ఆర్‌ఎంపీతో సన్నిహితంగా ఉన్నవారి కోసం గాలింపు 

21 Apr, 2020 08:58 IST|Sakshi

తాడితోట (రాజమహేంద్రవరం): స్థానిక మంగళవారపుపేటలో కరోనా బాధితురాలికి చికిత్స చేసిన ఆర్‌ఎంపీకి కూడా పాజిటివ్‌ వచ్చిన నేపథ్యంలో అతడి ద్వారా మరి కొందరికి వైరస్‌ సంక్రమించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆ ఆర్‌ఎంపీకి మంగళవారపుపేటలో క్లినిక్‌ ఉండగా, ఆయన నివాసం నారాయణపురంలో ఉంది. అక్కడ కూడా అతడు చాలామందితో సన్నిహితంగా ఉండవచ్చని చెబుతున్నారు. అలాగే ధవళేశ్వరంలోని ఐఓసీఎల్‌ గృహాల్లో కూడా ఆయన కొంతమందితో సన్నిహితంగా ఉన్నాడని భావిస్తున్నారు.

దీంతో ఆయా ప్రాంతాల్లో ఆర్‌ఎంపీకి సన్నిహితంగా ఉండే వారి కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. అనుమానితులను క్వారంటైన్‌కు తరలించి, వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. మంగళవారపుపేటలో కరోనా పాజిటి వ్‌ వచ్చిన మహిళ ఆవ రోడ్డులోని బంధువులను కలిసినట్టు తెలియడంతో అక్కడి వాంబే గృహాల్లో మరో నలుగురిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. బొమ్మురు క్వారంటైన్‌లో 103 మందికి, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 86 మందికి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. 

రెడ్‌ జోన్లలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు 
రాజమహేంద్రవరం సిటీ: నగరంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన రెడ్‌జోన్లలో నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారపుపేట, నారాయణపురం వాంబే కాలనీ ఏరియా, 16వ డివిజన్‌ ప్రాంతాలతో పాటు మున్సిపల్‌ కాలనీని రెడ్‌ జోన్లుగా ప్రకటించి కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. వలంటీర్లు, ఆశ, హెల్త్‌ వర్కర్లు ఇంటింటా సర్వే చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ సోకిన వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు, రెడ్‌ జోన్లలో రాకపోకలపై కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని ట్యాంకర్లతో తీసుకు వచ్చి పిచికారీ చేస్తున్నారు.  

ఆర్‌ఎంపీ, పీఎంపీలు వైద్యం చేస్తే చట్టరీత్యా చర్యలు 
రాజమహేంద్రవరం క్రైం: ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు వైద్యం చేయడం చట్టరీత్యా నేరమని అర్బన్‌ జిల్లా ఎస్పీ షీమూషి బాజ్‌పేయి తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లాలో ఉన్న ఆర్‌ఎంపీ, పీఎంపీలు తమ వద్దకు ఎవరైనా దగ్గు, జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో వస్తే వారికి వైద్యం చేయకూడదన్నారు. దీన్ని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.    

మరిన్ని వార్తలు