ప్రజాభీష్టానికి విలువివ్వండి

11 Jan, 2014 03:25 IST|Sakshi

ఒంగోలు, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడం చేతగాకనే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన అంశాన్ని తెరపైకి తెచ్చిందని వైఎస్సార్ సీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రాన్ని నిలువునా చీల్చి లబ్ధిపొందాలని చూస్తున్నాయని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 7వ తేదీ నుంచి నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో ముగిశాయి.
 
 దర్శిలో తాజా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త బూచేపల్లి శివ్రపసాద్‌రెడ్డి రిలే దీక్షను ప్రారంభించారు. 15 మంది నాయకులు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. నిత్యావసర వస్తువులు, వంట గ్యాస్ ధరలను భారీగా పెంచి సామాన్యుల నడ్డి విరిచారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కనిగిరిలో ఏడుగురు, వెలిగండ్లలో 26, హనుమంతునిపాడులో 20 మంది, పామూరులో 8 మంది దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్తలు ముక్కు కాశిరెడ్డి, కాటం అరుణమ్మ మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర సాధ్యం కావాలంటే విభజనపై చర్చ అనవసరమన్నారు. కేవలం సమైక్య తీర్మానం లేదా ఓటింగ్ ద్వారానే విభజన బిల్లును తిప్పికొట్టగలమన్నారు. ఆ విషయం తెలిసినప్పటికీ చర్చ పేరుతో కాంగ్రెస్, టీడీపీ నేతలు రచ్చ చేయడం బాధాకరమన్నారు. చర్చకు అంగీకరించడమంటే విభజనకు అంగీకరించినట్లేనన్నారు. ఇప్పటికైనా ప్రజాభీష్టాన్ని గుర్తించి సమైక్యాంధ్ర కోసం ఓటింగ్‌కు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
 
 మార్కాపురంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి రిలే దీక్షను ప్రారంభించారు. దీక్షలో 13 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంకె మాట్లాడుతూ.. సమైక్యమంటే అరెస్టులు చేయడం సరైన విధానం కాదన్నారు. సమైక్య తీర్మానం కోసం పట్టుబట్టిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
 
 చీరాలలో 10 మంది దీక్ష చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త సజ్జా హేమలత, ఎన్‌ఆర్‌ఐ విభాగం కార్యదర్శి యడం బాలాజీ దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒక వైపు అభిప్రాయాలు మాత్రమే చెప్పాలని దిగ్విజయ్‌సింగ్ పేర్కొంటుంటే, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నేతలు జనాల్ని మభ్యపెట్టేందుకు చర్చల పేరుతో హడావుడి ధ్వజమెత్తారు. కందుకూరు, వలేటివారిపాలెంలో దీక్షలు కొనసాగాయి. సమన్వయకర్త ఉన్నం వీరాస్వామి రిలే దీక్షలో పాల్గొనగా ఆయనకు సమన్వయకర్త తూమాటి మాధవరావు సంఘీభావం ప్రకటించారు.
 
 మద్దిపాడులో ఐదుగురు దీక్షలో కూర్చున్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, వరికూటి అమృతపాణి దీక్షను ప్రారంభించారు. పుల్లలచెరువులో 50 మంది రిలే దీక్షలు చేపట్టారు. వైపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజు దీక్ష ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమేనన్నారు. గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ముత్తుమల అశోక్‌రెడ్డి గిద్దలూరులో దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర కోరుతున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ఒంగోలులో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్, నగర కన్వీనర్‌లు స్వర్ణ రవీంద్రబాబు, రేలా అమర్నాథరెడ్డిలు పార్టీ జిల్లా కార్యాలయం ముందు రిలే దీక్ష చేపట్టారు. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి వైఎస్సార్ సీపీ జిల్లా అధికారప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, నగర అధికారప్రతినిధి రొండా అంజిరెడ్డి, నాయకుడు సింగరాజు వెంకట్రావు ప్రసంగించారు.
 
 

మరిన్ని వార్తలు