గోవిందుడు ఇక అందరివాడేలే!

19 Sep, 2019 10:51 IST|Sakshi

ధర్మకర్తల మండలిలో అన్ని సామాజికవర్గాలకు అవకాశం

టీటీడీ చరిత్రలో తొలిసారి ఆరు రాష్ట్రాలకు ప్రాధాన్యం

మొట్టమొదటిసారిగా తమిళనాడు ఎమ్మెల్యేకి చోటు

సామాజిక సమత్యులత పాటించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

దేవదేవుడు శ్రీవేంకటేశ్వరుడు అందరివాడు. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఏర్పాటులో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సామాజిక సమతుల్యత పాటిస్తూ అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతోనే సరిపెట్ట కుండా ఆరు రాష్ట్రాలకు చోటు కల్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుని శ్రీవారు అందరివాడుగా నిరూపించారు. 

సాక్షి,తిరుపతి : రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ధర్మకర్తల మండలిని ప్రకటిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. దేవాలయ పాలకమండలిలో సమప్రాధాన్యత కల్పిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆమేరకు ఆచరణలో చిత్తశుద్ధి ప్రదర్శించారు. టీటీడీ పాలకమండలిలో రెండు తెలుగు రాష్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో కూర్పు చేశారు. మహిళలు, ఎస్సీలు, బీసీలకు ప్రాధాన్యత కల్పించారు. చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితోపాటు మరో 28మంది సభ్యులతో నూతన పాలకమండలిని ప్రకటించారు. 

తొలిసారి తమిళనాడు ఎమ్మెల్యేకి చోటు
టీటీడీ పాలకమండలిలో కూర్పులో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పించి పరిశీలకులను ఆశ్చర్యచకితుల్ని చేసింది. చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డితోపాటు బోర్టు సభ్యులుగా ఎమ్మెల్యేలు రమణమూర్తిరాజు, మేడా మల్లికార్జునరెడ్డి, కొలుసు పార్థసారథి నియమితులయ్యా రు. వారితో పాటు మురళీకృష్ణ, వి.కృష్ణమూర్తి, ఎన్‌.శ్రీనివాసన్, జె.రాజేశ్వరరావు, వి.ప్రశాంతి, బి.పార్థసారథిరెడ్డి, డాక్టర్‌ ఎం.నిశ్చిత, ఎన్‌.సుబ్బారావు, డీపీ అనంత, రాజేష్‌శర్మ, రమేష్‌ శెట్టి, జీవీ భాస్కరరావు, మూరంశెట్టి రాములు, దామోదరరావు, చిప్పగిరి ప్రసాద్, శివశంకరణ్, సంపత్‌రవి నారాయణ, సుధా నారాయణమూర్తి, తమిళనాడుఎమ్మెల్యే కుమారగురు, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కె.శివకుమార్‌లను టీటీడీ సభ్యులుగా ప్రకటించారు. వారితో పాటు ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ, దేవదాయశాఖ కమిషనర్, తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్, టీటీడీ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌లను నియమించారు. ఆ మేరకు బుధవారం జీఓ ఎంఎస్‌ నంబర్‌ 405 ద్వారా ఉత్తర్వులు వెలువడ్డాయి. 

సమ ప్రాధాన్యం
తిరుమల వేంకటేశ్వరుని అన్ని వర్గాల ప్రజలు భక్తితో కొలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులున్నారు. ఈ క్రమంలో పాలకమండలిలో ఆంధ్రప్రదేశ్‌తో సరిపెట్టకుండా ఆరు రాష్ట్రాలకు ప్రాధాన్యత కల్పించారు. సామాజిక సమత్యులత పాటించారు. అన్ని ప్రాంతాలకు చోటు కల్పించడం సంచలన నిర్ణయంగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మహిళలు, ఎస్సీలు, బీసీలకు సమన్యాయం కల్పించి సామాజిక సమీకరణలో చిత్తశుద్ధిని చాటుకున్నారు.

23న ప్రమాణ స్వీకారం
ఏపీ ప్రభుత్వం నూతనంగా నియమించిన టీటీడీ పాలకమండలి సభ్యులు 23న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మూడు నెలల నిరీక్షణ తర్వాత ప్రభుత్వం బుధవారం టీటీడీకి నూతన ధర్మకర్తల మండలిని ప్రకటించింది. మూలమూర్తికి అభిముఖంగా బంగారు వాకిలి చెంత టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ సభ్యుల చేత ప్రమాణం చేయించనున్నారు. చివరగా ఈవో చేత ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి ప్రమాణం చేయిస్తారు. అనంతరం పాలకమండలి సమావేశం కానున్నట్లు తెలిసింది. ఆ మేరకు అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా