలకు బలమిస్తోంది. ప్రజల ప్రాణాలకుముప్పు తెచ్చే యురేనియం స్టాక్ పాయింట్ ఏర్పాటును అడ్డుకుని తీరుతామంటూ వివిధ రాజకీయపార్టీలు, ప్రజాసంఘాల నేతలు ముక్తకంఠాన్ని ఆలపించారు. ఆదివారం సీపీఎం నగర కార్యదర్శి ఎన్.రవిశంకర్‌రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ కార్యాలయంలో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. కలెక్టర్, ఏపీఐఐసీ అధికారులను కలిసి నిజానిజాలు తెలుసుకోవాలని, ఒకవేళ స్టాక్ పాయింట్ ఏర్పాటే నిజమైతే అందుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఉద్యమించాలని నిర్ణయించారు.
 
 ప్రజల్లో చైతన్యం కలిగించి వారిని ఉద్యమానికి  సన్నద్ధం చేసేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు.యురేనియం భూమిలో ఉంటేనే సురక్షితమని, వెలికితీసి శుద్ధి చేయడం ద్వారా వెలువడే రేడియో యాక్టివిటీ  వివిధ దుష్ఫలితాలను కలిగిస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.నారాయణ పేర్కొన్నారు.  యురేనియం నుంచి వెలువడే కిరణాలు రెండు అడుగుల మందం కలిగిన సిమెంటు దిమ్మె నుంచి సైతం దూసుకెళ్లగలవన్నారు. శరీరంలోని జన్యువుల కోడ్స్‌నే మార్చి వేస్తాయన్నారు. యురేనియం వల్ల ప్రయోజనాల కంటే అనర్థాలే అధికమని గ్రహించిన అగ్రరాజ్యాలు తవ్వకాలను నిలిపి వేశాయన్నారు.
 
 అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాలలో అణు విద్యుత్‌ప్లాంట్ల ఏర్పాటును నిలిపి వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తుమ్మలపల్లెలో ఇప్పటికే తలెత్తిన దుష్ఫలితాలను విస్మరించరాదని సీపీఐ జిల్లా నాయకుడు పి.కృష్ణమూర్తి అన్నారు. కడప ప్రజలకు ప్రాణాంతకంగా పరిణమించే స్టాక్ పాయింట్ ఏర్పాటుకు ప్రారంభ దశలోనే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం పార్టీలు, సంఘాలు ఒక కమిటీగా ఏర్పాటై ఉద్యమించాలని సూచించారు. యురేనియం నిల్వ కేంద్రం వల్ల కలిగే దుష్ఫరిణామాల గురించి ప్రజలకు వివరించే దిశగా కార్యక్రమాల రూపకల్పన జరగాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పల్లా రాము సూచించారు.
 
 విద్యార్థులను ఉద్యమంలో భాగస్వామ్యులను చేసేందుకు కళాశాలల కరస్పాండెంట్లతో సమావేశాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. మానవ హక్కులవేదిక నాయకుడు సాధు జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రజల ఏమరపాటును ఆసరాగా తీసుకుని కడప సమీపంలో యురేనియం స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని ప్రయత్నించడం దారుణమన్నారు. స్టాక్ పాయింట్ ఏర్పాటును వ్యతిరేకించకపోతే ఓట్లు వేయబోమంటూ అన్ని పార్టీలకు స్పష్టం చేయాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ నాయకుడు సురేశ్వరరెడ్డి మాట్లాడుతూ స్టాక్‌పాయింట్‌లో జరగరానిది ఏదైనా జరిగితే ఊహించలేని నష్టం సంభవిస్తుందన్నారు. స్టాక్ పాయింట్ ఏర్పాటు వల్ల తమకు కాంట్రాక్టు పనులు వస్తాయని, లేదా తమ భూములకు విలువ పెరుగుతుందని ఎవరూ భావించరాదన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే తప్ప ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోలేమన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మిషన్ కార్యదర్శి ఎ.సంపత్‌కుమార్, దళిత ప్రజా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంగటి మనోహర్, ఏపీ బీసీ మహాసభ రాష్ట్ర కన్వీనర్ అవ్వారు మల్లికార్జున, షిండేభాస్కర్, టీడీపీ నాయకులు కట్టా రమేష్, ఏలియా, లోక్‌జనశక్తి పార్టీ జిల్లా కార్యదర్శి టి.బాష, ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేవీ రమణ, బహుజన సమాజ్‌పార్టీ నాయకుడు గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు