రాష్ట్రంలోనూ ‘సెమీస్’ ఫలితాలు!

9 Dec, 2013 01:58 IST|Sakshi


సాక్షి, హైదరాబాద్: నాలుగు రాష్ట్రాల్లో ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను తీవ్ర ఆందోళనలో పడేశాయి. మరో మూడు మాసాల్లో ఎన్నికలకు సిద్ధం కావలసిన సమయంలో సెమీఫైనల్స్‌గా భావించిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పరాజయం ప్రభావం కచ్చితంగా రాష్ట్రంపైన ఉంటుందని వారు విశ్లేషిస్తున్నారు. రాష్ట్ర విభజన అంశంపై ముందుకు వెళుతున్న ప్రస్తుత అయోమయ పరిస్థితులతో పాటు కాంగ్రెస్‌పై దేశవ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత.. ఇక్కడ కూడా పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుతోందని అంటున్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పనైపోయినట్టేనని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలోనైనా కచ్చితంగా అధికారంలోకి వస్తామన్న భరోసా నేతల్లో కనిపించడం లేదు.
 
 విభజన నిర్ణయం తీసుకోవడంలో తీవ్రంగా జాప్యం చేయడం, మార్పుచేర్పుల పేరుతో గందరగోళం సృష్టించడం వంటి కారణాలతో పాటు కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నప్పటికీ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల వల్ల మంచి ఫలితాలు వచ్చే నమ్మకం లేదంటున్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ బలమైన పార్టీగా నిలబడుతుందని పలు సర్వేల ద్వారా వెల్లడవుతున్న అంశాలు కూడా ఇక్కడి నేతలను ఆందోళనలో పడేస్తున్నాయి. దేశవ్యాప్తంగా యూపీఏ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్రకు అన్యాయం చేసిందన్న ప్రజల భావన వెరసి ఎన్నికల్లో సీమాంధ్రలో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులున్నాయని నేతలు మథనపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నారు.
 
 ఊహించిన ఫలితాలే: డీఎస్
 
 నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను తాము సీరియస్‌గా తీసుకోవడంలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు తాము ఊహించినవేనన్నారు. ఆదివారం సాయంత్రం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో మూడుసార్లు అధికారంలోకి వచ్చిన షీలా దీక్షిత్ ప్రభుత్వం నాలుగోసారి గెలవడం అంత సులభం కాదని తమ పార్టీకి తెలుసునన్నారు. మధ్యప్రదేశ్‌లో పార్టీ నేతల మధ్య సమన్వయ లోపంవల్ల ఓడిపోయామన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భావించామని, అరుుతే అక్కడి ఫలితాలు కొంత ఆశ్చర్యం కలిగించాయన్నారు. ఏమైనా నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు, రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
 
 సీఎం ఆనాడే ఎందుకు స్పందించలేదు: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హైకమాండ్ పెద్దలను వ్యతిరేకించడాన్ని డీఎస్ తీవ్రంగా తప్పుపట్టారు. విభజన నిర్ణయం తెలుగు జాతికి నష్టం కలిగించేలా ఉందని కిరణ్ భావిస్తే జూలై 30న సీడబ్ల్యూసీ విభజన నిర్ణయం తీసుకున్న వెంటనే సోనియాగాంధీని కలిసి సీఎం పదవికి రాజీనామా చేసి నిరసన ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే కిరణ్ సీఎం కావడానికి ముందుగానే హైకమాండ్ విభజన నిర్ణయం (2009 డిసెంబర్ 9న) తీసుకుందన్నారు. ఆ విషయం తెలిసినప్పటికీ కిరణ్ సీఎం పగ్గాలు ఎందుకు చేపట్టారో చెప్పాలన్నారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై అభిప్రాయాలు మాత్రమే చెబుతారు తప్ప ఓటింగ్ ఉండదని తెలిసినా బిల్లును ఓడిస్తామని సీఎం చెబుతున్నారంటే ఏమనాలో తనకు అర్ధం కావడం లేదన్నారు.
 
 విభజిస్తే పార్టీ పని అంతే: శైలజానాథ్
 
 నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ప్రజల మనోభావాలకు అద్దం పట్టాయని మంత్రి శైలజానాథ్ చెప్పారు. విభజన నిర్ణయంపై కేంద్రం ముందుకు వెళితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడుతుందని చెప్పారు. సీఎల్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో విభజన అంశం ప్రజలను తీవ్రంగా బాధిస్తోందన్నారు. కాగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆదివారం సాయంత్రం సీఎం కిరణ్‌ని కలిశారు. సోమవారం సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న నేపథ్యంలో ఆయన సీఎంను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ దారుణంగా ఓడిపోతుందని తాను ముందే వెల్లడించానని లగడపాటి చెప్పారు.
 

మరిన్ని వార్తలు